ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా తన ఉద్యోగులకు మరో షాక్ ఇచ్చింది. సంస్థలో ఉద్యోగాల తొలగింపునకు సిద్ధమైంది. రానున్న కొన్ని నెలల వ్యవధిలో వేల మందిపై వేటు వేయనున్నట్లు తెలుస్తోంది. పలు దఫాలుగా ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం. గతేడాది మెటా సుమారు 11వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. ఇది అప్పుడు ఆ సంస్థ ఉద్యోగుల్లో 13శాతానికి సమానం. కాగా, ఈ సారి సైతం దాదాపు 11వేల మంది వరకు ఉద్యోగులను తొలగించనున్నట్లు మెటా సంస్థతో సంబంధం ఉన్న వ్యక్తులు వెల్లడించారు.
తమ సంస్థ ఉద్యోగులపై వేటుకు సంబంధించి మెటా వచ్చే వారం తొలి ప్రకటన విడుదల చేయనున్నట్లు సమాచారం. నాన్- ఇంజినీరింగ్ రోల్స్‌ల్లో పనిచేస్తున్న ఉద్యోగులను అధికంగా తొలగించనున్నట్లు తెలుస్తోంది. కొన్ని ప్రాజెక్టులను సైతం ఆపివేయనున్నట్లు వాల్‌స్ట్రీట్ వెల్లడించింది. వీటితో పాటుగా కొన్ని టీమ్‌లను సైతం రద్దు చేయనుందని తెలిపింది. మెటాకు సంబంధించిన హార్డ్‌వేర్, మెటావర్స్ డివిజన్ అయిన రియాల్టీ ల్యాబ్స్‌ల్లో పనిచేస్తున్న ఉద్యోగులను సైతం తీసేయనున్నారు. అయితే దీర్ఘకాలం పాటు కొనసాగే పరిశోధనలపై ఈ వేటు ప్రభావం ఉండబోదని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఉద్యోగుల పెర్ఫార్మెన్స్ ఆధారంగా ఉద్యోగుల వేటు ఉండనుందని మెటా కంపెనీ వర్గాలు తెలిపాయి. ఉద్యోగులపై వేటు కథనం గురించి తెలియగానే అమెరికా స్టాక్ మార్కెట్‌లో మెటా షేర్లు దూసుకెళ్లాయి. కంపెనీ షేర్లు కొనేందుకు ఇన్వెస్టర్లు ఎగబడ్డారు. దీంతో మెటా షేరు విలువ రెండు శాతం పెరిగింది. కాగా, మెటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ జుకర్‌బర్గ్ ఉద్యోగుల తొలగింపుపై గతంలోనే పరోక్ష సూచన చేశారు. కొన్ని ప్రాజెక్టులను నిలిపివేయనున్నట్లు అప్పట్లోనే వెల్లడించారు.
ఇటీవల ప్రముఖ ఐటీ కంపెనీలు వరుసగా తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. వేల సంఖ్యలో ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. ఆర్థిక మాంద్యం కారణంగా 2022లో మొదలైన ఈ లేఆఫ్స్ ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అమెజాన్, మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ వంటి బడా కంపెనీలు భారీగా ఉద్యోగులపై వేటు వేశాయి. 2022 నుంచి ఇప్పటివరకు మొత్తం తొలగించిన ఉద్యోగుల సంఖ్య మూడు లక్షలు దాటిందని అంచనా వేసింది.