వామన్ రావు దంపతుల హత్య కేసులో మరోకరికి బెయిల్

దిశ దశ, పెద్దపల్లి:

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్గించిన హై కోర్టు న్యాయవాదులు గట్టు వామన్ రావు, పివి నాగమణిల హత్య కేసులో మరో నిందితునికి పెద్దపల్లి కోర్టు బెయిలు మంజూరు చేసింది. ఈ కేసులో ఏ4 నిందితునిగా ఉన్న తుల్సెగారి శ్రీను ఉరఫ్ బిట్టు శ్రీనివాస్ కు పెద్దపల్లి కోర్టు గురువారం బెయిల్ ఇచ్చింది. ఈ కేసులో మొత్తం ఏడుగురి నిందితుల్లో ఇప్పటి వరకు ఐదుగురు నిందితులకు బెయిల్ రాగా కుంట శ్రీనివాస్, చిరంజీవిలు ఇంకా జ్యుడిషియల్ రిమాండ్ లోనే ఉన్నారు. ఏ4 నిందితునిగా ఉన్న బిట్టు శ్రీనివాస్ 40 వేల పూచికత్తుతో రెండు ష్యూరిటీలను కోర్టుకు సమర్పించాలని పెద్దపల్లి కోర్టు ఆదేశించింది.

సంచలన కేసు…

2021 ఫిబ్రవరి 17 మంథని కోర్టుకు హాజరై హైదరాబాద్ కు తిరిగి వెల్తున్న వామన్ రావు, నాగమణిల కారును కల్వచర్ల వద్ద అడ్డగించిన నిందితులు కత్తులతో దాడి చేసి నడిరోడ్డుపై హతం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ కేసులో నిందితులను పట్టుకునేందురు ఆరు స్పెషల్ టీమ్స్ ను పోలీసులు రంగంలోకి దింపాల్సి వచ్చింది. ఇద్దరు కూడా హైకోర్టు న్యాయవాదులు కావడంతో రాష్ట్రంలోని అడ్వకేట్లు కూడా ఈఘటనపై ఆందోళనలు వ్యక్తం చేశారు. వామన్ రావు తండ్రి కూడా సుప్రీంకోర్టు వరకు ఫిర్యాదులు చేసి వామన్ రావు, నాగమణిల హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని అభ్యర్థించారు. వివిధ రాజకీయ పార్టీలు కూడా ఈ మర్డర్ కేసుపై ఆందోళనలు చేపట్టాయి. నార్త్ జోన్ ఐజీ నాగిరెడ్డి క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ఈ కేసును ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. నిందితులను అరెస్ట్ చేసి మీడియాకు కేసు పూర్వాపరాలను వెల్లడించే వరకూ నాగిరెడ్డి రామగుండం కమిషనరేట్ లోనే ఉన్నారంటే అప్పుడు ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో అర్థం చేసుకోవచ్చు. దాదాపు రెండున్నర సంవత్సరాలుగా జ్యుడిషియల్ రిమాండ్ లోనే బిట్టు శ్రీనివాస్ ఉండాల్సి వచ్చింది. ఎట్టకేలకు గురువారం ఆయనకు బెయిల్ రావడంతో మిగతా ఇద్దరు నిందితులు జ్యుడిషియల్ రిమాండ్ లోనే ఉన్నారు. బిట్టు శ్రీనివాస్ పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధుకర్ మేనల్లుడు కావడంతో ఆయన ప్రమేయం ఉందంటూ కూడా ఆరోపణలు చేశారు. అయితే పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేయడంతో పాటు ఆరోజు మధు ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించేందుకు మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఉన్నారు. ఆ తరువాత కూడా మధును విచారించిన పోలీసులు ఆయన ప్రమేయం మాత్రం లేదని తేల్చారు.

You cannot copy content of this page