కన్నకొడుకు కోసం పండుటాకుల విల విల…

దిశ దశ, భూపాలపల్లి:

వృద్దాప్యానికి చేరుకున్న ఆ తల్లిదండ్రుల అన్వేషణ గురించి తెలిస్తే కంటతడి పెట్టిస్తోంది. ఆ పండుటాకులు పడుతున్న ఆవేదన వింటే మనసు చలించిపోతోంది. తమ కన్న కొడుకు కోసం ఊరు కాని ఊర్లలో  వెతుకుతున్న ఆ దంపతులను గమనించిన ప్రతి ఒక్కరూ అయ్యో పాపం అంటూ సానూభూతి చూపిస్తున్నారు. ఈ వయసులో కూడా తన కడుపున బిడ్డ జాడ కోసం గాలిస్తూనే ఉన్నారు. మానసిక స్థితి బాగో లేని  నా కొడుకా ఎక్కడున్నావురా అంటూ ఆ దంపులు అతని కోసం  వెతుకుతూనే ఉన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వృద్ద  దంపతుల ఆవేదనకు అసలు కారణం వింటే… కడుపున బిడ్డ కోసం ఎంత తాపత్రయ పడుతున్నారో అర్థం అవుతుంది. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం టేకుర్తి గ్రామానికి చెందిన కన్నూరి గౌరమ్మ, నర్సయ్య దంపతులు 20 రోజులుగా తమ కొడుకు కోసం ఆరా తీస్తు వివిధ ప్రాంతాల్లో తిరుగుతున్నారు. ఆరు పదుల వయసు పైబడి ఉన్న ఈ వృద్ద దంపతులు మతిస్థిమితం లేని తమ కన్న బిడ్డ ఆచూకి దొరకడం లేదని తల్లడిల్లిపోతున్నారు. గౌరమ్మ, నర్సయ్య దంపతులకు నలుగురు కూతుర్లు, ముగ్గురు కుమారులు జన్మించగా అందరికంటే చిన్నవాడయిన అనిల్ మతి స్థిమితం కోల్పోయాడు. గత 20 రోజుల క్రితం ఇంటి నుండి వెల్లిపోయిన అనిల్ ఆచూకి కోసం వీరు రెండు రోజులుగా భూపాలపల్లి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సంచరిస్తు తమ కొడుకు ఎక్కడైనా కనిపించాడా అంటూ అడుగుతున్నారు. వృద్దాప్యానికి చేరుకున్న ఈ దంపతులు తమ కడుపున పుట్టిన బిడ్డ మానసిక స్థితి బాగా లేకపోవడంతో ఏమై పోయాడోనని కలవరపడిపోతున్నారు. కనిపించిన వారినల్ల తమ బిడ్డ అనిల్ ఆనవాళ్లు చెప్తూ ఎక్కడైనా ఆగుపిస్తే తమకు చెప్పండని వేడుకుంటున్నారు. మానసిక పరిస్థితి బాగాలేని తమ కొడుకు ఆగమై పోతాడేమోనన్న బాధతో ఆ తల్లిదండ్రులు ఊరు వాడా అనకుండా తిరుగుతూ వెతుకుతున్న తీరు పలువురిని కలిచి వేస్తోంది. జిల్లాలోని కాటారం మండల కేంద్రంలో వీరు తమ కొడుకు కోసం ఆరా తీస్తున్న విషయాన్ని గమనించిన స్థానికులు వారిని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. తమ బిడ్డ ఎక్కడైనా కనిపిస్తే సమాచారం ఇవ్వాలంటూ ఆ వృద్ద దంపతులు అభ్యర్థిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని కన్నీటి పర్యంతం చేస్తోంది.

You cannot copy content of this page