నందెల్లి మహిపాల్ పై మరో కేసు… ఒకరు అరెస్ట్… మరోకరి పరార్…

దిశ దశ, మానకొండూరు:

నిను వీడని నీడను నేనే అన్నట్టుగా తయారైంది కరీంనగర్ అక్రమార్కుల పరిస్థితి. ఇంతకాలం తామేం చేసినా చెల్లుతుందని ఇష్టారీతిన వ్యవహరించిన వారిపై మౌనంగా చూస్తూ ఉన్న చట్టమే ఇప్పుడు వెంటాడడం మొదలు పెట్టింది. అధికారంతో వచ్చిన అహంకారంతో తాము ఎలా వ్యవహరించినా తిరుగుండదని అక్రమార్కులు కన్న కలలన్ని కల్లలు అవుతున్నాయి. కరీంనగర్ కమిషనరేట్ లో నాలుగో సింహం జూలు విదిలుస్తుండడంతో భూదందాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. మేమున్నామన్న భరోసా ఇచ్చేవారు లేక ఇంతకాలం దిక్కులు చూసిన అనామకులు నేడు తమ ఆస్తులను కాపాడే ప్రక్రియ మొదలైందన్న ధైర్యంతో పాటు తమకు కూడా రక్షణ దొరుకుతుందన్న ధీమాతో పోలీసులను ఆశ్రయిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఠాణాల వైపు కన్నెత్తి చూసేందుకే జంకిన జనం నేడు తమను అక్కున చేర్చుకుంటున్న ఆలయాలన్న భావనతో ఆశ్రయిస్తున్న తీరు ఆశ్యర్యాన్ని కల్గిస్తోంది. మాజీ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అనుచరుడు, అథ్లెటిక్స్ అసోసియేషనన్ నేత నందెల్లి మహిపాల్ పై కమిషనరేట్ పరిధిలోని మానకొండూరులో మరో కేసు నమోదయింది. మానకొండూరు పోలీస్ స్టేషన్ లో నమోదయిన ఈ కేసులో ఏ1గా దుర్గం జగన్ గౌడ్, ఏ2గా నందెల్లి మహిపాల్, ఏ3గా సింగిరెడ్డి వెంకటరమాణారెడ్డిలను నిందితులుగా పేర్కొన్నారు. ఇందులో ఏ1 దుర్గం జగన్ గౌడ్ ను అరెస్ట్ చేయగా, కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మరో కేసులో అరెస్ట్ అయి జ్యూడిషియల్ రిమాండ్ లో ఉన్న నందెల్లి మహిపాల్ పై పిటి వారెంట్ వేసే అవకాశాలు ఉన్నాయి. ఏ3గా ఉన్న సింగిరెడ్డి వెంకటరమణారెడ్డి పరారీలో ఉన్నట్టుగా పోలీసులు తెలిపారు. వీరిపై ఐపీసీ సెక్షన్ 420, 467, 386, 506, 120-బి r/w 34లలో కేసు నమెదు కాగా దుర్గం జగన్ గౌడ్ కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కరీంనగర్ కోర్టు. ఎన్టీపీసీలో ఉద్యోగం చూసి రిటైర్డ్ అయిన ఎల్లాల అజేందర్ రెడ్డి కరీంనగర్ భగత్ నగర్ లో నివాసం ఉంటున్నారు. మానకొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని సదాశివపల్లిలో సర్వే నెంబరు 442, 447/2, 443 లలోని 120.5 గుంటల భూమిని కొతపల్లి మండలం బావుపేటకు చెందిన దుర్గం జగన్ గౌడ్, తిరుపతిల ద్వారా కొనుగోలు చేశాడు. ఆ తరువాత భూమి వద్దకు అజేందర్ రెడ్డి వెల్లగా సింగిరెడ్డి వెంకటరమణారెడ్డి ఆ భూమి తనదేనని చెప్పి అడ్డుకున్నాడు. దీంతో ఈ భూమి విషయంలో వివాదం తలెత్తగా ఈ విషయంపై మాట్లాడేందుకు అజేందర్ రెడ్డిని సదాశివపల్లికి పిలిపించిన దుర్గం జగన్ గౌడ్, నందెల్లి మహిపాల్, సింగిరెడ్డి వెంకటరమణా రెడ్డిలు హత్య చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన మానకొండూరు పోలీసులు దుర్గం జగన్ గౌడ్ ను అరెస్ట్ చేశారు.

You cannot copy content of this page