సాధన మాసంగా మే…
దిశ దశ, హైదరాబాద్:
స్వరాష్ట్ర కల సాధన కోసం పోరాటాలు చేసిన ఉద్యమ కారులు మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ప్లీనరీ సమావేశాలు నిర్వహించి ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జూన్ 2 వరకు డెడ్ లైన్ విధించిన ఉద్యమకారులు మే నెల మొత్తం కూడా డిమాండ్లు అమలు చేయించుకునేందుకు సాధన మాసంగా పాటించాలని నిర్ణయించారు. ఉద్యమ కారుల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలన్న డిమాండ్ తో నిర్విరామంగా కార్యక్రమాలు నిర్వహించాలని భావించారు. ఇందులో భాగంగా మే 4 ఆదివారం కరీంనగర్ తారక హోటల్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి సామాజిక ఉద్యమకారులను, రాజకీయ పార్టీల నాయకులను, కార్మిక సంఘాల ప్రతినిధులతో పాటు అన్ని వర్గాల వారిని కూడా భాగస్వాములు చేయాలని నిర్ణయించారు. కరీంనగర్ లో జరపనున్న రౌండ్ టేబుల్ సమావేశానికి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలకు చెందిన ఉద్యమకారులు విధిగా పాల్గొనే విధంగా చొరవ తీసుకుంటున్నారు. ఇక నుండి ఉద్యమకారుల చేపట్టే ప్రతి కార్యక్రమం గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని, తమ పోరాటంలో అన్ని వర్గాల వారి మద్దతు కూడగట్లుకోవాలన్న లక్ష్యంతో ముందుకు సాగాలని భావిస్తున్నారు. మే 10న వరంగల్, 18న హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్, మహబూబ్ నగర్ లో సదస్సు నిర్వహించేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. డిమాండ్ల సాధనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభత్వంపై ఒత్తిడి తీసుకరావాలన్న సకంల్పంతోనే కార్యాచరణ రూపొందించినట్టుగా తెలుస్తోంది. జూన్ 2 నాటికల్లా ఉద్యమకారుల కోసం రాష్ట్ర ప్రభుత్వంచే స్పష్టమైన ప్రకటన చేయించుకోవాలన్న లక్ష్యంతోనే మేనెలను సాధన మాసంగా పాటించాలని భావిస్తున్నట్టుగా స్పష్టం అవుతోంది.