ఆస్కార్ అందుకున్న నాటు నాటు పాట
అంతర్జాతీయంగా అత్యున్నత శిఖరాలను చేరుకుంది మన తెలుగు సినీ రంగం. అనుకున్నట్టుగానే ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాట నాట్యం చేసేసింది. ఆస్కార్ వేదికపైకి వెళ్లిన కీరవాణి, చంద్రబోసులు అవార్డును అందుకుని ఉబ్బితబ్బియ్యారు. హాలీవుడ్ గడ్డపై తెలుగు సంచలనంగా నిలిచిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్ లోని ‘నాటునాటు’ పాట గెలుపు బావుటా ఎగురేసింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ పురస్కారాన్ని ముద్దాడి తెలుగింటి గొప్పతనన్నానికి అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టింది. ప్రపంచ సినీ రంగ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుగా భావించే ఆస్కార్ పురస్కారాన్ని అందుకోవడం తెలుగు రాష్ట్రాలో కాదు యావత్ భారత దేశం కూడా సంతోషాల్లో మునిగి తేలుతోంది. 95వ ఆస్కార్ అవార్డుల వేడుకల్లో నాటునాటు పాటకు ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్ వరించడం విశేషం. ఆస్కార్‌ను దక్కించుకున్న తొలి భారతీయ గీతంగా నాటునాటు మరో రికార్డును సొంతం చేసుకుంది. హాలీవుడ్ పాటలను తలదన్ని చివరి అంకానికి చేరిన నాటు నాటు పాట తన నాటుదనంతోనే ముందు వరసలో నిలబడింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణి కుమారుడు కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ లు పాడగా చంద్రబోస్ రచించిన ఈ గీతానికి కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. చంద్రబోస్ కలం నుండి జాలు వారిన అక్షర మాలకు స్వరార్చనకు తగ్గ సంగీతం, అందుకు తగిన నాట్యం తోడు కావడం వల్లే అత్యున్నత పురస్కారానికి ఎంపికైంది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ లు ఈ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసి సీనీ అభిమానలు నోట ఔరా అనిపించారు. ప్రేమ్‌రక్షిత్ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించగా ఈ మూవీని ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించారు. ఈ సినిమా ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ ఛాయిస్ ఆవార్డులు సాధించి తాజాగా ఆస్కార్ గెలుచుకుంది. రిహాన్నా పాడిన లిఫ్ట్ మి అప్, టేలర్ స్విఫ్ట్ పాడిన కరోలినా, లేడీ గగా పాడిన హోల్డ్ మై హ్యాండ్ పాటలను వెనక్కి నెట్టి.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డును కైవసం చేసుకున్న తొలి ఆసియా పాటగా నాటు నాటు నిలవడం దేశానికే గర్వ కారణం. మరో ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ అవార్డు క్రిటిక్స్ ఛాయిస్‌ను కూడా నాటు నాటు దక్కించుకోవడం మరో విశేషం. ఇందులో ఉత్తమ విదేశీ భాషా చిత్రం అవార్డును ‘RRR’ దక్కించుకుంది. కరోలినా, సియావో పపా, హోల్డ్ మై హ్యాండ్ పాటలతో నాటు నాటు పోటీపడింది. ఉత్తమ పాట విభాగంలో హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్-HCA అవార్డును సైతం నాటు నాటు కొల్లగొట్టింది. HCA అవార్డుల్లో బెస్ట్ యాక్షన్ ఫిల్మ్, బెస్ట్ స్టంట్స్, ఉత్తమ అంతర్జాతీయ చిత్రం విభాగాల్లో ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం HCA అవార్డులను దక్కించుకుంది. బెస్ట్ సాంగ్ విభాగంలో హ్యూస్టన్ ఫిల్మ్ క్రిటిక్ సొసైటీ అవార్డును కూడా నాటునాటు అందుకుంది.
మెగా అభినందనలు
ట్రిపుల్ ఆర్ మూవీ యూనిట్ కు మెగాస్టార్ అభినందనలు తెలియజేశారు. ట్విట్టర్ వేదికగా చిరంజీవి తన ఆనందాన్ని పంచుకున్నారు. అలాగే మాజీ ఉప రాష్ట్ర ప్రతి వెంకయ్యనాయుడు కూడా అస్కార్ అందుకున్న సందర్భంగా అభినందనలు తెలిపారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి జక్కన అభినందనలు తెలిపారు.