‘బండి’ పోస్టు పదిలం
దిశ దశ, హైదరాబాద్:
రాష్ట్ర బీజేపీలో నెలకొన్న అనిశ్చితికి మరి కొన్ని గంటల్లో బ్రేకు పడనుంది. రాష్ట్రం పార్టీలో నెలకొన్న పరిస్థితులపై నిశితంగా గమనిస్తున్న జాతీయ నాయకత్వం తగిన చర్యలు తీసుకునేందుకు నడుం బిగించినట్టు సమాచారం. శుక్రవారం హుటాహటిన న్యూ ఢిల్లీకి వెల్లిన ఈటల జాతీయ నాయకులతో సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ఈటల రాజేందర్ తో రాష్ట్ర పరిస్థితులపై కులంకశంగా చర్చించనున్న జాతీయ నాయకత్వం ఎన్నికల వరకు ఎలాంటి వ్యూహంతో వ్యవహరించాలో కూడా దిశానిర్దేశం చేయనుంది. గత పక్షం రోజులుగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు పుల్ స్టాప్ పెట్టేసేందుకు అవసరమైన విధంగా నిర్ణయాలు తీసుకునేందుకు సమాయత్తం అయినట్టుగా తెలుస్తోంది.
ఈటలకు మరో బాధ్యతలు…
రాష్ట్రంలో సీనియర్ ఎమ్మెల్యేల్లో ఒకరైన ఈటల రాజేందర్ సేవలను పార్టీ వినియోగించుకునేందుకు సమాలోచనలు జరిపిన జాతీయ నాయకులు ఆయనపై మరో బాధ్యతలు పెట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈటల రాజేందర్ సేవలు అన్ని విధాలుగా ఉపయోగించుకోవాలని భావిస్తున్న నేషనల్ పార్టీ ఇందుకు తగ్గట్టుగా ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా అధికార బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా చేపట్టాల్సిన పోరాటం, బీజేపీకి లాభించే అంశాలపై ఈటలను ఫోకస్ పెట్టాలని జాతీయ నాయకత్వం సూచించనున్నట్టు సమాచారం. అంతేకాకుండా రాజేందర్ కు వచ్చే ఎన్నికల వరకు ముఖ్య భూమిక పోషించే విధంగా మరో కీలకమైన బాధ్యతలను అప్పగించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికలను సమన్వయంతో నడిపించి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించే పనిలో జాతీయ నాయకత్వం నిమగ్నమైనందున ఈటల రాజేందర్ లాంటి సీనియర్ నాయకులను ఇందులో భాగస్వాములను చేస్తే సానుకూల ఫలితాలు సాధించవచ్చన్న యోచనలో ఉన్నట్టు సమాచారం. అయితే ఈటలకు ఏ పదవిని కట్టబెడ్తారు, విధి విధానాలు ఏంటీ అన్న విషయాలను ఈ రోజు కాకుండా మరో వారం పది రోజుల్లో ప్రకటించే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి.
‘బండి’ పోస్టు పదిలం…
అయితే రాష్ట్ర బీజేపీ రథ సారథిని మార్చే యోచనలో అధిష్టానం ఉన్నట్టుగా జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేనట్టుగా సమాచారం. బండి సంజయ్ ని యథావిధిగా కొనసాగించేందుకే ముఖ్య నాయకత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. సంజయ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత పార్టీకి మాస్ ఫాలోయింగ్ రావడంతో పాటు మారుమూల ప్రాంతాల్లోనూ బీజేపీ జెండాలు ఎగురుతున్నాయన్న విషయం గుర్తించిన జాతీయ నాయకత్వం ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. మరో ముఖ్యమైన విషయం కూడా అధిష్టానం పరిగణనలోకి తీసుకోవడం వల్లే ఈటలకు రాష్ట్ర పగ్గాలు అప్పగించే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. మొదటి నుండి పార్టీతోనే అనుభందం పెనవేసుకున్న వారికి రాష్ట్ర అధ్యక్ష్య బాధ్యతలు ఇవ్వాలన్న నిభందన కారణంగా ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి బాధ్యతలు అప్పగించడం అసాధ్యమనే అంటున్నారు. ఆర్ఎస్సెఎస్ ఆశీస్సులు ఉన్న వారికే ఈ బాధ్యతలు అప్పగించాలని మొదటి నుండి వాదిస్తోంది. పార్టీ ఫిరాయింపులతో చేరిన వారికి వెంటనే ముఖ్యమైన బాధ్యతలు అప్పగించకూడదని ఆరెఎస్సెఎస్ ముఖ్య నాయకులు అంటున్నారు. దీంతో ఇటీవలె బీజేపీలో చేరిన ఈటలకు బీజేపీ స్టేట్ చీఫ్ బాధ్యతలు అప్పగించకపోవచ్చని తెలుస్తోంది. ఏది ఏమైనా రాష్ట్ర బీజేపీలో నెలకొన్న లీకేజీల పర్వానికి, పార్టీ లైన్ తప్పుతున్న తీరుకు మాత్రం జాతీయ నాయకత్వం చెక్ పెట్టేసి కదనరంగంలోకి నాయకులను దింపే విధంగా వ్యూహం రచించబోతున్నట్టు తెలుస్తోంది.