బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ప్రమాదానికి గురయ్యాడు. హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రాజెక్ట్-కే షూటింగ్‌లో అమితాబ్ గాయపడ్డాడు. యాక్షన్ సీన్ చిత్రీకరణ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమితాబ్ ముంబైలోని తన నివాసంలో రెస్ట్ తీసుకుంటున్నాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో ప్రాజెక్ట్-కే సినిమా షూటింగ్ జరుగుతోంది. మార్చి 4న ఈ సినిమా షూటింగ్‌లో అమితాబ్ ప్రమాదానికి గురయ్యాడు. దీంతో అప్రమత్తమైన మూవీ యూనిట్
హుటాహుటిన అమితాబ్‌ను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించింది. ఈ ప్రమాదంలో అమితాబ్ పక్కటెముకలకు గాయాలైనట్లు తెలుస్తోంది. దాదాపు రెండు రోజులు పాటు అమితాబ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. రెండు వారాల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. ఆదివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవ్వగానే ముంబై వెళ్లిపోయాడు. అక్కడ తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ విషయాన్ని అమితాబ్ బచ్చన్ స్వయంగా తన బ్లాగ్ లో వెల్లడించారు. అయితే తనను కలిసేందుకు జల్సాకు ఎవరూ రాకూడదని తాను కలిసే పరిస్థితి లేదని, ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలని కూడా బిగ్ బీ కోరారు.
ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రాజెక్ట్-కే సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. దీపికా పదుకునే హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే 70శాతం షూటింగ్ కూడా పూర్తి అయింది. సై-ఫై జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి.