అన్నారంపై వస్తున్న వార్తల్లో నిజం లేదు: డీఈఈ

దిశ దశ, భూపాలపల్లి:

అన్నారం బ్యారేజీకి సంబంధించి వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదు… బ్యారేజీకి ఎలాంటి ప్రమాదము లేదు… ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ లో భాగంగా చిన్న రిపేర్లు చేస్తున్న క్రమంలో ఇలాంటివ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ వదంతులను ప్రజలు ఎవరూ నమ్మవలసిన అవసరం లేదు. అంటూ అన్నారం బ్యారేజీ డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ ఇరిగేషన్ సబ్ డివిజన్ 1, 2 పేరిట సోషల్ మీడియాలో ఓ ప్రకటన వైరల్ అవుతోంది. బుధవారం ఉదయం నుండి అన్నారం బ్యారేజీ గేట్లకు దిగువ ప్రాంతంలో బుంగ పడిందని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. రెండు మూడు రోజుల నుండి ఈ బుంగను పూడ్చేందుకు కూడా ఇరిగేషన్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని కూడా అన్నారం ప్రాంతంలో ప్రచారం జరుగుతోంది. ప్రత్యేకంగా కూలీలను కూడా ఏర్పాటు చేసి బుంగను పూడ్చేందుకు ఇసుక బస్తాలు, కాంక్రిట్ బ్యాగ్స్ నాటు పడవల ద్వారా పంపించి మరీ వేయించారు. అయితే బుధవారం ఉదయం ఈ విషయం వెలుగులోకి వచ్చినా సాయంత్రం వరకు అధికారులు మీడియాకు ఎలాంటి ప్రకటన విడుదల చేయకపోవడం గమనార్హం.

మెయింటనెన్స్ వారిదే: ఈఈ యాదగిరి

‘‘అన్నారం బ్యారేజ్‌పై మీడియాలో, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుంది… బ్యారేజ్‌కు ఎలాంటి ప్రమాదం లేదు.

అన్నారం బ్యారేజ్‌కు ఢోకా లేదు. పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు రూమర్లు నమ్మవద్దు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

ప్రతి సంవత్సరం సహజంగా ఆపరేషన్ మైంటేనెన్స్
చేస్తాం. 1275 మీటర్స్ లెంగ్త్ లో రెండు చోట్ల సీపేజ్ ఉంది. కానీ, ఎక్కడ కూడా ఇసుక రావడం లేదు.

ఇరిగేషన్ శాఖ మరియు ఆఫ్కాన్స్ సంస్థల మధ్య కాంట్రాక్టు ఉంటుంది. దాని నిర్వహణ బాధ్యత వాళ్లదే.

సీపేజ్ ఉన్న చోట నీళ్లు తగ్గినప్పుడు మెటల్, సాండ్, ఫిల్టర్ మీడియా వేస్తున్నాం. సాండ్ తోని రింగ్ బండ్ కూడా వేస్తున్నాం.

ప్రతి ఏటా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ మైంటెనెన్స్ ఉంటుంది. ప్రాజెక్టు తట్టుకునే విధంగా సీపేజ్ వాటర్ అలో చేసేందుకు డిజైన్లోనే ఆరెంజ్మెంట్ ఉంటుంది. అవసరమైతే కెమికల్ గ్రౌటింగ్ కూడా వేస్తాం.

ఏ. యాదగిరి, ఎగ్జిక్యుటివ్ ఇంజినీర్, అన్నారం బ్యారేజి’’
ఇలాంటి ప్రకటనలు సోషల్ మీడియా వేదికగా బుధవారం సాయంత్రం నుండి విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.

You cannot copy content of this page