ఉన్నత శిఖరాలకు ఎదగాలి నాన్న
కరీంనగర్ సీపీకి పాలాభిషేకం
80 ఏళ్ల వృద్దురాలి ఆశీస్సులు
దిశ దశ, కరీంనగర్:
నీవు చల్లంగ ఉండాలి బిడ్డ… ఉన్నత శిఖరాలకు ఎదగాలి… నీ కుటుంబ సభ్యులందరూ ఉన్నత శిఖరాలవైపు పయనించాలి బిడ్డ అంటూ 80 ఏళ్ల వృద్దురాలు కరీంనగర్ సీపీ సుబ్బరాయుడును అభినందిస్తున్నారు. ఏకంగా ఆయన ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి మరీ ఆశీస్సులు ఇచ్చారు ఆ కురువృద్దురాలు.
ఇంతకీ ఏం జరిగిందంటే…
కరీంనగర్ క్రిస్టియన్ కాలనీలో ఎన్ శ్యామలా దేవి తన కుటుంబ సభ్యులతో జీవనం సాగిస్తున్నారు. వీరికి పూర్వీకుల నుండి సంక్రమించిన భూములు సిద్దిపేట సమీపంలోని అనంతసాగర్ లో ఉన్నాయి. ఈ భూములను ఐదేళ్ల క్రితం తిరుపతయ్య అనే వ్యక్తికి ఎకరాకు రూ. 2.70 లక్షల చొప్పున విక్రయించారు. 56 ఎకరాల భూమికి మొదట రూ. 55 లక్షలు అడ్వాన్స్ చెల్లించిన తిరుపతయ్య మిగతా డబ్బులు రూ. కోటి 5 లక్షలు రిజిస్ట్రేషన్ చేసుకున్న రోజున ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నారు. భూములు తమ పేరిట బదలాయించేందుకు రిజిస్ట్రేషన్ ఆఫీసుకు పిలిపించుకున్న తిరుపతయ్య ఆ రోజు రాత్రి 7 గంటల వరకు డబ్బులు వస్తున్నాయి వస్తున్నాయని మాటలు చెప్పి చివరకు పోస్ట్ డేటెడ్ చెక్కులు చేతులో పెట్టి అమ్మ మీ డబ్బులు మీకు అకౌంట్లో వేస్తాం ఇప్పుడైతే రిజిస్ట్రేషన్ చేయండని వేడుకోవడంతో శ్యామల దేవి సరే అని సమ్మతించి రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేశారు. రిజిస్ట్రేషన్ అయి ఇంటికి చేరుకున్న తరువాత చెక్కులను పరిశీలించిన శ్యామల దేవి కుటుంబ సభ్యులు వన్ మంతో పోస్ట్ డేటెడ్ చెక్కులు వేసి ఇచ్చారని గమనించారు. అప్పటి నుండి తిరుపతయ్య శ్యామలాదేవికి చిక్కకుండా తప్పించుకుంటూ తిరుగుతున్నారు. ఎనిమిది పదుల వయసుకు చేరిన శ్యామలమ్మ తన పూర్వీకుల ఆస్థులను అమ్మి వారసులను ఆదుకోవాలని ఆలోచించి అమ్మకానికి పెడితే తిరుపతయ్య చెక్కులు ఇచ్చి ముప్పు తిప్పలు పెడుతున్నాడని ఆవేదన చెందుతోంది. తనకు న్యాయం చేయాలని ఎంతో మంది పోలీసు అధికారులను, రాజకీయ నాయకులను కలిసినా ఆమెకు బాసటనిచ్చే వారే లేకుండా పోయారు. ఇటీవలే కరీంనగర్ సీపీగా బాధ్యతలు చేపట్టిన సీపీ సుబ్బరాయుడిని కలిసి తన గోడు వెల్లబోసుకోగా సీపీ క్రిమినల్ కేసులు నమోదు చేసి వృద్దురాలికి న్యాయం చేయాలని నిర్ణయించారు. దీంతో తిరుపతయ్య శ్యామలాదేవికి ఇవ్వవల్సిన రూ. కోటి 5 లక్షలు అప్పగించి తప్పు ఒప్పుకున్నాడు. ఐదేళ్లుగా అందరి కాళ్లా వేళ్లా పడ్డా తమకు న్యాయం జరగలేదని సీపీ సుబ్బారాయుడి కారణంగా తనకు రావల్సిన డబ్బు చేతికి వచ్చిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు శ్యామలమ్మ దీంతో ఆయన చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు శ్యామలదేవి కుటుంబ సభ్యులు. ఈ సందర్భంగా శ్యామలదేవి మాట్లాడుతూ… పూర్వీకుల నుండి సంక్రమించిన తమ ఆస్థి కొనుగోలు చేసిన తిరుపతయ్య మోసం చేశాడని ఈ విషయంపై ఎంతోమందిని కలిసినా ఫలితం రాలేదన్నారు. అయితే కరీంనగర్ సీపీ సుబ్బరాయుడుకు వినతి చేసుకోగానే తనకు న్యాయం చేశారని శ్యామల దేవి సంతోషం వ్యక్తం చేశారు. ఈ నగదును తన వారసులకు వాటాలుగా ఇచ్చేస్తానని, అనుకోని విధంగా తనకు, తన కుటుంబానికి బాసటగా నిలిచిన సీపీ సుబ్బరాయుడుకు రుణం తీర్చుకోలేనిదంటున్నారు. బాధ్యతల్లో ఉన్నత శిఖరాలకు ఎదగడమే కాకుండా సుబ్బారాయుడు కుటుంబ సభ్యులంతా కూడా ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు శ్యామలదేవి.