అన్నారం కూడా ఖాళీ… కారణం ఏందీ..?

తగ్గుముఖం పట్టిన బ్యాక్ వాటర్

దిశ దశ, భూపాలపల్లి:

కాళేశ్వరం ప్రాజెక్టులోని మరో బ్యారేజీ కూడా ఖాళీ అవుతోంది. మేడిగడ్డ కుంగిపోయిన తరువాత అన్నారంలో అయినా నీళ్లు ఉంటాయని ఆశించినప్పటికీ అన్నారం బ్యాక్ వాటర్ కూడా దిగువకు వదిలేస్తున్నారు ఇరిగేషన్ అధికారులు. దీంతో సుందిళ్ల బ్యారేజ్ లో మాత్రమే బ్యాక్ వాటర్ మిగిలిపోయింది.

కారణమదేనా..?

అయితే ఇటీవల అన్నారం బ్యారేజీ గేట్లకు దిగువన బుంగ పడడంతో బ్యాక్ వాటర్ అంతా కూడా ఖాళీ అవుతున్న పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇరిగేషన్ అధికారులు బుంగ పడిన ప్రాంతంలో కాంక్రీట్, ఇసుక బస్తాలను వేయించారు. ఈ విషయంలో వెలుగులోకి రాగాన బ్యారేజీ దిగువన బుంగలు పడడం మెయింటనెన్స్ లో భాగమేనని అధికారులు ప్రకటించారు. గతంలో ఓ సారి ఇలాగే బుంగలు పడడంతో ఢిల్లీ నుండి నిపుణులను రప్పించి వారి సలహాల మేరకు బుంగలను క్లోజ్ చేయించామని అధికారులు చెప్పుకొచ్చారు. దీనివల్ల బ్యారేజీకి ఎలాంటి ముప్పు లేదని ప్రటించిన అధికారులు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఖండించారు. అయితే ఇరిగేషన్ అధికారులు ప్రకటించిన 24 గంటల్లోగానే నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ బృందం ఇచ్చిన నివేదిక వెలుగులోకి వచ్చింది. మేడిగడ్డ తరహాలోనే అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్మించారని వాటికి కూడా ముప్పు తప్పదని, ఈ రెండు బ్యారేజీలను కూడా క్షుణ్ణంగా పరిశీలించాలని అభిప్రాయపడింది. దీనికి కౌంటర్ గా ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కూడా ఎన్డీఎస్ఏ బృందానికి ఘాటుగా రిప్లై ఇచ్చారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించకుండానే ఎలా నిర్దారిస్తారంటూ ప్రశ్నించారు. దీంతో తెలంగాణ అధికారుల వాదనలు కూడా నిజమే కదా అన్న అభిప్రాయం వ్యక్తం అయింది. కాళేశ్వరం విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వాన్ని కావాలనే ఇరుకున పెట్టాలన్న కుట్రలు చేస్తోందంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ వెలువవడ్డాయి. కానీ అనూహ్యంగా గత రెండు మూడు రోజులుగా అన్నారం బ్యారేజీ బ్యాక్ వాటర్ ను దిగువకు వదులుతుండడం సరికొత్త చర్చకు దారి తీస్తోంది. అటు విమర్శలు చేస్తూనే ఇటు అన్నారం బ్యారేజీని ఖాళీ చేస్తుండడం వెనక ఆంతర్యం ఏంటన్నదే మిస్టరీగా మారిపోయింది. బ్యారేజ్ నిజంగానే డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉందా లేకపోతే మరేదైనా కారణం ఉందా అన్న చర్చ మొదలైంది. అన్నారంలో నిలువ ఉన్న నీటిని అయినా ఎగువ ప్రాంతాలకు పంపించినట్టయితే కొంతమేర అయినా భూములకు నీళ్లు అందేవి కదా వృధాగా ఎందుకు వదిలేస్తున్నారన్న ప్రశ్న తలెత్తుతోంది. బ్యారేజీ పటిష్టంగా ఉన్నట్టయితే బ్యాక్ వాటర్ ను అలాగే ఉంచినట్టయితే భవిష్యత్తులో కూడా ఎగువ ప్రాంతాలకు ఎత్తిపోస్తే ఉపయోగపడే అవకాశాలు ఉంటాయని అంటున్న వారూ లేకపోలేదు. ఉన్నట్టుండి అన్నారం నీటిని వదిలేయడానికి కారణం ఏంటన్నదే అంతుచిక్కకుండా పోతోంది.

అన్నారం వివరాలివే…

అన్నారం బ్యారేజీలో గత జూన్ వరకు అన్నారం బ్యారేజీలోకి ఇన్ ఫ్లో 411.464 టీఎంసీలు కాగా, 385.852 టీఎంసీల నీటిని దిగువకు వదిలారు. అయితే నవంబర్ 3 నుండి ఎగువ ప్రాంతాల నుండి వచ్చే వరద అంతగా లేకున్నప్పటికీ దిగువకు నీటిని వదిలేస్తుండడం గమనార్హం. నవంబర్ 3న ఇన్ ఫ్లో 6680 క్యూసెక్కుల నీరు బ్యారేజీలోకి చేరగా 15 గేట్ల ద్వారా 20408 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. నవంబర్ 5న 6572 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా ఏడు గేట్ల ద్వారా 7165 క్యూసెక్కుల నీటిని వదిలారు. నవంబర్ 6 సోమవారం నాడు 2450 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో రాగా, ఔట్ ప్లో 20 2041 క్యూసెక్కులు ఉంది. ప్రస్తుతం బ్యారేజీలో నవంబర్ 3 వరకు 119 మీటర్ల మేర నీటి మట్టం ఉండాల్సి ఉన్నప్పటికీ 116.10 వరకే ఉండగా, 10.87 టీఎంసీలకు గాను 5.25 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. గత సంవత్సరం మాత్రం 117.11 మీటర్ల మేర నీటి మట్టంతో 6.84 టీఎంసీల నీరు నిలువ ఉంది. సోమవారం నాటికి బ్యారేజీలో 112.100 మీటర్ల నీటి మట్టానికి తగ్గగా 1.43 టీఎంసీల నీరు మత్రమే నిలువ ఉంది. ప్రస్తుతం ఈ బ్యారేజీ నుండి 2 గేట్ల ద్వారా దిగువకు నీటిని వదులుతున్నారు అధికారులు. బ్యారేజీ గేట్ల సమీపంలో నీరు తగ్గముఖం పట్టిన తరువాత బంగలకు సంబంధించిన సమస్యతో పాటు ఎన్డీఎస్ఏ బందం ఇచ్చిన సూచన మేరకు బ్యారేజీని అణువు అణువు తనిఖీ చేసి లోపాలను సవరించే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

You cannot copy content of this page