ఇనుముల సతీష్ పై మరో కేసు
దిశ దశ, మంథని:
మంథని మాజీ ఉప సర్పంచ్, పెద్దపల్లి డీసీసీ అధికార ప్రతినిధి ఇనుముల సత్యనారాయణ (సతీష్)పై మరో కేసు నమోదు అయింది. మంథని పట్టణానికి చెందిన బెల్లంకొండ రవిందర్ రెడ్డి అనే కాంట్రాక్టర్ 2024మే నెలలో జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో వాకింగ్ ట్రాక్ వర్క్ చేస్తున్నాడు. ఇతర కాంట్రాక్టు పనులు కూడా చేస్తున్న రవిందర్ రెడ్డి వద్దకు జులై21న వెళ్లాడు సతీష్. కాంట్రాక్టు పనులు చాలా వచ్చాయని, రూ. 2లక్షలు తనకు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేనట్టయితే కాంట్రాక్టు బిల్లులు రాకుండా అడ్డుకుంటానని బెదిరించాడు. దీంతో భయపడిన రవీందర్ రెడ్డి ఆగస్టు 28న తన స్నేహితునితో కలిసి బీఎస్ ఫంక్షన్ హాల్ వద్దకు వెళ్లి సతీష్ కు రూ. లక్ష ఇచ్చాడు. మిగతా రూ. లక్ష కూడా ఇవ్వాలని లేనట్టయితే ఆస్తి, ప్రాణ నష్టం కలిగిస్తానని హెచ్చరించాడు. బాధితుని ఫిర్యాదు మేరకు మంథని పోలీసులు ఇనుముల సతీష్ పై క్రైం నంబర్ 194/2024, 308(5) బీఎన్ఎస్ యాక్టులో కేసు నమోదు చేశారు.
పిల్ వేస్తా… ఫిర్యాదు చేస్తా…
ఇనుముల సతీష్ ప్రతి అంశంలోనూ బాధితుల బలహీనతలను, చట్టాన్ని అడ్డం పెట్టుకుని వసూళ్లకు పాల్పడినట్టుగా పోలీసులకు వస్తున్న ఫిర్యాదులు తేల్చి చెప్తున్నాయి. ఏదో వంకతో కోర్టును ఆశ్రయించి పిల్ వేస్తానని బెదిరింపులకు పాల్పడినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఫిర్యాదులు చేసి కూడా ఇబ్బందులకు గురి చేస్తానని చెప్పి హెచ్చరించేవాడని స్పష్టం అవుతోంది. గతంలో తాను ఫిర్యాదులు చేయడమో లేక పిల్ వేసి ఇబ్బందులకు గురి చేసిన సంఘటనలు కూడా గుర్తు చేస్తూ తనను సంతృప్తి పరచాలన్న డిమాండ్ వినిపించాడన్న వాదనలు వినిపిస్తున్నాయి. సత్యనారాయణ ఇంతకు ముందు చేసిన పిల్, ఫిర్యాదు అంశాలను పదే పదే గుర్తు చేస్తూ హెచ్చరికలు చేయడమే పనిగా పెట్టుకున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. చట్టాన్ని అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ కు పాల్పడినట్టుగా ఇప్పటి వరకు పోలీసులకు వచ్చిన ఫిర్యాదులు స్పష్టం చేస్తున్నాయి.
ఫిర్యాదు చేయండి…
ఇనుముల సతీష్ విషయంలో మరోసారి పోలీసులు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. బాధితులు ఎవరైనా ఉన్నట్టయితే తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. బెదిరింపులకు పాల్పడి వసూలు చేయడం కానీ ఇతర రకాలుగా ఇబ్బందులకు గురి చేసినట్టయితే బాధితులు నేరుగా పోలీసులను ఆశ్రయించవచ్చన్నారు. ఇప్పటి వరకు ఇనుముల సతీష్ పై మంథని పోలీస్ స్టేషన్ లో మూడు కేసులు, రామగిరి పోలీస్ స్టేషన్ లో ఒక కేసు మొత్తం నాలుగు కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. మూడు కేసుల్లో ఇనుముల సతీష్ కు సహకరించిన రావికంటి సతీష్ ను అరెస్టు చేశామని, ఆయన జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారన్నారు. త్వరలో ఇనుముల సతీష్ ను కూడా అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.