ఆయన కోసం ఆమె… ఆమె కోసం ఆయన…

జగిత్యాల ఆసుపత్రిలో దంపతుల అన్యోన్యత

ఆసుపత్రి సిబ్బంది తీరుపై విమర్శలు…

దిశ దశ, జగిత్యాల:

అనారోగ్యం బారిన పడ్డ భర్తను సర్కారు దవాఖానాలో చేర్పించిన భార్య ఆయన బాగోగులు చూసుకుంటోంది. ఓ చేయికి గాయం అయినా భర్త ఆసుపత్రిలో ఉండడంతో ఆయనకు సపరి చర్యలు చేసేందుకు వెంట వచ్చింది. వారం రోజులుగా ఆసుత్రిలోనే ఉన్న ఆమె రెండు రోజులుగా హైబీపీ బారిన పడడంతో తన భర్తకు ఇచ్చిన బెడ్ పై పడిపోయింది. దీంతో ఆసుపత్రి సిబ్బంది ఆమెను తీసుకొచ్చి ఆసుపత్రి బయట దింపడంతో భార్య కోసం భర్త కూడా బయటకు వచ్చేశాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తిరిగి ఆ దంపతులిద్దరిని  ఆసుపత్రికి తరలించారు.

జగిత్యాల జిల్లా కేంద్రంలో…

జిల్లాలోని గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన రాజనర్సు అనారోగ్యానికి గురి కావడంతో వారం రోజుల క్రితం జగిత్యాలలోని పెద్దాసుపత్రికి తీసుకొచ్చి చికిత్స అందిస్తోంది అతని భార్య మల్లవ్వ. అయితే మల్లవ్వ చేతికి కూడా గాయం అయినప్పటికీ భర్త ఆరోగ్యం బాగుపడాలని పరితపించి ఆయనకు సపరిచర్యలు చేస్తోంది. ఈ క్రమంలో రెండు రోజులుగా హైబీపీతో బాధ పడుతున్న మల్లవ్వ కూడా సొమ్మసిల్లి పడిపోతోంది. ఈ క్రమంలో తన భర్తకు ఆసుపత్రిలో అలాట్ చేసిన బెడ్ పై ఉన్న మల్లవ్వను గమనించిన ఆసుపత్రి సిబ్బంది ఆమెను వీల్ ఛైర్ పై ఆసుపత్రి నుండి బయటకు తీసుకొచ్చి రోడ్డు పక్కన దింపి వెల్లిపోయారు. తన అనారోగ్యానికి గురైన తన భార్యను దవాఖాన సిబ్బంది బయటకు తీసుకెల్తున్న విషయాన్ని గమనించిన రాజనర్సు తన రోడ్డు పక్కన పడుకుని ఉన్న తన భార్య వద్దకు చేరుకున్నాడు. మల్లవ్వతో పాటు ఉన్న రాజనర్సును గమనించిన స్థానికులు జగిత్యాల టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. టౌన్ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మల్లవ్వ, రాజనర్సులను ఆసుపత్రికి తరలించారు.

గతంలోనూ…

జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి ఘటనలు సర్వసాధరణంగా మారిపోయాయన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో కూడా ఓ వృద్దుడిని పాత్ బస్ స్టేషన్ లో దింపి పోగా స్థానికులు గమనించి ఆగ్రహం వ్యక్తం చేయడంతో తిరిగి ఆసుపత్రికి తరలించారు. అలాగే ఓ గర్భీణీ కడుపులో వస్త్తాలు మరిచిపోయిన ఘటన కూడా వెలుగులోకి రావడం అప్పట్లో సంచలనంగా మారింది. తాజాగా భర్తకు అటెండెంట్ గా ఉన్న మల్లవ్వ విషయంలోనూ ఆసుపత్రి సిబ్బంది కఠినంగా వ్యవహరించిన తీరు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

చర్యలు తీసుకున్నా…

జగిత్యాల ఆసుపత్రి యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరుపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఆసుపత్రి సూపరింటిండెంట్ ను సరెండర్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ జిల్లా ఆసుపత్రి యంత్రాంగం వైఖరిలో మార్పు రాకపోవడం విస్మయం కల్గిస్తోంది. వృద్ద దంపతుల విషయలో కూడా కఠినంగా వ్యవహరించిన తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా సర్కారు ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల సిబ్బంది వ్యవహరిస్తున్న తీరును గమనించి అధికారులు వారిని క్రమశిక్షణలో పెట్టేందుకు ప్రత్యేకంగా చికిత్స చేయాల్సిన అవశ్యకత ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

You cannot copy content of this page