జగిత్యాల జిల్లాలో మరో భూదందా
సర్కారుకే శఠగోపం పెట్టేశారా..!
దిశ దశ, జగిత్యాల:
జగిత్యాలకు 5 కిలో మీటర్ల దూరంలో ఉన్న గ్రామం అది… ఏనాటికైనా పట్టణం విస్తరించకపోతుందా అన్న ఆలోచన కొందరిది… రెవెన్యూ రికార్డులు పరిశీలిస్తే సర్కారు చేతిలో ల్యాండ్ బ్యాంకు ఉన్నదని తేలింది. ఇందుకు రెవెన్యూ అధికారులు కూడా చేతులు కలపడంతో అక్రమార్కుల పని సులువైపోయినట్టుగా ఉంది.
నర్సింగాపూర్
జగిత్యాల జిల్లా కేంద్రానికి సమీపంలో, కరీంనగర్ హైవేకు దగ్గరలో ఉన్న నర్సింగాపూర్ గ్రామం ఏనాటికైనా హాట్ కేక్ అవుతుందని అనుకున్న కొందరు అక్రమార్కులు గుట్టుగా గుట్టలను, ప్రభుత్వం భూమిని కాజేసినట్టుగా ఉంది. గ్రామంలోని 437 సర్వే నెంబర్ భూమి ప్రభుత్వానిదే అయినా పట్టాదారులుగా ధరణీ రికార్డుల్లో తమకు అనుకూలమైన పేర్లను చేర్పించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని సమగ్ర విచారణ జరిపించాలని ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో రెవెన్యూ అధికారులు ఆరా తీయడంతో గుట్టు రట్టయింది. 142 మంది ప్రభుత్వ భూమిని కాజేశారని తహసీల్దార్ తేల్చేసి నివేదిక ఉన్నతాధికారులకు పంపించారు. అయితే తాజాగా ఇదే గ్రామంలోని మరో భూమి గురించి కూడా వెలుగులోకి వచ్చింది. గ్రామస్థులు పెద్ద ఎత్తున కలెక్టరేట్ కు వచ్చి ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో మరో భూ దందా వెలుగులోకి వచ్చింది. ఈ గ్రామంలోని 251 సర్వే నెంబర్ లోని భూమి కూడా ప్రభుత్వానిదేనని అయితే అక్రమార్కులు కొంతమంది దీనిని కూడా కబ్జా చేసేశారని గ్రామస్థులు కలెక్టరేట్ లో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సిన ఈ భూమిని అప్పటి రెవెన్యూ అధికారులు అండదండలతో కాజేశారని ఈ రెండు సర్వే నెంబర్లలోని భూమిని స్వాధీనం చేసుకోవాలని గ్రామస్థులు అభ్యర్థించారు. ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకుని ఈ భూమిని నిరుపేద దళితులకు ఇవ్వాలని కూడా కోరడంతో 251 సర్వే నెంబర్ భూమి గుట్టు కూడా బయటకు వచ్చింది.
పెద్దల ఆశీస్సులా..?
అయితే నర్సింగాపూర్ గ్రామంలో ఉన్న ఈ భూమిని రెవెన్యూ రికార్డుల్లోనూ మార్చేశారని కూడా గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. రూ. వందల కోట్ల విలువ చేసే భూమిని దర్జాగా ఆక్రమించుకోవడం వెనక అసలేం జరిగి ఉంటుందన్నదే అంతుచిక్కకుండా పోతోంది. రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకుని సర్కారుకే శఠగోపం పెట్టడం వెనక వెన్నుదన్నుగా ఎవరున్నారన్నదే మిస్టరీగా మారింది. దాదాపు పదిహేనేళ్ల క్రితం నుండే నర్సింగా పూర్ భూములపై కన్నేసిన పెద్దలు బినామీలతో కబ్జా చేయించి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంగ బలం, ఆర్థిక బలం ఉన్న వారికి కూడా ఈ భూములను ముట్టజెప్పి ఆర్థిక లావాదేవీలు జరిపినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఏనాటికైనా జగిత్యాల జిల్లా కేంద్రం కావడం ఖాయమని, సమీప గ్రామాల ధరలు అడ్డగోలుగా పెరిగే అవకాశం ఉంటుందని భావించిన బడా బాబులు బినామీలను ముందు ఉంచి కబ్జా పర్వాన్ని కొనసాగించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ అధికారులు ఈ భూములను వెంటనే స్వాధీనం చేసుకున్నట్టయితే సర్కారు అవసరాలకు కూడా వినియోగించుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు స్థానికులు.