నెట్ వర్క్ బిజినెస్ అంటూ ఆన్ లైన్ మోసం…

యాప్ పనిచేయకపోవడంతో బాధితుల ఆందోళన

కరీంనగర్ ఆదర్శ్ నగర్ లో ఘటన

దిశ దశ, కరీంనగర్:

నెలకు రూ. 3 వేల చొప్పున చెల్లించండి… మీ ద్వారా మరికొంత మందిని జాయిన్ చేయించండి… ఇలా చేస్తే మీకు ఆదాయం వస్తుంది అని చెప్పి ఘరానా మోసానికి పాల్పడ్డాడంటూ బాధితులు ఆందోళన చేశారు. కరీంనగర్ ఆదర్శ్ నగర్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను బాధితులు వివరించారు. వారు చెప్తున్న సమాచారం ప్రకారం… కూల్ వాలెట్ యాప్ పేరిట ఆన్ లైన్ బిజినెస్ స్టార్ట్ చేసిన ప్రభుద్దుడు గత మూడేళ్లుగా సభ్యుల నుండి రూ. 3 వేల చొప్పున వసూలు చేశాడు. అయితే అతను చెప్పినట్టుగా కొంతకాలంగా తమ చేతికి తిరిగి డబ్బులు రాకపోవడంతో గత ఏడాది కాలంగా తిరిగుతున్నా సదరు వ్యక్తి తప్పించుకుని తిరుగుతున్నాడు. ఇటీవల యాప్ కూడా పనిచేయకపోవడంతో మోసానికి పాల్పడిన వ్యక్తి కోసం ఆరా తీసిన బాధితులు శుక్రవారం ఆదర్శ్ నగర్ లోని అతని ఇంటి వద్ద పట్టుకుని నిలదీశారు. ఇరుగు పొరుగు జిల్లాలకు చెందిన వారు కూడా సదరు వ్యక్తి వలలో చిక్కుకుని మోసపోయారని వారు వివరిస్తున్నారు. వేలాది సంఖ్యలో బాధితులను మోసం చేశాడని, కరీంనగర్ కు చెందిన ఓ వ్యక్తి ఈ యాప్ లో పెట్టుబడులు పెట్టి అప్పుల పాలై మిర్చి బండి పెట్టుకుని జీవనం సాగించాల్సిన పరిస్థితికి చేరుకున్నాడని వారు చెప్తున్నారు. అంతేకాకుండా సదరు బాదితుడు ఆర్థిక పరిస్థితులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడ్డాడని వారు వివరించారు. 20 మందిని చేర్పిస్తే కారు, 40 మంది అయితే మరో గిఫ్ట్ ఇలా మాయమాటలు కూడా చెప్పి తమను నిండా ముంచాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదర్శ్ నగర్ గొడవ గురించి సమాచారం అందుకున్న కరీంనగర్ త్రీ టౌన్ పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. వీరిలో ఒకరు హుజురాబాద్ సమీపంలోని జూపాకకు చెందిన దాసరి విజయ రామరాజుగా స్థానికులు చెప్తున్నారు. ఏది ఏమైనా ఆన్ లైన్ ద్వారా మోసాలకు పాల్పడే వారు పెద్ద సంఖ్యలో తయారయ్యారని, నెట్ వర్క్ బిజినెస్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నా ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తుండడం గమనార్హం.

You cannot copy content of this page