దిశ దశ, హైదరాబాద్:
అనారోగ్యం బారిన పడి చికిత్స చేయించుకునేందుకు ఆర్థిక పరిస్థితులు సహకరించని వారిని ఆదుకునేందుకు అందించే ముఖ్యమంత్రి సహాయ నిధి దరఖాస్తుల స్వీకరణ విధానంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేర్పులు తీసుకవచ్చింది. ఇక నుండి ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేసిన సర్కార్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా వెబ్ సైట్ రూపొందించింది. ఈ సైట్ ను మంగళవారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి పట్టాయన్న ఆరోపణల నేపథ్యంలో ఇక నుండి పారదర్శకంగా సీఎంఆర్ఎఫ్ నిదులు అందించేందుకు ఆన్‌లైన్ విధానానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 15 నుండి ఆన్‌లైన్‌లో సీఎంఆర్ఎఫ్ ద్వారా దరఖాస్తులు అప్ లోడ్ చేయాల్సి ఉంటుందని సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ నిధి కింద సహాయం అందించాల్సిన పూర్తి వివరాలను, డాక్యూ మెంట్లను ఆన్‌లైన్‌లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ లో లబ్దిదారుల బ్యాంకు అకౌంట్ నంబర్ తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది. అప్ లోడ్ అయిన తరువాత సీఎంఆర్ఎఫ్ వింగ్ నుండి ఇచ్చే కోడ్ ఆధారంగా ఒరిజనల్ మెడికల్ బిల్లులను సీఎంఆర్ఎఫ్ విభాగంలో అందజేయాల్సి ఉంటుంది. ఆన్ లైన్ ద్వారా చేసుకున్న అప్లికేషన్ లను సంబంధిత ఆస్పత్రులకు పంపించి నిర్ధారణ చేసుకున్న తరువాతే ఆర్థిక సహాయం చేస్తారు. చెక్ పై దరఖాస్తు దారుడి బ్యాంక్ అకౌంట్ ముద్రించిన తరువాత ప్రజా ప్రతినిధులు చెక్కులను లబ్దిదారులకు అందిస్తారు. https//cmrf.telangana.gov.in\ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులు అందుబాటులోకి తీసుకవస్తోంది తెలంగాణ ప్రభుత్వం.