హైదరాబాద్ స్టేట్ స్వాతంత్ర్య దినోత్సవం
దిశ దశ, హైదరాబాద్:
నిజాం నిరంకుశ పరిపానలకు వ్యతిరేకంగా పోరుబాటపై ఇంతకాలం చిన్న చూపే మిగిలిందన్న వేదనకు తోడు రోజుకో కొత్త పేరుతో పిలుస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. 1947లో భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్దించినా హైదరాబాద్ స్టేట్ కు మాత్రం విముక్తి లభించలేదు. దీంతో హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో తమకూ స్వాతంత్ర్యం కావాలన్న డిమాండ్ తో పోరాటం విస్తృతంగా సాగింది. ఓ వైపున సాయుధ పోరాటం… మరో వైపున శాంతియుత పోరాటం వైపు సాగిన యోధులు తమ లక్ష్యం మాత్రం హైదరాబాద్ స్టేట్ విముక్తి కోసమేనని నినదించారు. చివరకు 1948 సెప్టెంబర్ 17న మిలటరీ యాక్షన్ కు శ్రీకారం చుట్టడంతో నిజాం ప్రభువు ఆనాటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు లొంగిపోయారు. అప్పటి నుండి హైదరాబాద్ స్టేట్ విమోచన దినంగా పరిగణిస్తూ నిజాం పరిపాలిత ప్రాంతాల్లో వేడుకలు జరిగాయి. అయితే దేశ వ్యాప్తంగా జరుగుతున్న స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాలే నిజాం పరిపాలత ప్రాంతాల్లో సాగుతున్నాయి. ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్ర పరిధిలోకి చేరిన హైదరాబాద్ ఏరియాలో సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తున్నారు. కానీ మహారాష్ట్రంలోని విదర్భ, తెలంగాణాల్లో మాత్రం సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించేందుకు ఎవరూ సాహసించడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో నవంబర్ 1న అవతరణ దినోత్సవం నిర్వహించినప్పటికీ సెప్టెండర్ 17ను మాత్రం పట్టించుకోలేదు. మొదటి నుండి నిజాం విముక్తి దినంగా పిలుస్తున్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం చేపట్టిన ఉద్యమ సమయం నుండి ఈ దినోత్సవానికి ఎవరికి నచ్చిన రీతిలో వారు పేర్లు పెట్టేస్తున్నారు. కొంతకాలం విలీన దినోత్సవం అని కూడా పిలిచిన రాజకీయ పార్టీలు తమ అస్థిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేశాయి తప్ప సెప్టెంబర్ 17ను మాత్రం అధికారికంగా నిర్వహించేందుకు చొరవ చూపించిన దాఖలాలు మాత్రం లేవు. చివరకు స్వ రాష్ట్ర కల సాకారం అయిన తరువాత జూన్ 2న ఆవిర్భావ దినోత్సవాలు చేస్తున్నప్పటికీ సెప్టెంబర్ 17ను మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. మొదటి నుండి నిజాం పరిపాలన నుండి విముక్తి కల్గి భారత్ లో విలీనం అయినందున హైదరాబాద్ స్టేట్ విమోచన దినోత్సవం జరుపుకునే వారు. కానీ ఆ తరువాత దీనిని విలీన దినోత్సవం అంటూ సరికొత్త పేరను తెరపైకి తీసుకొచ్చారు. తాజాగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్, మంత్రి కేటీఆర్ మరో కొత్త పేరును తెరపైకి తీసుకొచ్చారు. సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని బీఆర్ఎస్ పార్టీ ఘనంగా నిర్వహించాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇప్పటికే సెప్టెంబర్ 17న కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. అయితే ఈ సారి విమోచన… విలీన… దినోత్సవం కాకుండా జాతీయ సమైక్యతా దినోత్సవం పేరిట బీఆర్ఎస్ ఉత్సవాలు జరపనుంది. ఏది ఏమైనా సెప్టెంబర్ 17 మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అధికారికంగా నిర్వహించే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. కానీ సెప్టెంబర్ 17కు మాత్రం కొత్త కొత్త పేర్లు పుట్టుకొస్తుండడం విచిత్రం.