వేతనం ఇక్కడ… పని అక్కడ…


రాజన్న క్షేత్రంలో ఇష్టారాజ్యం…

దిశ దశ, వేములవాడ:

పేదల దేవుడు ఎములాడ రాజన్న క్షేత్రంలో పెద్దలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారా..? దేవుని సేవలో తరలించాల్సిన ఉద్యోగులు తమ స్వార్థ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారా..? రాజన్న సన్నిధిలో కొంతమంది కిందిస్థాయి ఉద్యోగులచే వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారా..? నెట్టింట వైరల్ అవుతున్న ఆడియోలు మాత్రం అవుననే చెప్తున్నాయి. రాజన్న క్షేత్రంలో డ్యూటీలు చేస్తే వేతనాలు చెల్లించాల్సిన కింది స్థాయి వారిచే తమ ఇండ్లలో చాకిరీ చేయించుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై ఉద్యోగులు మాట్లాడుకున్న ఆడియోలు నెట్టింట వైరల్ కావడంతో రాజన్న ఆలయ అధికారులపై మరో సారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆలయ సూపరింటిండెంట్ వరి నర్సయ్య తన ఇంట్లో పనికి తమను వాడుకుంటున్నారని ఆలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టెంపుల్ సూపరింటిండెంట్ తన భవనంలోని బియ్యం బస్తాలు కిందకు దింపుకున్నాడని, పురుగులు పట్టిన ఆ బస్తాలు దించిన తరువాత పై ఫ్లోర్ ను శుభ్రం చేయించుకుని చివరి అంతస్థులో సిమెంట్ పనులు కూడా చేయించాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పీఆర్వో చంద్రశేఖర్ ఇంట్లోనూ తమను పనికి పురమాయించారని కూడా ఆలయ ఉద్యోగులు వాపోతున్నారు.

పర్యవేక్షణ ఏమైంది..?

టెంపుల్ లో మాత్రమే ఉద్యోగులచే పనులు చేయించాల్సింది పోయి తమ ఇండ్లలో కూడా వాడుకుంటున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజన్న ఆలయంలో సాగుతున్న ఈ తతంగం కట్టడి చేసేందుకు పర్యవేక్షించిన పై అధికారులు పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారుల అజమాయిషీ లేకపోవడంతో పాటు స్థానికులే ఈ ఆలయంలో ఎక్కువమంది ఉద్యోగులుగా పనిచేస్తుండడం వల్లే ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారన్న ఆవేదన కిందిస్థాయి ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఆడియోలను దృఫ్టిలో పెట్టుకుని లోతుగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది.

You cannot copy content of this page