జగిత్యాల జిల్లాలో ఘరానా క్రిమినల్స్
దిశ దశ, జగిత్యాల:
ఫేక్ డాక్యూమెంట్లతో పాస్ పోర్టులు ఇచ్చి మోసం చేసిన ఘటనపై ఓ వైపున సీఐడీ విచారణ జరుపుతుండగానే మరో వైపున నకిలీ వీసాలతో మోసం చేసిప ప్రభుద్దుడి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. జగిత్యాల జిల్లా వాసులకే ఈ రెండు ఘటనలతో సంబంధాలు ఉండడం గమనార్హం. శనివారం మెట్ పల్లి పట్టణంలో నకిలీ విసా బాధితులు ఆందోళన చేయడంతో కొత్తరకం మోసం వెలుగులోకి వచ్చింది. బాధితుల కథనం ప్రకారం… పట్టణంలోని చైతన్య నగర్ కు చెందిన ఏలేటి రమేష్ కొంతకాలంగా గల్ఫ్ దేశాలకు పంపించేందుకు వీసాలు ఇప్పిస్తున్నానంటూ ప్రచారం చేసుకున్నాడు. దుబాయిలోని ఓ కంపెనీలో తాను నెలకు రూ. 2 లక్షల పై చిలుకు సంపాదిస్తున్నానని మీకు కూడా అవకాశం కల్పిస్తానంటూ నమ్మించాడు. దీంతో బాధితులు రమేష్ మాటలు నమ్మి దుబాయికి వెల్లేందుకు సమ్మతించి రూ. 60 వేల చొప్పున ముట్టజెప్పారు. వీసాలు చేతికి వచ్చాయి కదా అని దుబాయికి వెల్లేందుకు ఎయిర్ పోర్టుకు వెల్లగా తనిఖీ చేసిన అధికారులు నకిలీ వీసాలని చెప్పి తిప్పి పంపించారు. దుబాయికి వెల్లి కుటుంబాలను ఆర్థిక భారం నుండి గట్టెక్కించేందుకు మంచి అవకాశం దొరికిందని కలలు కంటూ ఉత్సాహంగా ఎయిర్ పోర్టుకు చేరుకున్న బాధితులకు అక్కడి అధికారులు అసలు విషయం చెప్పడంతో ఖంగుతిన్నారు. బాధితుల్లో నిర్మల్ జిల్లా తో పాటు జగిత్యాల జిల్లాకు చెందిన వారు కూడా ఉండగా వీరంతా కూడా శనివారం మెట్ పల్లిలోని నకిలీ వీసాలు ఇచ్చి మోసం చేసిన రమేష్ ఇంటి ముందు ఆందోళన చేశారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధితులు తమ డబ్బులు తమకు ఇప్పించి నిందితున్ని కఠినంగా శిక్షించాలని కోరారు.
ఇంటి సమీపంలోని వ్యక్తిని కూడా…
ఏలేటి రమేష్ ఇంటి ముందు నివసిస్తున్న ఓ ప్రైవేటు ఉద్యోగిని కూడా మాయ మాటలతో ట్రాప్ లో పడేసి రూ. 60 వేలు వసులు చేసుకున్నాడు. రమేష్ ఇచ్చిన వీసా ఒరిజనలేనని నమ్మి ఎయిర్ పోర్టుకు వెల్తే అధికారులు తనిఖీ చేసి నకిలీదని చెప్పారని వివరించాడు. దుబాయికి వెల్తే లక్షల్లో జీతాలు వస్తాయన్న ఆశ చూపి అమాయకులను నిండా ముంచిన రమేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరుతున్నాడు.