తాజాగా మరో నిందితుని అరెస్ట్
దిశ దశ, రాజన్న సిరిసిల్ల:
మే 15న రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ను ఓ మహిళ కలిశారు. తన తనయుడికి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి తీసుకెళ్లి కంబోడియాలో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేయిస్తున్నారని తన కొడుకు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడని చెప్పారు. ఎస్పీ అఖిల్ మహాజన్ చొరవ తీసుకుని కంబోడియాలో చిక్కుకున్న ఆమె తనయుడితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. కంబోడియాలోని ఎంబసీ అదికారులతో మాట్లాడి అక్కడి సైబర్ క్రిమినల్స్ చెర విడిపించి స్వస్థలానికి రప్పించారు. అయితే అంతటితో ఆగకుండా ఎస్పీ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించారు. కంబోడియాలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని చెప్పి మోసం చేసిన ముఠా గురించి ఆరా తీయడం ఆరంభించారు. బాధితునికి ఉద్యోగం ఎరగా వేసి రూ. లక్షా 50 వేలు వసూలు చేసిన జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలానికి చెందిన కె సాయి ప్రసాద్ ను అరెస్ట్ చేశారు. ఆ తరువాత మహారాష్ట్రలోని పూణేకు చెందిన మహ్మద్ అబిద్ హుస్సేన్ అన్సారీని అరెస్ట్ చేశారు. తాజాగా ఈ కేసులో నిందితునిగా ఉన్న బీహార్ రాష్ట్రంలోని ముక్తాపూర్, కళ్యాణ్ పూర్, సమస్తిపూర్ నివాసి అయిన మహ్మద్ షాదాబ్ ఆలంను మూడు రోజుల క్రితం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానశ్రయంలో అరెస్ట్ చేశారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు చెందిన పోలీసు అధికారులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.
భారీ నెట్ వర్క్…
దేశంలో నిరుద్యోగులకు ఉద్యోగాల ఎర వేసి డబ్బులు వసూలు చేస్తూ కంబోడియాకు పంపించే చైన్ నెట్ వర్క్ ఏర్పాటయింది. వివిధ రాష్ట్రాలకు చెందిన వారిని ఏజెంట్లుగా పెట్టుకుని ఒక్కొక్కరికి రూ. 10 వేలకు పైగా కమిషన్ ముట్టచెప్తూ ఉద్యోగాల పేరిట కంబోడియాకు రప్పించుకుంటున్నారు. ఒకరి నుండి మరోకరి అకౌంట్లకు బాధితుల నుండి కలెక్ట్ చేసిన డబ్బులు బదిలీ చేసేవారు. దీంతో అంతా మీడియేటర్లుగానే వ్యవహరిస్తుండడంతో పాటు కంబోడియాలో నిరుద్యోగులచే ఎలాంటి పనులు చేయిస్తారో కూడా అర్థం కాకుండా అక్కడ కాల్ సెంటర్లను ఏర్పాటు చేసిన చైనీయులు భారత్ నుండి వెల్లిన నిరుద్యోగుల పాస్ పోర్టులు లాక్కుని రోజుకు 17 గంటల వరకు పని చేయించేవారు. అయితే వీరంతా కూడా అక్కడకు చేరుకున్న తరువాత కాల్ సెంటర్లలో చేసేది ఉద్యోగం కాదు… సైబర్ నేరాలకు పాల్పడి డబ్బులు అక్రమంగా బదిలీ చేయించుకునే ప్రక్రియ కొనసాగిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లోని వారికి ఫోన్ చేసి వారి వారి అకౌంట్ల నుండి డబ్బులు బదిలీ చేసుకోవడం వంటి నేరాలు చేయించే వారని బాధితులు చెప్తున్నారు. ఇదే తరహాలో ఏపీకి చెందిన వారిని కూడా కంబోడియాకు తీసుకెళ్లిన విషయం వెలుగులోకి వచ్చింది. విశాఖపట్నం సీపీ రవి శంకర్ అయ్యన్నార్ చొరవ తీసుకుని వందలాది మంది యువకులను స్వస్థలాలకు రప్పించారు.