ఐదు గంటల నరక యాతన…

మధ్యప్రదేష్ కు వెళ్లిన పోలీస్ టీమ్స్

అదుపులో ఇద్దరు అనుమానితులు

దిశ దశ, పెద్దపల్లి:

పెద్దపల్లి జిల్లాలో జరిగిన గ్యాంగ్ రేప్ వ్యవహారంలో ఒక్కో విషయం వెలుగులోకి వస్తోంది. మైనర్ బాలికను ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ లోకి తీసుకెళ్లిన నిందితులు ఐదు గంటల పాటు గ్యాంగ్ రేప్ కు పాల్పడినట్టుగా ప్రచారం జరుగుతోంది. వాచ్ మెన్ తో పాటు మరో ముగ్గురు చిన్నారిని బలవంతంగా లాక్కెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా బాధితురాలు చెప్పిన ఆడియోను బట్టి అర్థమవుతోంది. మైనర్ పై కర్కషంగా వ్యవహరించడంతో ఆమె మరణానికి దారి తీసినట్టుగా భావిస్తున్నారు.

బిల్డింగ్ ఓనర్ తీరిలా…

అయితే బిల్డింగ్ యజమాని ఈ వ్యవహారంలో వ్యవహరించిన తీరుకూడా విమర్శలకు దారి తీస్తోంది. బాధితురాలి పరిస్థితిని గమనించి వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చినట్టయితే ఆమె ప్రాణాలయినా దక్కేవన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే హుటాహుటిన ఆమెను స్వగ్రామమైన మధ్యప్రదేష్ కు ప్రత్యేక వాహనంలో తరలించడంతో మార్గమధ్యలోనే చనిపోయింది. కనీసం చికిత్స అందించేందుకు కూడా చొరవ తీసుకోకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. తను సమస్యల్లో ఇరుక్కుంటానని భావించిన యజమాని బాధితురాలిని హుటాహుటిన మధ్యప్రదేష్ కు పంపించాడని భావిస్తున్నారు. అయితే ఈ కేసు విషయం పోలీసుల దృష్టికి రాగానే అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

అదుపులో ఇద్దరు…

గ్యాంగ్ రేప్ కు పాల్పడిన వారి కోసం పోలీసులు వేట మొదలు పెట్టారు. రామగుండం సీపీ రెమా రాజేశ్వరీ నేతృత్వంలో దర్యాప్తు వేగవంతంగా సాగుతోంది. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నట్టు సమాచారం. మరో వైపున ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఉన్నట్టయితే వాటి ఫుటేజీతో పాటు ఇతరాత్ర ఆధారాల కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మొబైల్ నెంబర్లను కూడా ట్రేస్ చేసేందుకు సాంకేతికతను అందిపుచ్చుకుని కూడా విచారణ చేపట్టినట్టుగా తెలుస్తోంది. నిందితుంలదరినీ పట్టుకునే విషయంలో స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయని తెలుస్తోంది. మరో వైపున ఏసీపీ ఎడ్ల మహేష్ నేతృత్వంలో రెండు పోలీసు బృందాలు మధ్యప్రదేష్ కు కూడా వెల్లినట్టు సమాచారం. మరో వైపున అప్పన్నపేట శివ పార్వతి నగర్ లో ఉన్న వలస కార్మికులను వేరే ప్రాంతానికి తరలించడంతో ఇప్పటి వరకు వారు నివాసం ఉన్న గుడారాలన్ని కూడా ఖాలీగా ఉన్నాయి.

నిబంధనల మాటేమిటో…?

గ్యాంగ్ రేప్ ఘటనతో మరో విషయం కూడా వెలుగులోకి వస్తోంది. వలస కార్మికులను తీసుకొచ్చుకుంటున్న కాంట్రాక్టర్లు వారి వివరాలను లేబర్ ఆఫీసర్ కార్యాలయాల్లో నమోదు చేస్తున్నారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. వలస కూలీల ఆధార్ కార్డులతో సహా అన్ని వివరాలను రికార్డు చేసి వారిచే పనులు చేయించుకోవాలన్న నిబంధనలు చెప్తున్నాయి. అంతేకాకుండా వారికి అవసరమైన వసతితో పాటు ఇతరాత్ర ఫెసిలిటీస్ కూడా కల్పించాల్సి ఉంది. కానీ పెద్దపల్లి జిల్లాలో వలస కార్మికుల విషయంలో ఇలాంటి నిబంధనలకు ఎప్పుడో మంగళం పాడినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో పెద్ద ఎత్తున ఇటుక బట్టీలు కూడా ఉండడంతో పాటు, రామగుండం పారిశ్రామిక ప్రాంతం కూడా ఉండడంతో లేబర్ విభాగం అధికార యంత్రాంగం కొరడా ఝులిపించాల్సి ఉంది. కానీ చాలా వరకు కాంట్రాక్టర్లు లేబర్ ను ఇతర రాష్ట్రాల నుండి తీసుకొస్తున్నా వారి వివరాలను మాత్రం కార్మిక శాఖలో నమోదు చేయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వచ్చినప్పుడు మాత్రం హడావుడి చేస్తున్న అధికారులు ఆ తరువాత పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

You cannot copy content of this page