దీపావళి వస్తుందంటే చాలు చాలా మంది ఇండ్లకు రంగులేసి… ఇళ్లంతా శుభ్రం చేసి రంగవళ్లులు వేసి ఇంటిని శోభాయమానంగా అలంకరించుకుని పండుగ చేసుకుంటారు. పండుగలు నిర్వహించడమంటే ఇలా చేయడమనే ఆలోచనలతోనే ఉంటారు చాలా మంది. పర్వదినం సందర్భంగా తమవారిని స్మరిస్తూ వారి సన్నిధిలోనే సంబరాలు చేసుకుంటారు వీరు. మరణించిన తమ వారి సన్నిధిలో టపాసులు కాల్చి అంగరంగ వైభవంగా పండగ చేసుకుంటారు. చాలా కాలంగా వస్తున్న ఈ ఆనవాయితీ కరీంనగర్ జిల్లాతో పాటు పలు చోట్ల పాటిస్తున్నారు. కరీంనగర్ నడి బొడ్డున ఉన్న శ్మశాన వాటిక వేదికగా సమాధుల పండగ చేస్తూ తమ పూర్వీకులను స్మరించుకునే ఆనవాయితీ వస్తోందిక్కడ.
పండుగ రోజు అందరూ ఇళ్ల ముందు దీపాలు వెలిగిస్తే వీరు మాత్రం సమాధుల ముందు దీపాలు వెలిగించి టపాసులు కాల్చి దీపావళి పండుగను జరుపుకుంటారు. ఈ ఆచారాన్ని ఆరు దశాబ్దాలకు పైగా కొనసాగిస్తున్నారు కరీంనగర్ కు చెందిన వారు. వింత ఆచారం శ్మశానంలో దీపావళి వేడుకలు జరుపుకోవడం తమ
పూర్వీకుల నుండి వస్తున్న ఆచారమని చెప్తున్నారు వీరు. ఏటా శ్మశానంలోనే దీపావళి పండుగ పురస్కరించుకుని ముందుగానే శ్మశాన వాటికకు చేరుకుని తమ పూర్వీకుల సమాధులను శుభ్రం చేయడంతో పాటు వాటికి ప్రత్యేకంగా రంగులు కూడా వేస్తారు.
చాలా మంది పర్వదినాల నాడు శ్మశానల వైపు కన్నెత్తి చూసేందుకు సాహసించకపోగా అదో అపచారం అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు. కానీ వీరు మాత్రం తమ పూర్వీకుల ఆచార వ్యవహారాలను తూ.చ తప్పకుండా పాటిస్తూ ఏటా అంగరంగ వైభవంగా దీపావళి సంబరాలు శ్మశానంలోనే చేసుకుంటున్నారు. ఆరు దశబ్దాలకు పైగా శ్మశానంలోనే దీపావళి పండుగను జరుపుకునే సాంప్రదాయం కోనసాగిస్తున్నామని వారు చెప్తున్నారు. మరణించిన తమ పూర్వీకులను స్మరించుకుంటూ ఖననం చేసిన శ్మశాన వాటికలోని సమాధుల వద్ద దీపాలు వెలిగించి వేడుక చేసుకుంటామన్నారు. కరీంనగర్ లోని కార్ఖాన గడ్డలో ఉన్న హిందు శ్మశాన వాటికలో ఏటా దళిత కుటుంబాలు శ్మశానంలోని తమ పూర్వీకుల సమాధుల వద్దనే దీపావళి పండుగను జరుపుకుంటాయి.
చనిపోయిన వారి సమాధుల వద్దకు కుటుంబ సభ్యులంతా వెళ్లి అక్కడ అంత శుభ్రం చేసిన తరువాత పూలతో సమాధులను అలంకరిస్తారు. దీపావళి నాడు సమాధులను ముస్తాబు చేసి పండగ రోజును సాయంత్రం కుటుంబ సభ్యులంతా సమాధుల వద్దకు చేరుకుని అక్కడే గడుపుతారు. సమాధుల వద్ద పండుగ జరుపుకుంటే తమ వారితో కలిసి ఉన్నామన్న భావన వస్తుందని స్థానికులు చెప్తున్నారు. అందుకోసమే చిన్నా,పెద్దా అనే తేడా లేకుండా అందరూ తమ పూర్వీకులకు ఇష్టమైన వంటలు కూడా వండి సమాధుల వద్ద నైవేధ్యంగా పెడతారు. పితృ దేవతలకు నైవేద్యాలు సమర్పించిన అనంతరం వారిని స్మరించుకుంటూ వారి సమాధుల వద్ద ఆయా కుటుంబీకులు పూజలు చేస్తారు. ఇదీ కాస్త వింత గానే ఉన్నప్పటికీ చనిపోయిన వారి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ పండుగను జరుపుకోవడంలో ఆనందాన్ని అనుభవిస్తున్నారు. కరీంనగర్ తో పాటు ఉమ్మడి జిల్లాలోని కొన్ని చోట్ల కూడా ఈ విధానాన్ని అమలు చేస్తుంటారు. దీపావళి పండుగ సందర్భంగా చేస్తున్న వింత ఆచారాల్లో ఇది ఒకటిగా గుర్తింపు పొందింది.