పోలీసు విభాగంలో యాక్సిలరీ పదోన్నతుల కలకలం…

డీఎస్పీ ఫిర్యాదుతో మరో సారి చర్చ…

దిశ దశ, హైదరాబాద్:

డిసిప్లేనరీ డిపార్ట్ మెంటులోనే నిభందనలకు నీళ్లొదిలారా..? క్రమశిక్షణా రాహిత్యంగా వ్యవహరిస్తూ అనూయూలకే అందలం ఎక్కించుకున్నారా..? పై అధికారిని ప్రశ్నించే పరిస్థితి లేకపోవడాన్ని కొంతమంది అధికారులు అడ్వంటైజ్ గా మార్చుకున్నారా… ఇప్పుడివే ప్రశ్నలు పోలీసు విభాగాన్ని వెంటాడుతున్నాయి.

యాక్సిలరీ ఎలా అంటే..?

మావోయిస్టు కార్యకలాపాలను కట్టడి చేయడంలో ముఖ్య భూమిక పోషించే పోలీసులకు ఈ విధానంతో పదోన్నతులు కల్పిస్తుంటారు. ఫీల్డ్ లో తిరుగుతూ ప్రాణాలను ఫణంగా పెట్టే పోలీసులు నక్సల్స్ ఏరివేతలో సఫలం అయినవారికి మాత్రమే సీనియారిటీని పక్కనపెట్టి స్పెషల్ కేసుగా పరిగణించి పదోన్నతులు కల్పిస్తుంటారు. దీనివల్ల నక్సల్స్ కార్యకలాపాల్లో పాల్గొనే పోలీసు యంత్రాంగానికి ప్రోత్సాహం కల్పించినట్టు అవుతుందని పోలీసు ఉన్నతాధికారులు అప్పుడు భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ విధానంలో ప్రమోషన్లకు అర్హులైన వారి జాబితాను సంబంధిత ఎస్పీలు సిద్దం చేసి పంపిస్తారు. ఆయా జాబితాలో పేర్లు ఉన్న పోలీసులు పాల్గొన్న ఎన్ కౌంటర్లు, చనిపోయిన వారి క్యాడర్, ఎంతమంది నక్సల్స్ హతం అయ్యారు, నక్సల్స్ ఏరివేతలో సదరు పోలీసు అధికారి పాత్రను వివరిస్తూ ఫైళ్లను తయారు చేసి డీజీపీ కార్యాలయానికి పంపిస్తారు. డిపార్ట్ మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఈ ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించి పదోన్నుతలకు అర్హులైన వారిని ఎంపిక చేస్తారు. ఆ తరువాత వారికి పదోన్నతులు ఇచ్చేందుకు క్లియర్ కానుంది. ప్రధానంగా ఈ పదోన్నతులు పొందే వారిపై క్రమశిక్షణ చర్యలు కానీ ఇతరాత్ర శాఖపరమైన చర్యలు కానీ పెండింగ్ లో ఉండకూడదన్న నిభందన కూడా ఉంది. అయితే ఈ విధానం అమలు చేయడానికి ప్రధాన కారణం అడవుల్లో తిరుగుతూ సమాచార వ్యవస్థను పటిష్టంగా ఏర్పాటు చేసుకుని నక్సల్స్ కార్యకలాపాలను నియంత్రించిన వారికే ఫస్ట్ ప్రయారిటీ ఉండాలని భావించారు. దీంతో అప్పటి పోలీసు అధికారులు తమ పేరు యాక్సిలరీ పదోన్నతుల జాబితాలో ఉంటే పదోన్నతి వస్తుందని ఆశించారు. అందులోనూ నక్సల్స్ ఏరివేతలో కీలకంగా పనిచేసిన వారికే మొదటి ప్రాధాన్యత ఇచ్చే వారు. ఏటా సైటేషన్ కు పంపించాల్సిన బాధ్యత సంబంధిత జిల్లాల పోలీసు అధికారులకు ఉండేది.

ఎస్ఐబీ వారికే…

అయితే సమాచార వ్యవస్థను మరింత పటిష్టం చేసుకోవాలని సంకల్పించిన ఉమ్మడి రాష్ట్ర పాలకులు నక్సల్స్ ఆణిచివేత కోసం ప్రత్యేకంగా స్పెషల్ ఇంటలీజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబి)ని ఏర్పాటు చేశారు. నక్సల్స్ కదలికలను పసిగట్టేందుకు వీరికి ఆధునిక సాంకేతితను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు పోలీసు ఉన్నతాధికారులు. వీరికి వచ్చిన సమాచారాన్ని అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించే బలగాలకు చేరవేసి నక్సల్స్ కార్యకలాపాలను కట్టడి చేయవచ్చన్న ఉద్దేశ్యంతో ఎస్ఐబిని ఏర్పాటు చేశారు. ఈ విభాగంలో పనిచేసే వారంతా కూడా హైదరాబాద్ లోని ఎస్ఐబి వింగ్ మెయిన్ కార్యాలయంలోనే ఉంటూ మానిటరింగ్ చేస్తుంటారు. అడవుల్లో, గుట్టల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నెలల కొద్ది తిరుగుతూ ఉండే గ్రే హౌండ్స్, కూంబింగ్ పార్టీల కష్టాలు మరో విధంగా ఉంటాయి. చాలినంత ఆహారం కూడా తీసుకోకుండా కిట్ బ్యాగులు, ఆయుధాలు మోస్తూ పొదల మాటు నుండి వినిపించే అలజడులను జాగ్రత్తగా వింటూ తమ ప్రాణాలను తాము కాపాడుకుంటూ నక్సల్స్ ను అంతమొందించేందుకు మైళ్ల కొద్ది నడుస్తూనే ఉంటారు. ఉన్నతాధికారుల నుండి ఆదేశాలు వచ్చే వరకూ కూడా వీరు అడువుల్లోనే జీవనం సాగించాల్సి ఉంటుంది. వేసవిలో అయితే నీటి ఎద్దడిని అదిగమిస్తూ… వర్షాకాలంలో భీకరంగా ప్రవహించే వాగులు వంకలను దాటుకుంటూ, చలికాలంలో అయితే గజగజ వణుకుతూ కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తుంటారు. అయితే గత కొంతకాలంగా యాక్సిలరీ ప్రమోషన్ల విధానాన్ని కూంబింగ్ ఆపరేషన్లలో పాల్గొనే పోలీసు యంత్రాంగానికే కాకుండా ఎస్ఐబీలో పనిచేసే వారికి కూడా కల్పించే ఆనవాయితీ ప్రారంభించారు. దీంతో క్షేత్ర స్థాయిలో అష్టకష్టాలు పడే వారికంటే… సర్కారు నిధులతో సమకూర్చిన సాంకేతికతను అందిపుచ్చుకుని నక్సల్స్ ఏరివేతలో పాల్గొంటున్న వారికే పదోన్నతులు రావడం ప్రారంభం అయింది. కుటుంబాలను వదిలి, ఇంటికి చేరేవరకూ బ్రతుకుతామా లేదా అన్న విషయాన్ని మర్చిపోయి కీకారణ్యంలో అణువు అణువుపై పట్టున్న నక్సల్స్ ను ఎదుర్కొనే సాహసం చేస్తున్న వారికన్నా ఎస్ఐబిలో ఉంటూ నామామాత్రంగా కష్టపడి సఫలం అయ్యారంటూ యాక్సిలరీ పదోన్నతులు కల్పిస్తున్నారు. దీంతో ఫీల్డ్ లో పనిచేస్తున్న పోలీసు అధికారులకు గుర్తింపు కూడా లేకుండా పోయింది. మరోవైపున లాబీయింగ్ చేసిన వారికి కూడా నిభందనలు పక్కనపెట్టి మరీ పదోన్నతులు కల్పించడం కూడా విమర్శలకు దారి తీస్తోంది, హైదరాబాద్ లో ఉంటూ ప్రభుత్వం ఇచ్చే సకల సాంకేతికతను అందిపుచ్చుకుని పనిచేస్తున్న వారికి ప్రయారిటీ ఇవ్వడం పట్ల పోలీసు వర్గాల్లోనూ విస్మయం వ్యక్తం అవుతోంది.

దశాబ్దాల క్రితం…

తాజాగా 1998 బ్యాచ్ కు చెందిన పోలీసు అధికారి యాక్సిలరీ పదోన్నతులు కల్పించిన విషయంపై డీజీపీకి చేసిన ఫిర్యాదు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఆ అధికారిక తన లేఖలో ప్రస్తుతించిన అంశాలు మాత్రం పోలీసు అధికారుల ప్రత్యేక మమకారాన్ని వేలెత్తి చూపుతున్నాయి. రెండు దశాబ్దల క్రితం నాటి ఆపరేషన్లను చూపించి ఇప్పుడు యాక్సిలరీ పదోన్నతులు కల్పించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నక్సల్స్ కార్యకలాపాలు గణనీయంగా తగ్గిపోయిన ఈ కాలంలోనూ యాక్సిలరీ ప్రమోషన్ల జాతరకు తెరలేపడం వెనక ఆంతర్యం ఏంటన్నది పోలీసు అధికారులకే తెలియాలి. సదరు డీఎస్పీ ప్రణిత్ రావు పదోన్నతి అంశాన్ని కూడా లేవనెత్తినా ఇతర అధికారులకు సంబంధించిన విషయాలను కూడా వెలుగులోకి తెచ్చారు. పోలీసు విభాగంలో డిసిప్లేన్ తప్పిందెవరూ..? క్రమశిక్షణ ముసుగేసి ఫీల్డ్ లో పనిచేసే వారికి అన్యాయం చేసిందెవరో ఉన్నతాధికారులు గుర్తించాల్సిన అవసరం ఉంది.

You cannot copy content of this page