అభూజామఢ్ అడవుల్లో బలగాల జల్లెడ…
దిశ దశ, దండకారణ్యం:
చత్తీస్ గడ్ అభూజామఢ్ అటవీ ప్రాంతంలో బలగాలు పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా సాగుతున్న ఆపరేషన్ నిరాటంకంగా సాగుతోంది. కీకారణ్యాల్లో బలగాలు చెట్టు, పుట్టను వెతుకుతూ గాలింపు చర్యలు చేపట్టాయి. వరస ఘటనలతో అట్టుడికిపోతున్న పూర్వ బస్తర్ జిల్లా మరోసారి తుపాకుల మోతలతో దద్దరిల్లిపోయింది. శనివారం ఉదయం నకల్స్ కు బలగాలకు మధ్య ఎన్ కౌంటర్ జరిగినట్టుగా స్థానిక పోలీసు అధికారులు వివరించారు. ఈ నెల 12న నారాయణపూర్ జిల్లా అభూజామఢ్ లోని కుతుల్, ఫర్సాబెడ, కొడమెట అటవీ ప్రాంతాల్లో బలగాలు మావోయిస్టుల కోసం జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. నారాయణపూర్, కొండగావ్, కంకేర్, దంతెవాడ ప్రాంతాలకు చెందిన డీఆర్జీ, ఎస్టీఎఫ్, ఐటీబీపీ 53వ బెటాలియన్, బీఎస్ఎఫ్ 135 బెటాలియన్ బలగాలు భారీ ఎత్తున జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. మావోయిస్టుల కోసం మూడు రోజులుగా కుతుల్, ఫర్సాబెడ, కొడమెట ఏరియాలో బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో శనివారం ఉదయం మావోయిస్టులు తారసపడడంతో బలగాలతో ఎదురు కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలంలో 8 మంది నక్సల్స్ మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని నారాయణపూర్ జిల్లా పోలీసు వర్గాలు తెలిపాయి. అలాగే ఇన్సాస్, 303, బీజీఎల్ లాంఛర్ తో పాటు ఇతరాత్ర సామాగ్రిని కూడా రికవరీ చేసినట్టుగా వివరించారు. ఈ ఎదురు కాల్పుల ఘటనలో ఒక ఎస్టీఎఫ్ జవాను మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. అయితే ఎదురు కాల్పుల్లో మరింత మంది నక్సల్స్ చనిపోవడమో లేక గాయాపాలు కావడమో జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలను జిల్లా కేంద్రానికి తరలించే పనిలో బలగాలు నిమగ్నం అయ్యాయి.