దిశ దశ, జగిత్యాల:
భక్తులకు కొంగు బంగారంగా నిలిచే కొండగట్టు అంజన్న సన్నిధిలో ఇంటి దొంగలు చోరకళను ప్రదర్శిస్తున్నారు. తమ కోర్కెలు తీర్చిన అంజన్నకు భక్కులు చెల్లించే మొక్కులను గుట్టు చప్పుడు కాకుండా హస్తలాఘవాన్ని ప్రదర్శిస్తున్నారు. హుండీ లెక్కింపు సమయంలో ఇటువంటి ఘటనలు సర్వ సాధారణంగా మారిపోవడం చర్చనీయాంశంగా మారింది. గతంలో ఆలయంలో కీలక బాధ్యతల్లో ఉన్న ఒకరు బంగారు నగను దొంగలించినట్టుగా సీసీ కెమెరాల్లో నమోదు కాగా ఆయనపై దేవాదాయ శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. అయితే ఆయన కోర్టును ఆశ్రయించి యథావిధిగా తన బాధ్యతల్లోనే కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది.
లడ్డు తయారీ ఉద్యోగి…
బుధవారం అంజన్న ఆలయంలో హుండీ లెక్కింపు చేపట్టారు ఆలయ అధికారులు. ఈ లెక్కింపు సమయంలో నిఘాను కట్టదిట్టం చేసినప్పటికీ చోరకళ ప్రదర్శించే వారు మాత్రం తమవైఖరిని మార్చుకోవడం లేదు. లడ్డు ప్రసాదం తయారు చేసే విభాగంలో పని చేసే ఓ ఉద్యోగి కూడా హుండీ లెక్కింపులో పాల్గొంటూ రూ. 10 వేల నగదును దొంగలించారు. హుండి లెక్కింపులో పాల్గొన్న ఇతర ఉద్యోగులు ఈ విషయాన్ని గమనించి అతన్ని పోలీసులకు అప్పగించారు. దీంతో లడ్డూ తయారు చేసే సదరు ఉద్యోగికి చేదు అనుభవం ఎదురైనట్టైంది.