దిశ దశ, కరీంనగర్:
కాసుల కోసం కక్కుర్తి పడిన ఓ అధికారి పదవి విరమణకు చేరువలో ఉన్న విషయాన్ని కూడా మర్చిపోయి ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు. అంతా నా ఇష్టం అన్నట్టుగా వ్యవహరించిన అదికారి తీరుతో వేగలేకపోయిన బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు ఘరానా అవినీతి అధికారిని రెడ్ హైండెడ్ గా పట్టుకున్నారు. కరీంనగర్ జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ మేనేజర్ రేగులపాటి వెంకటేశ్వర్ రావు, క్యాషీయర్ సూదగోని కుమారస్వామిలు రూ. లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి నేతృత్వంలోని బృందం పట్టుకుంది. వీరిని కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని డీఎస్పీ మీడియాకు తెలిపారు.
కొనుగోలు కేంద్రం కమిషన్…
రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేసే బాధ్యతలు డీసీఎమ్మెఎస్ కూడా తీసుకుంది. అయితే డీసీఎమ్మెఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంది. ఇందులో భాగంగా కావటి రాజు అనే వ్యక్తికి 2018-19 ఖరీఫ్ సీజన్ లో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసుకునేందుకు అనుమతించారు డీసీఎమ్మెఎస్ అధికారులు. కొనుగోలు కేంద్రాల ద్వారా వచ్చే కమిషన్ లో సగం సంస్థకు సగం ఏజెంటుకు ఇవ్వాలన్న ఒప్పందం కూడా ఉంది. రాజుకు డీసీఎమ్మెఎస్ ద్వారా రూ. 90లక్షల 16 వేల 632 రావల్సి ఉండగా, తన కమిషన్ ఇప్పించాలని కొంతకాలంగా మేనేజర్ వెంకటేశ్వర్ రావును అభ్యర్థిస్తున్నాడు. అయితే అతని కమిషన్ ఇవ్వకుండా మేనేజర్ వాయిదా వేసుకుంటూ వస్తున్నాడు.
ఎరువులు అమ్మి…
సంస్థ సరఫరా చేస్తున్న ఎరువులు విక్రయించి ఆ డబ్బును కమిషన్ కింద తీసుకోవాలన్న కండిషన్ మేనేజర్ వెంకటేశ్వర్ రావు విధించారు. దీంతో బాధితుడు రాజు ఎరువుల దుకాణం పర్మిషన్ తీసుకుని ఫెర్టిలైజర్స్ విక్రయించడం మొదలు పెట్టాడు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం బాయమ్మపల్లికి చెందిన రాజుకు నిబంధనల ప్రకారం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యానికి కమిషన్ ఇవ్వకుండా ఎరువుల అమ్మే బాధ్యతలు కూడా అప్పగించి ఆ డబ్బును కమిషన్ కింద జమ చేసుకోవాలని సలహా ఇచ్చాడు. ఇందుకు ప్రతి లారీకి రూ. 13 వేల చొప్పున వీరికి కమిషన్ ఇవ్వాల్సి ఉంటుందని, ఆయనను ఫెర్టిలైజర్ వ్యాపారంలోకి దింపారు. అయితే ఎరువుల విక్రయం ద్వారా తన కమిషన్ డబ్బులు వసూలు చేసుకుంటున్న రాజుకు ఇంకా సంస్థ నుండి రూ. 69 లక్షలకు పైగా రావల్సి ఉంది. మిగతా డబ్బును ఇప్పించాలని ఈ నెల 1న మేనేజర్ వెంకటేశ్వర్ రావును అభ్యర్థించాడు. అయితే ఆయన మాత్రం కమిషన్ ఇవ్వడానికి నిరాకరించి రాజు కమిషన్ కు 15 లారీల ఎరువులు వస్తాయని, వాటిని అమ్ముకోవాలని సూచించాడు. అంతేకాకుండా మూడు లారీలకు ఒక లారీ చొప్పున తనకు లంచంగా ఇవ్వాలని కూడా వెంకటేశ్వర్ రావు డిమాండ్ విధించారు. దీంతో తనకు రావల్సిన కమిషన్ విషయంలోనూ కొర్రీలు పెడుతున్నారని ఆవేదన చెందిన కావేటి రాజు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు వెంకటేశ్వర్ రావు వద్దకు వెల్లి తాను మూడు లారీలకు ఒక లారీ చొప్పున లంచం ఇవ్వలేనని వేడుకోవాలని సూచించారు. దీంతో తిరిగి మేనేజర్ వద్దకు వెల్లిన రాజు తనకు రావల్సిన కమిషన్ తాలుకు డబ్బుల్లో రూ. 90 లక్షల్లో రూ. 22 నుండి రూ. 23 లక్షల వరకు లంచంగా ఇవ్వాల్సి వస్తుందని తనపై భారం పడుతున్నందున లంచంగా ఇవ్వాల్సిన డబ్బులు తగ్గించాలని మరోసారి వేడుకున్నాడు. దీంతో లారీకి రూ. లక్ష చొప్పున లంచంగా ఇవ్వాలని మొత్తం 15 లారీలకు గాను రూ. లక్ష చొప్పున తనకు లంచం ఇవ్వాలని, దీంతో సంస్థ ఇచ్చే కమిషన్ కూడా చెల్లుతుందని చెప్పాడు. ఒక లారీ లోడు ఎరువులకు రూ. లక్ష ముందుగానే చెల్లించినట్టయితే స్టాక్ పంపిస్తామని మేనేజర్ వివరించాడు. ఇందుకు సమ్మతించానని చెప్పిన రాజు మరోసారి ఏసీబీ అధికారుల వద్దకు చేరుకుని జరిగిన విషయం వివరించాడు. ఈ మేరకు ఏసీబీ అధికారులు రూ. లక్ష లంచం తీసుకుంటుండగా గురువారం మేనేజర్ వెంకటేశ్వర్ రావు, క్యాషీయర్ సూదగోని కుమారస్వామిలను పట్టుకున్నారు.
డీసీఎమ్మెఎస్ మేనేజర్ వెంకటేశ్వర్ రావు ట్రాప్ కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేయండి