ఉద్యమకారుడికి ఉద్యమ పార్టీలో…

రెండో సారి అవకాశం…

దిశ దశ, పెద్దపల్లి:

తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ముఖ్య భూమిక పోషించిన వారిలో ఆయన ఒకరు. పారిశ్రామిక ప్రాంతంలో జై తెలంగాణ అని నినదించిన గొంతుకలతో కలిసి పోరుబాట పట్టారు. నల్ల బంగారు గనుల్లో గులాబి జెండాలు రెపరెపలాడించినా సొంత పార్టీ నుండి ఎమ్మెల్యే అయ్యే అవకాశం దొరకలేదు. 2009లో ఓ సారి టికెట్ వచ్చినా ప్రభావాన్ని చూపలేకపోయారు. అప్పుడు ప్రత్యర్థి పార్టీల బలం ముందు ఆయన మూడో స్థానంతో సరిపెట్టుకోవల్సి వచ్చింది. తెలంగాణ ఆవిర్బావం తరువాత ఉద్యమ నేత కేసీఆర్ సిట్టింగులకే టికెట్లు ఇస్తామని ప్రకటించడంతో ఆయన ప్రత్నామ్యాయ మార్గాన్ని ఎంచుకోక తప్పలేదు. రామగుండం సిట్టింగ్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ రాజకీయాల్లో గడ్డు పరిస్థితులే ఎదుర్కొన్నారు. సామాన్య కార్యకర్తగా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన రామగుండంలో తనకంటూ ప్రత్యేకతను ఏర్పర్చుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా చాలా పోరాటాలు చేసినప్పటికీ స్వరాష్ట్రం సిద్దించిన తరువాత ఆయనకు గులాభి జెండా నీడన ఎదిగే అవకాశం మాత్రం దక్కలేదు. 2014 ఎన్నికల్లో సిట్టింగులకే టికెట్ ఇస్తామని అధినేత కేసీఆర్ ప్రకటించడంతో అప్పటికే రామగుండం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న సోమారపు సత్యనారాయణకు అవకాశం దక్కింది. దీంతో కోరుకంటి చందర్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. పార్టీని ధిక్కరించి బరిలో నిలిచారన్న కారణంతో సస్పెన్షన్ కు గురైన ఆయనకు తిరిగి పార్టీ సభ్యత్వం ఇచ్చేందుకు కూడా సాహసించని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఆయన భార్య కోరుకంటి విజయను పార్టీ నాయకురాలిగా గుర్తించిన అప్పటి రామగుండం నాయకులు సభ్యత్వ సేకరణ ఆమెకు బాధ్యతలు అప్పగించినప్పటికీ చందర్ కు మాత్రం మెంబర్ షిప్ ఇవ్వకూడదన్న షరతు విధించారు. అయినప్పటికీ చందర్ తన పంథాలో ముందుకు సాగుతూ 2018 ఎన్నికల్లో కూడా తనకు టికెట్ ఇవ్వాలని గులాబి బాస్ ను అభ్యర్థించారు. పారిశ్రామిక ప్రాంతంలో తనకు పట్టున్నదని చెప్పినప్పటికీ తిరిగి సిట్టింగులకే ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించుకున్నారు. దీంతో రెండో సారి కూడా కోరుకంటి చందర్ కు ఆశాభంగం తప్పలేదు. గత ఎన్నికల్లోనూ ఏఐఎఫ్ బి అభ్యర్థిగా బరిలో నిలిచి గెలిచారు. ఆ తరువాత అధికార పార్టీలో చేరిన చందర్ కు పార్టీలో ప్రాధాన్యత విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకు విశ్వసనీయుడిగా మారిపోవడంతో నూతన జిల్లాకు పార్టీ అధ్యక్షుల నియామకంలో చందర్ ను అందలం ఎక్కించింది పార్టీ అధిష్టానం. పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించడంతో అధినేత కుటుంబంలో ఆయనకు ఉన్న చరిష్మా ఏంటో ప్రాక్టికల్ గా కనిపించింది. అయితే అనూహ్యంగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ చందర్ పై అసమ్మతి గళం తెరపైకి వచ్చింది. అధిష్టానం పెద్దల ముందు రామగుండం నేతలు ఫిర్యాదుల పరంపర కొనసాగించినా చందర్ వైపే మొగ్గు చూపారు. తమ పంథం నెరవేరబోతుందని కలలు కన్న అసమ్మతి నేతలు కోరుకంటికి తప్ప ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపిస్తామని చెప్పినా వారి మాటలు అధిష్టానం పట్టించుకోలేదనే చెప్పాలి. ప్రధానంగా రామగుండంలో ప్రత్యామ్నాయ నాయకత్వం గురించి గమనించినా చందర్ మాత్రమే బలమైన అభ్యర్థిగా అధిష్టానం గుర్తించింది. దీంతో కోరుకంటి అభ్యర్థిత్వానికే అధినేత కేసీఆర్ మొగ్గు చూపారు. గతంలో పలుమార్లు పోటీ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించినా అధిష్టానం తీసుకున్న నిర్ణయాలు కోరుకంటి చందర్ కు అశనిపాతంగా మారిపోయాయి. అయితే దాదాపు రెండు దశాబ్దాల ఉద్యమ ప్రస్థానంలో కొనసాగిన కోరుకంటి చందర్ కు రెండోసారి ఉద్యమ పార్టీ నుండి బరిలో నిలిచే అవకాశం లభించినట్టయింది. ఎన్నికలు జరిగినప్పుడల్లా చందర్ క్రమక్రమంగా తన ఓటు బ్యాంకును పెంచుకుంటూ పోయారు. 2009లో 13.4 శాతం ఓట్లు సాధించుకున్న ఆయన 2014లో 24.33 శాతం, 2018లో 45.10 శాతం ఓట్లను సాధించుకున్నారు.

You cannot copy content of this page