ఐసీస్ ఉగ్రవాదిని అరెస్ట్ చేసిన డిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు
దిశ దశ, న్యూ ఢిల్లీ:
మరో వారం రోజుల్లో దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించనున్న నేపథ్యంలో దేశ రాజధాని న్యూ ఢిల్లీ మళ్లీ ఉగ్ర వాదుల కదలికలు వెలుగులోకి వచ్చాయి. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు ఉనికిని పసిగట్టిన పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఉదయం న్యూ ఢిల్లీ, ఫరిదాబాద్ ఏరియాలో స్పెషల్ సెల్ పోలీసుల బృందం ఐఎస్ఐఎస్ ఉగ్రవాది రిజ్వాన్ అలీని అరెస్ట్ చేశారు. ఈ ఉగ్రవాది నుండి పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్ఐఏ ఇతనిపై రూ. 3 లక్షల రివార్డు కూడా ప్రకటించింది. రిజ్వాన్ అలీ ఐసీస్ కు చెందిన పూణే మాడ్యూల్ విభాగంలో ఉన్నాడని పోలీసులు వర్గాలు చెప్తున్నాయి. గతలో మహారాష్ట్రలోని పూణే పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేయగా జులై 2023లో కస్టడీ నుండి తప్పించుకున్నాడు. అప్పటి నుండి కూడా రిజ్వాన్ అలీ కోసం పోలీసులు, ఎన్ఐఏ ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ‘‘ఉపా’’ యాక్టు కేసుల్లో ఉన్న రిజ్వాన్ అలీతో పాటు మరో నలుగురు టెర్రరిస్టులకు సంబంధించిన ఫోటోలను ఎన్ఐఏ విడుదల చేసింది. మహ్మద్ షానవాజ్ గత సెప్టెంబర్ నెలలో అరెస్ట్ కాగా, అబ్దుల్లా ఫయాజ్ అలియాస్ డైపర్ వాలా పరారీలో ఉన్నాడు. తల్హా లియాఖత్ గురించి పూర్తి సమాచారం అందలేదు. అయితే రిజ్వాన్ అలీని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అతని నెట్ వర్క్ తో పాటు స్థావరానలు గుర్తించే పనిలో నిమగ్నం అయ్యారు. ఢిల్లీ పోలీసులు కూడా గురువారం ఖాన్ మార్కెట్ ఏరియాలో అల్ ఖైదా, ఖలిస్తాన్ టెర్రరిస్టులకు సంబంధించిన పోస్టర్లను అతికించారు. మొత్తం 15 మంది ఉగ్రవాదులు ఉండగా వీరిలో ఏడుగురు అల్ ఖైదాకు చెందిన వారిగా పోస్టర్లలో వెల్లడించారు.
హై అలెర్ట్…
78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ రాజధానిపై డేగ కళ్లతో నిఘా వర్గాలు దృష్టి సారించాయి. పోలీసు బలగాలను కూడా పెద్ద ఎత్తున ఈ మోహరించారు. కూడళ్లతో పాటు రద్దీ ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసు అధికారులు అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించాలని నిర్ణయించారు. ముఖ్యంగా మోటార్ వర్క్ షాపులు, గ్యారేజీలపై నజర్ వేశారు ఢిల్లీ పోలీసులు. వాహనాలను రిపేర్టు చేయించడం కానీ మాడిఫై చేయడం వంటివి ఏమైనా జరిగినట్టయితే వాటి వివరాలను, యజమానులకు సంబంధించిన డాటాను సేకరించాలని కూడా పోలీసు అధికారులు ఆదేశించినట్టు సమాచారం. అంతేకాకుండా రెండు మూడు నెలల్లో నిర్దిష్టమైన సమాచారం లేకుండా కొరియర్ ఏజెన్సీల ద్వారా జరిగిన పార్శిల్ డెలివరీలను కూడా గుర్తించాలని ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా అంతర్ రాష్ట్ర సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి భద్రత చర్యలపై సమీక్ష నిర్వహించారు. స్వాతంత్ర్య వేడుకలు ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా ఉండాలని, సంఘ విద్రోహ శక్తుల ఉనికిని పసిగట్టి వారిని ఎక్కడికక్కడ కట్టడి చేయాలని ఆదేశించినట్టుగా తెలుస్తోంది.