దండకారణ్యంలో మరో ఎన్ కౌంటర్: ఏడుగురు నక్సల్స్ మృతి..?

దిశ దశ, దండకారణ్యం:

దండకారణ్య అటవీ ప్రాంతంలో తుపాకులు తూటాలు కక్కుతూనే ఉన్నాయి. అభూజామఢ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఏడుగురు నక్సల్స్ మరణించినట్టుగా ప్రాథమిక సమాచారం. దంతెవాడ, నారాయణపూర్ సరిహద్దు అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం నుండి మావోయిస్టులకు, బలగాలకు మధ్య ఎదురు కాల్పుల ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. దంతెవాడ, నారాయణపూర్ జిల్లాలకు చెందిన పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగినట్టుగా సమాచారం. కీకారణ్యంలో జరిగిన ఈ ఎన్ కౌంటర్ లో మొదట ఇద్దరు నక్సల్స్ చనిపోయినట్టుగా వెలుగులోకి వచ్చినప్పటికీ తాజాగా వస్తున్న సమాచారాన్ని బట్టి ఇప్పటి వరకు మొత్తం ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలు లభ్యం అయ్యాయని అక్కడి పోలీసు వర్గాల సమాచారం. అయితే ఈ రెండు జిల్లాల సరిహద్దుల్లో ఇంకా కూంబింగ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయని కూడా ఆయా జిల్లాల పోలీసు అధికారులు చెప్తున్నారు. ఘటనా స్థలం నుండి ఆధునిక ఆయుధాలతో పాటు ఇతరాత్రా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. ఈ ఎన్ కౌంటర్ ఘటనపై నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్, దంతెవాడ ఎస్పీ గౌరవ్ రాయ్, బస్తర్ ఎస్పీ శలభ్ కుమార్ సిన్హాలు సమన్వయం చేస్తున్నట్టుగా చత్తీస్ గడ్ నుండి వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాలు అందాల్సి ఉంది. 

You cannot copy content of this page