నెట్టింట వైరల్ అవుతున్న లేఖ…
బీఆర్ఎస్ నేత నాగూర్ల వెంకన్న, నాగరాజులే కారణం: బాబురావు
దిశ దశ, వరంగల్:
వరంగల్ ఉమ్మడి జిల్లాలో మరో చీటి సంస్థ భాగస్వాముల మధ్య వివాదం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఓ చిట్ ఫండ్ సంస్థ భాగస్వామి ఆత్మహత్యకు పాల్పడగా మరో చీటీ సంస్థలో భాగస్వామిగా ఉన్న వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితునికి పరకాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా ఆయన రాసిన లేఖ, ఆడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బాధితుడు సూసైడ్ అటెమ్ట్ కు ముందు రాసిన లేఖ, ఆడియోల సాంరాశాన్ని బట్టి బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుడు నాగుర్ల వెంకన్న, నాగరాజు అనే ఇద్దరి కారణంగానే తాను బలవన్మరణానికి ప్రయత్నిస్తున్నట్టుగా పేర్కొన్నాడు. చీటిల బాబు రావు అనే వ్యక్తి, నాగూర్ల వెంకన్న ఇద్దరు కలిసి ఏర్పాటు చేసిన చిట్ సంస్థకు సంబంధించిన లావాదేవీల్లో తనకు అన్యాయం చేశారంటూ బాబురావు ఆరోపించారు. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడినంటూ నాగరాజు అనే వ్యక్తి తనను బెదిరింపులకు పాల్పడ్డారని బాబురావు ఆరోపించారు. వెంకన్నకు ఎస్పీలు కూడా పరిచయం ఉన్నారని, మాజీ నక్సల్ నయీం తప్పించుకుని తిరుగుతుంటే అతన్ని ట్రేస్ చేశాడని వాళ్ల ముందు నువ్వో లెక్కా అంటూ బెదిరించారన్నారు. మూడు రోజుల పాటు సమయం ఇస్తున్నామని లేనట్టయితే చంపేస్తామంటూ కూడా హెచ్చరించారని కూడా ఆయన వివరించారు. చిట్ ఫండ్ కు రావాల్సిన డబ్బులు ఇప్పించడం, సారంగపాణి అనే వ్యక్తి నుండి రావల్సిన రూ. 50 లక్షలు కూడా ఇప్పించడంతో పాటు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాబురావు కోరారు.