జమ్మూకశ్మీర్‌లో మరో కశ్మీరీ పండిట్ హత్య

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పౌరులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక కశ్మీరీ పండిట్‌ మరణించాడు. వివరాల్లోకి వెళ్తే.. ఇవాళ ఉదయం పుల్వామాలోని అచ్చన్‌ ప్రాంతానికి చెందిన కశ్మీరీ పండిట్‌ సంజయ్ శర్మ మార్కెట్‌కు వెళ్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడ్డ కశ్మీరీ పండిట్‌ సంజయ్​ హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే సంజయ్‌ శర్మ మరణించినట్లు వైద్యులు వెల్లడించారు.

కాగా, ఉగ్రవాదుల కాల్పుల్లో చనిపోయిన సంజయ్ శర్మ స్థానిక బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నట్లు పోలీస్‌ అధికారి తెలిపారు. సంజయ్ శర్మ మృతి నేపథ్యంలో మైనార్టీలైన హిందువులున్న ఆ గ్రామంలో సాయుధ పోలీసులను మోహరించినట్లు వెల్లడించారు. అదనపు బలగాలను రప్పించి ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

ఇటీవల కాలంలో ఉగ్రవాదులు పౌరులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరుపుతున్నారు. గత నాలుగు నెలల్లో హిందువులపై ఉగ్రవాదులు జరిపిన తొలి దాడి ఇది. అలాగే స్థానిక కశ్మీరీలను లక్ష్యంగా చేసుకున్న రెండో దాడి. ఇటీవల అనంత్‌నాగ్‌లో ఆసిఫ్ అలీ గనాయ్‌పై ఒక ఉగ్రవాది కాల్పులు జరుపడంతో అతడు గాయపడ్డాడు. పోలీస్‌ హెడ్ కానిస్టేబుల్ అయిన ఆయన తండ్రి గత ఏడాది ఉగ్రవాదుల దాడిలో మరణించాడు.

కాగా, గతేడాది జమ్ముకశ్మీర్‌లో వరుస హత్యలు జరిగాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన వారిలో చాలా మంది వలస కార్మికులు, కశ్మీరీ పండిట్లు ఉన్నారు. దీంతో ఈ హత్యలపై కశ్మీరీ పండిట్లు భారీ స్థాయిలో నిరసనకు దిగారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమను చంపేందుకే తిరిగి కశ్మీర్‌కు రప్పించారా అంటూ ప్రశ్నించారు.

You cannot copy content of this page