భార్యల ఆందోళనలు ఓ వైపు… కరపత్రాల ప్రచారం మరో వైపు…

రాష్ట్ర పోలీసు విభాగంలో మరో సంచలనం

దిశ దశ, హైదరాబాద్:

రాష్ట్ర పోలీసు విభాగంలో మరో సంచలన ఘటన చోటు చేసుకుంది. తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ విభాగానికి చెందిన కుటుంబాలు ఓ వైపున ఆందోళనలు చేస్తూ ‘‘ఏక్ స్టేట్ ఏక్ పోలీస్’’ అని నినదిస్తుంటే… మరో వైపున కరపత్రాలతో ప్రచారం మొదలైంది. క్రమ శిక్షణకు మారుపేరైన పోలీసు డిపార్ట్ మెంట్ లో పనిచేసే వారు తమ నిరసన తెలిపేందుకు ఆందోళనలు నిర్వహించే అవకాశం లేనందున ఆవేదనను వెల్లగక్కేందుకు కొత్త దారులు వెతుక్కుంటున్నట్టుగా కనిపిస్తోంది. 

కరపత్రం కలకలం

రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఓ కరపత్రం వైరల్ అవుతోంది. ఫోక్సో కేసులో పోలీసు అధికారిపై కేసు నమోదయిన నేపథ్యాన్ని కూడా ఊటంకించిన అజ్ఞాత వ్యక్తులు ఓ బ్యాచ్ పై చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. ఆ బ్యాచుకు చెందిన పోలీసు అధికారులు పోస్టింగుల కోసం ప్రత్యేకంగా ‘‘నిధి’’ని ఏర్పాటు చేసుకున్నారని, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ బ్యాచ్ పోలీసు అధికారులే లా అండ్ ఆర్డర్ పోస్టింగుల్లో కొనసాగే విదంగా చూసుకోవాలని నిర్ణయించుకున్నారంటూ అందులో పేర్కొన్నారు. వారు సమీకరించిన ‘‘నిధి’’ నుండి ప్రజా ప్రతినిధులకు డబ్బులు ఇచ్చి పోస్టింగులు తీసుకుంటున్నారని, ఈ కారణంగానే రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా అదే బ్యాచ్ కు చెందిన వారే పోస్టింగులు పొందుతున్నారని పేర్కొన్నారు.  ఏడాదికి ఒక సారి ఫీజు కూడా చెల్లించి పోస్టింగు పొందుతున్నారని, అవసరమైతే ఎంత డబ్బయినా ప్రజా ప్రతినిదులకు ఇచ్చి పోస్టింగ్ పొందుతారని ఆ కరపత్రంలో వివరించారు. ఈ బ్యాచ్ కు చెందిన కొంతమంది పోలీసు అధికారులను టచ్ చేస్తే రూ. 10 నుండి 50 కోట్ల విలువ చేసే అక్రమ ఆస్తులు బయట పడతాయని పేర్కొన్నారు. గత 8 ఏళ్లుగా జరిగిన పోస్టింగుల వివరాలను సేకరిస్తే ఆ బ్యాచ్ అధికారుల విషయం వెలుగులోకి వస్తోందని, అయితే ఈ విషయంలో పోలీసు ఉన్నతాధికారులకు తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందని కూడా వివరించడం గమనార్హం. ఆ బ్యాచుకు చెందిన కొంతమంది పోలీసు అధికారులు రాజకీయ నాయకుల అడుగులకు మడుగులు ఒత్తే వాళ్లున్నారని కూడా ఆరోపించారు. రాష్ట్రంలోని వరంగల్ కమిషనరేట్, మహబూబాబాద్ జిల్లా రామగుండం కమిషనరేట్, సిద్దిపేట జిల్లాల్లో ఎక్కువగా కంటిన్యూగా పోస్టింగులు పొందుతున్నారని, రాజకీయ నాయకుల అండతో సివిల్, క్రిమినల్ కేసుల్లో అమాయకపు ప్రజలను బెదిరించి అవినీతికి మారుపేరుగా ఈ బ్యాచులోని కొంతమంది అధికారులు నిలుస్తున్నారని పేర్కొన్నారు. ఇంటలీజెన్స్, ఏసీబీ వంటి విభాగాలు వీరి అవినీతి గురించి కంటిన్యూ పోస్టింగుల గురించి కులంకశంగా పరిశీలిస్తే పెద్ద పెద్ద సంచలనాలు బయటపడతాయని కూడా ఆ కరపత్రంలో వెల్లడించారు. ఇంటలీజెన్స్, ఏసీబీ ద్వారా విచారణ జరిపిస్తే విస్తూపోయే అంశాలు బయటపడతాయని కూడా వివరించారు. కీచకంగా వ్యవహరించిన పోలీసు అధికారులను కఠినంగా శిక్షించినట్టయితే ఇలాంటి సంఘటనలు ఇక ముందు జరగకుండా ఉంటాయని, అలాంటి చర్యలకు పూనుకునే వారు భయపడతారంటూ కూడా సూచించారు. 

రాసిందెవరో..?

అయితే అటు పోలీసు వర్గాల్లో, ఇటు సామన్యులకు సంబంధించిన సోషల్ మీడియా గ్రూపుల్లో వైరల్ అవుతున్న ఈ కరపత్రంపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. పోలీసు విభాగానికి చెందిన వారే ఇతర బ్యాచులకు జరుగుతున్న అన్యాయాన్ని భరించలేక ఈ కరపత్రాన్ని వైరల్ చేసినట్టుగా అర్థం అవుతోంది. ఓ బ్యాచుకు చెందిన పోలీసు అధికారులు వరస పోస్టింగుల పరంపర వల్ల శాంతి భద్రతల విభాగంలో పోస్టింగులు దక్కడం కష్టమేనన్న భావనతోనే రాసినట్టుగా స్పష్టం అవుతోంది. ఏది ఏమైనా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ కరపత్రం మాత్రం సంచలనంగా మారింది.

You cannot copy content of this page