దిశ దశ, మంథని,
పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇనుముల సత్యనారాయణ (సతీష్)ఫై మరో కేసు నమోదు అయింది. మంథని సర్కిల్ లో వరసగా ఇది మూడో కేసు కావడం గమనార్హం. ఈ మేరకు మంథని పోలీసులు ఒక ప్రకటనలో వెల్లడించారు. మంథని పోలీసుల కథనం ప్రకారం… మంథని పట్టణానికి చెందిన బిరుదు శ్రీనివాస్ సూరయ్యపల్లిలోని సర్వే నెంబర్ 329లోని ఇంటి స్థలంలో బీఎస్ బాంక్విట్ హాల్ నిర్మాణం చేసుకుంటున్నాడు. ఈ సమయంలో మంథని మాజీ ఉప సర్పంచ్ ఇనుముల సత్యనారాయణ తన గన్ మెన్ తో వెల్లి రూ. 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేనట్టయితే బాంక్విట్ హాల్ నిర్మాణాన్ని అడ్డుకుంటానని హెచ్చరించాడు. ఆ తరువాత ఇనుముల సత్యనారాయణ అనుచరుడు రావికంటి సతీష్ జోక్యం చేసుకుని బిరుదు శ్రీనివాస్ తో సంప్రదింపులు జరిపాడు. ఇనుముల సతీష్ గతంలో చాలా నిర్మాణాల విషయంలో పిల్ వేశాడని అతని గురించి మీకు తెలియదని, ఆయనతో పెట్టుకోవద్దని తాను సెటిల్ మెంట్ చేస్తానని చెప్పాడు. అనంతరం ఇనుముల సత్యానారాయణను, బిరుదు శ్రీనివాస్ లను కలిపేందుకు హైదరాబాద్ లోని ఓ హోటల్ మీటింగ్ ఏర్పాటు చేశాడు రావికంటి సతీష్. అక్కడ కూడా ఇనుముల సత్యనారాయణ బిరుదు శ్రీనివాస్ ను రూ. 10 లక్షలు ఇవ్వాలని, లేనట్టయింతే బాంక్విట్ హాల్ కూల్చివేయిస్తానని బెదిరించాడు. దీంతో మంథనికి చేరుకున్న తరువాత బాధితుడు శ్రీనివాస్ తన స్నేహితుడు రామినేని అంజన్నకు చెందిన అకౌంట్ నుండి రూ. 5 లక్షలు రావికంటి సతీష్ అకౌంట్ కు బదిలీ చేయించాడు. అయినప్పటికీ ఇనుముల సతీష్ తన గన్ మెన్ ను వెంట తీసుకుని వచ్చి మిగతా రూ. 5 లక్షలు ఇవ్వాలని లేనట్టయితే భవనాన్ని కూల్చివేయిస్తానని హెచ్చరించాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంథని పోలీస్ స్టేషన్ లో క్రైం నంబర్ 191/2024లో 329(4), 308(5), 351 (3), r/w 3(5) బీఎన్ఎస్ యాక్టు సెక్షన్లలో కేసు నమోదు చేశారు.
నిర్భయంగా రండి: మంథని పోలీసులు
ఇనుముల సత్యనారాయణకు సంబంధించిన బాధితులు ఎవరైనా ఉన్నట్టయితే నిర్భయంగా వచ్చి పోలీసులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.