చెవిలో పూలు… చేతిలో యాపిల్

వేములవాడ పోలీసుల వినూత్న కార్యక్రమం

దిశ దశ, వేములవాడ:

రాజన్న సన్నిధికి వెల్లి పూజలు చేసిన వారు లింగంపై ఉన్న పూవును తీసుకుని తమ చెవిలో పెట్టుకునే భక్తులను చూస్తుండడం సహజం. కానీ అక్కడ బైక్ పై వెల్తున్న చాలా మంది చెవిలో పూలు కనిపిస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. బైక్ లపై వెల్తున్న వారి చెవిలో పూలు ఎందుకు పెట్టుకుంటున్నారు..? కొత్తగా సెంటిమెంట్ ఏమైనా ప్రచారం జరిగిందా లేక రాజన్న క్షేత్రంలో భక్తులు విధిగా పూలు పెట్టుకోవాలన్న నిభందన ఏమైనా పెట్టారా అనుకుంటున్నారా… అలాంటిదేమీ లేదు కానీ బైక్ వాలాలు మార్పు రావాలన్న ఉద్దేశ్యంతో హెల్మెట్ లేని వారి చెవిలో పూలు పెట్టే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు.

ట్రాఫిక్ రూల్స్ పాటించండి బేఫికర్ గా జీవనం సాగించండి అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు వేములవాడ పోలీసులు. నిభందనలు అమలు చేస్తామని చెప్పకనే చెప్తున్న పోలీసులు సున్నితంగా వివరిస్తూ కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే నెంబర్ ప్లేట్ లేని వాహనాలకు నో ఎంట్రీ బోర్డు పెట్టగా తాజాగా హెల్మెట్ గురించి అవగాహన కల్పించారు. ఇందుకు సంబంధించిన డెడ్ లేన్ కూడా పూర్తి కావడంతో ఇక చట్టాలకు పని చెప్తామని స్పష్టం చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపట్టిన వేములవాడ పోలీసులు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న ద్విచక్ర వాహనదారులను గుర్తించి వారికి చెవిలో పూలు పెట్టి హెల్మెట్ ఆవశ్యకత గురించి వివరించారు. అదే సమయంలో హెల్మెట్ పెట్టుకుని వెహికిల్ నడుపుతున్న వారిని అభినందిస్తూ వారికి యాపిల్ ఇచ్చి పంపిస్తున్నారు. వేములవాడ బైపాస్ రోడ్డులో డీఎస్పీ నాగేంద్ర చారి ఆధ్వర్యంలో టౌన్ సీఐ వెంకటేష్, ట్రాఫిక్ ఎస్సై దిలీప్ లు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్న వారిని ఆపి పోలీసు అధికారులే చెవిలో పూలు పెట్టి పంపించారు. హెల్మెట్ ఉన్నవారికి ఆపిల్ పండు అందించి అభింనందించిన అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సందర్భంగా డీఎస్పీ నాగేంద్ర చారి మాట్లాడుతూ… రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా వేములవాడ పట్టణంలో వాహనదారులకు 15 రోజులుగా వివిధ రకాలుగా అవగాహన కల్పించామన్నారు. శనివారం నాటితో ఈ అవగాహన కార్యక్రమం ముగుస్తుందని, ఆదివారం నుండి వాహనాదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాల్సిందేనన్నారు. పట్టణంలో హెల్మెట్ వాడకం తప్పనిసరి చేశామని, హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యల్లో భాగంగా జరిమానాలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్క వాహనాదారుడు నిబంధనలు పాటించి “సేఫ్ వేములవాడ” గా తీర్చిదిద్దడంలో భాగస్వాములు కావాలని డీఎస్పీ నాగేంద్రచారీ పిలుపునిచ్చారు.

హెల్మెటె లేని బైకిస్ట్ చెవిలో పూవు పెడుతున్న సీఐ

You cannot copy content of this page