అగ్రనేత ఇలాకాలో అన్నల అలజడి…?

ప్రజా ప్రతినిధులకు స్ట్రాంగ్ వార్నింగ్…

ఏనాడూ లేని విధానం… లేఖలపై అనుమానం…

దిశ దశ, జగిత్యాల:

మావోయిస్టు పార్టీ అగ్రనేత, అంతర్జాతీయ విప్లవ సమూహాల కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ముప్పాళ లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి ఇలాకాలో మావోయిస్టు పార్టీ పేరిట విడుదలైన లేఖలు కలకలం సృష్టిస్తున్నాయి. గతంలో ఏనాడు లేని విధంగా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిదులకు జారీ అయిన ఈ లేఖలు సంచలనంగా మారాయి. భూ దందాలకు పాల్పడుతున్నారని, అటవీ భూములు అక్రమించుకుంటున్నారని పేర్కొంటూ రాసిన ఈ లేఖలు చర్చనీయాంశంగా మారాయి. జగిత్యాల జిల్లా బీర్సూర్ మండలంలోని నర్సింహులపల్లికి చెందిన 14 మందితో పాటు మండలంలోని 12 మంది సర్పంచులు, ఒక ఎంపీపీ, ఎంపీటీసీలను లక్ష్యం చేసుకుని ఈ లేఖలు విడుదల అయ్యాయి. అయితే బీర్పూర్ బ్లాస్టింగ్ తరువాత పీపుల్స్ వారే కావచ్చు, మావోయిస్టు పార్టే కావచ్చు బీర్పూర్ ప్రాంతంపై ఎక్కువగా దష్టి సారించిన సందర్బాలు తక్కువేనని చెప్పాలి. అనూహ్యంగా ఇప్పుడు బీర్పూర్ మండల ప్రజా ప్రతినిధులను టార్గెట్ చేస్తూ విడుదల అయిన లేఖలు హాట్ టాపిక్ గా మారాయి.

గోదావరి బెల్ట్ ఏరియా కమిటీ..!

మావోయిస్టు పార్టీ పేరిట బీర్పూర్ మండలానికి చెందిన పలువురిని టార్గెట్ చేస్తూ విడుదలైన లేఖలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధానంగా ఒక లెటర్ హెడ్ పై గడ్చిరోలి జిల్లా ఏరియా కమిటీ, మరో లెటర్ హెడ్ పై జగ్దల్ పూర్ జిల్లా ఏరియా కమిటీ అని హిందీలో, మరో లెటర్ హెడ్ పై మల్యాల ఏరియా కమిటీ అని తెలుగులో ప్రింట్ చేయించినట్టుగా ఉంది. ఈ మూడు లేఖలు కూడా గోదావరి బెల్ట్ ఏరియా కమిటీ మావోయిస్టు కార్యదర్శి మల్లిఖార్జున్ పేరిట విడుదల అయ్యాయి. రాష్ట్రంలో మావోయిస్టు పార్టీ ఉనికి కోల్పోయిన తరువాత తెలంగాణ రాష్ట్ర కమిటీతో పాటు మహబూబాబాద్, భూపాలపల్లి, పెద్దపల్లి, భద్రాద్రి జిల్లాలకు ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేసి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు మావోయిస్టులు. గోదావరి పరివాహక ప్రాంత జిల్లాలను కలుపుతూ ఈ కమిటీని ఏర్పాటు చేశారు. అలాగే ఏటూరునాగారం, మహాదేవపూర్ ఏరియా కమిటీ పేరిట కూడా కొన్ని ప్రకటనలు ఇచ్చారు. చత్తీస్ గడ్ దండకారణ్య అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఈ ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఈ కమిటీలు మాత్రమే ఉన్నాయి. రాష్ట్ర స్థాయి అంశాలపై తెలంగాణ కమిటీ పేరిట ప్రకటనలు విడుదల చేస్తున్నారు. అయితే తాజాగా జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల ప్రజా ప్రతినిధలుకు విడుదలైన లేఖలో మాత్రం గోదావరి బెల్ట్ ఏరియా కమిటీ అని పేర్కొనడం గమనార్హం.

డికె ఏరియా కమిటీలపైనా..?

మరో వైపున చత్తీస్ గడ్, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో విస్తరించిన మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు ఆయా ఏరియా కమిటీలు, జోనల్ బ్యూరోల పేరిట దండకారణ్య ప్రాంతానికి చెందిన బాధ్యులు ఆ ప్రాంతానికి సంబంధించిన విషయాల్లో ప్రకటనలు విడుదల చేస్తుంటాయి. కానీ బీర్పూర్ మండల ప్రజా ప్రతినిధులకు వచ్చిన రెండు లెటర్ ప్యాడ్స్ లలో గడ్చిరోలి జిల్లా, జగ్దల్ పూర్ జిల్లా ఏరియా కమిటీల పేరుపై ప్రింట్ చేయించడం అనుమానాలకు తావిస్తోంది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో భామ్రాఘడ్, అహేరి, పరిమెళి, తదితర సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న దళాల కదలికలు ఉన్నాయి. ఆ ప్రాంతాన్ని దండకారణ్య ప్రాంతాన్ని అనుభందగాన్ని మావోయిస్టులు పరిగణనలోకి తీసుకుంటున్నారు. పశ్చిమ సబ్ జోనల్ బ్యూరో, గడ్చిరోలి, దండకారణ్యం ఏరియా పేరిట మావోయిస్టు పార్టీ ప్రకటనలు ఇస్తుంటుంది. అలాగే ఆయా ఏరియా దళాల పేరిట కూడా ప్రకటనలు చేస్తుంటుంది. కానీ బీర్పూర్ మండల నాయకులకు వచ్చిన లేఖల్లో మాత్రం గడ్చిరోలి జిల్లా ఏరియా కమిటీ అని హిందిలో ప్రింట్ చేయించి ఉండడం పోలీసులకు అనుమానం కల్గిస్తోంది. మరో వైపున దండకారణ్య ప్రాంతానికి హెడ్ క్వార్టర్ గా ఉన్న బస్తర్ ఏరియాకు సంబందించి దక్షిణ బస్తర్ సబ్ జోనల్ బ్యూరో పేరిట కానీ ఇతర ప్రాంతాల పేరిట కానీ ప్రకటనలు విడుదల అయ్యాయి. జగ్దల్ పూర్ జిల్లా ఏరియా కమిటీ పేరిట ఇటీవల కాలంలో ఎలాంటి ప్రెస్ నోటో విడుదల కాలేదు. ఒక వేళ ఆ జిల్లాకు కమిటీ ఏర్పాటు చేసుకున్నా ఇంతకాలం బస్తర్ జిల్లా కమిటీగానే పరిగణించారు తప్ప జగ్దల్ పూర్ జిల్లా కమిటీగా మాత్రం ప్రకటించిన దాఖలాలు లేవు. జగ్దల్ పూర్ జిల్లా ఏరియా కమిటీ కాకుండా జగ్దల్ పూర్ పేరిట ఇతరాత్ర కమిటీలు ఉండే అవకాశాలు ఉన్నాయి కానీ జిల్లా కమిటీ మాత్రం ఉండే అవకాశాలు లేవని తెలుస్తోంది.

తెలంగాణాకు ఏం సంబధం..?

మరో వైపున తెలంగాణ రాష్ట్ర కమిటీని అదికారికంగా మావోయిస్టు పార్టీ కొనసాగిస్తోంది. అడపాదడపా విడుదల చేస్తున్న ప్రకనలు జగన్ పేరిట వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దండకారణ్య ఏరియాకు సంబంధించిన జిల్లా కమిటీల పేరిట మావోయిస్టులు తెలంగాణాలోకి జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల ప్రజా ప్రతినిధులకు హెచ్చరికలు జారీ చేయడం ఏంటన్నది అంతు చిక్కకుండా పోతోంది. రాష్ట్రంలో పునర్ వైభవం కోసం ప్రయత్నిస్తున్న మావోయిస్టు పార్టీ జగిత్యాల జిల్లాలో ఇప్పటి వరకు ఎలాంటి కమిటీలను ఏర్పాటు చేయనందున తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరిట లేఖలు విడుదల చేసే అవకాశం ఉంటుంది కానీ దండకారణ్య ప్రాంతానికి సంబంధించిన గడ్చిరోలి, జగ్దల్ పూర్ జిల్లా కమిటీలను ఊటంకించాల్సి అవసరం అయితే లేదన్నది వాస్తవం. ఐదారేళ్ల క్రితం కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అవకతవకలపై మావోయిస్టులు కొంతమందిని టార్గెట్ చేస్తూ లేఖలు విడుదల చేశారు. అప్పుడు కూడా తెలంగాణ ప్రాంత ఏరియాల పేరిటనే హెచ్చిరికలు జారీ చేస్తూ లేఖలు పంపించారు కానీ మహారాష్ట్ర, చత్తీస్ గడ్ రాష్ట్రాలకు సంబంధించిన జిల్లాల పేర్లను ఊటంకిచలేదన్న విషయం గమనించాల్సి ఉంది. అంతేకాకుండా జగిత్యాల జిల్లా కమిటీ కానీ, కరీంనగర్ ఉమ్మడి జిల్లా కమిటీ కానీ లేకుండానే ఏకంగా మల్యాల ఏరియా కమిటీ ఏర్పాటు చేసే అవకాశాలు ఉంటాయా అన్నది కూడా అనుమానంగా ఉంది. గోదావరి బెల్ట్ ఏరియా కమిటీ కార్యదర్శి మల్లిఖార్జున్ పేరిట లేఖలు విడుదల అయినప్పుడు అదే ఏరియా కమిటీ పేరిట లెటర్ ప్యాడ్స్ సిద్దం చేసుకోకపోవడం వెనక ఆంతర్యం ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది.

లక్ష్యం బోగ సత్తన్న..!

మావోయిస్టు పార్టీ పేరిట విడుదలైన మూడు లేఖల్లో కూడా నర్సింహులపల్లెకు చెందిన బోగ సత్తన్న కిరాణం షాపును కూల్చాలంటూ ప్రత్యేకంగా పేర్కొనడం విశేషం. ఆయనకు ప్రజా కోర్టులో శిక్ష తప్పదంటూ ప్రస్తావించిన తీరుపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బోగ సత్తన్న కిరాణం షాపు లక్ష్యం చేసుకుని కావాలనే హెచ్చరికలకు పాల్పడ్డారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

You cannot copy content of this page