రాజాసింగ్ విషయంలో బీజేపీ
దిశ దశ, హైదరాబాద్:
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విషయంలో బీజేపీ అధిష్టానం వ్యూహత్మకంగా వ్యవహరించింది. ఆయనపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేసిన గంట వ్యవధిలోనే తొలి జాబితాలో రాజాసింగ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. ఆయన చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ అధిష్టానం రాజాసింగ్ ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ తరువాత ఆయనపై పీడీ యాక్టు నమోదు చేసి జైలుకు తరలించినప్పటికీ అధిష్టానం అంటీముట్టనట్టగా వ్యవహరించింది. అయితే ఆ సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న బండి సంజయ్ మాత్రం రాజాసింగ్ కు అనుకూలంగా వ్యవహరించారు. ఆయన సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరడమే కాకుండా ఆయనకు బెయిల్ ఇప్పించే విషయంలో కూడా చొరవ తీసుకున్నారన్న ప్రచారం ఉంది. అయితే అప్పటి నుండి కూడా బీజేపీ అధిష్టానం రాజాసింగ్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా హోల్డ్ లో పెట్టింది. ఎన్నికలు సమీపిస్తున్నా ఆయన సస్పెన్షన్ విషయంలో మాత్రం జాతీయ నాయకత్వం పట్టించుకోని వైఖరే అవలంభించింది. చివరకు అభ్యర్థులను ప్రకటించాల్సి రావడంతో ఆదివారం ఉదయం రాజా సింగ్ పై బీజేపీ విధించిన సస్పెన్షన్ ఎత్తి వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ తరువాత విడుదల చేసిన జాబితాలో గోషామహల్ అభ్యర్థిగా ఆయన్ను ఖరారు చేసింది.
రెండు చోట్ల…
హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తాను చేసిన ప్రకటనకు అనుకూలంగానే బీజేపీ జాతీయ నాయకత్వాన్ని ఒప్పించినట్టుగా స్పష్టం అవుతోంది. మొదటి నుండి కూడా తాను ముఖ్యమంత్రి కేసీఆర్ పై పోటీ చేస్తానంటూ ప్రకటిస్తూ వచ్చారు. ఇటీవల హుజురాబాద్ లో పర్యటించినప్పుడు కూడా తాను రెండు చోట్ల పోటీ చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆదివారం బీజేపీ విడుదల చేసిన జాబితాలో ఈటల రాజేందర్ ను హుజురాబాద్, గజ్వేల్ లలో అభ్యర్థిగా ప్రకటించడం గమనార్హం. దీంతో రాజేందర్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రత్యర్థిగా నిలబడనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెన్నంటి నడిచిన అనుచరుడే నేడు ప్రత్యర్థిగా బరిలో నిలుస్తుండడంతో గజ్వేల్ ఎన్నికలు రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయన్న చర్చ మొదలైంది.
మహిళలు ఎంతమందంటే..?
బీజేపీ విడుదల చేసిన తొలి జాబితాలో 52 మంది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో 12 మంది మహిళలకు అవకాశం కల్పించడం గమనార్హం. బెల్లంపల్లి నుండి అమరాజుల శ్రీదేవి, జుక్కల్ నుండి టి అరుణ తార, బాల్కొండ నుండి ఎలేటి అర్ణపూర్ణమ్మ, జగిత్యాల నుండి బోగ శ్రావణి, రామగుండం కందుల సంధ్యారాణి, చొప్పదండి నుండి బొడిగె శోభ, సిరిసిల్ల నుండి రాణి రుద్రమ రెడ్డి, చార్మినార్ నుండి మెఘా రాణి, నాగార్జున సాగర్ నుండి కంకణాల నివేదిత రెడ్డి, డోర్నకల్ నుండి భూక్యా సంగీత, వరంగల్ వెస్ట్ నుండి రావు పద్మ, భూపాలపల్లి నుండి చందుపట్ల కీర్తి రెడ్డిలకు బీజేపీ జాతీయ నాయకత్వం అవకాశం కల్పించింది. ఈ జాబితాలో బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చిన అసమ్మతి మహిళా నేతలిద్దరికి కూడా బీజేపీ అవకాశం కల్పించడం విశేషం.
ఆ రెండు చోట్ల హైలెట్…
అయితే ఈ సారి ఎన్నికల్లో మాత్రం రెండు స్థానాలు అత్యంత కీలకంగా మారనున్నాయి. బీజేపీ అభ్యర్థులను ప్రకటించిన వాటిల్లో గజ్వేల్ తో పాటు సిరిసిల్ల కూడా ప్రాధాన్యత సంతరించున్న నియోజకవర్గాల్లో ఒకటి కావడం విశేషం. ఇక్కడి నుండి రాష్ట్ర మంత్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీఆర్ పోటీ చేస్తుండడంతో ఆయనపై ఎవరు పోటీ చేసే వారి గురించి ఆరా తీసే వారు చాలామంది ఉంటారు. బీజేపీ తరుపున రాణి రుద్రమ పోటీ చేస్తుండడంతో ఈ సారి ఇక్కడి ఎన్నికల తీరు ఎలా ఉండనుంది అన్న అంశంపై చాలా మంది ఆసక్తి చూపే అవకాశాలు ఉన్నాయి.
బీజేపీ ఫైర్ బ్రాండ్స్ ఇక్కడే…
బీజేపీ ఫైర్ బ్రాండ్ లుగా ముద్రపడ్డ ఇద్దరు ముఖ్య నేతలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండే పోటీ చేస్తుండడం విశేషం. ఇక్కడి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ నుండి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జగిత్యాల జిల్లా కోరుట్ల నుండి పోటీ చేస్తుండడం గమనార్హం. రాష్ట్ర బీజేపీ నాయకుల్లో ఈ ఇద్దరు ఎంపీలు ప్రత్యర్థి పార్టీల నాయకులపై విమర్శనాస్త్రాలు సంధించే తీరుతో ఫైర్ బ్రాండ్ లుగా పేరుగడించారు. ఈ ఇద్దరు నాయకులు కూడా ఉమ్మడి జిల్లాలో పోటీ చేస్తుండడం చర్చనీయాంశం.