దిశ దశ, కాళేశ్వరం:
త్రివేణి సంగమంగా, త్రిలింగ క్షేత్రంగా భాసిల్లుతున్న కాళేశ్వరం క్షేత్రం ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంది. చారిత్రాత్మక పరిశోధనల్లో వేల సంవత్సరాల క్రితమే ఈ క్షేత్రంలో నిత్య వేద పారాయణం జరిగేది. కీకారణ్యాల్లో వెలిసిన ఈ క్షేత్రం గురించి అంతగా ప్రాచూర్యం జరగలేదనే చెప్పాలి.
సూర్యాలయం…
దేశంలోనే చాలా సూర్యాలయాలు వెలిశాయి. కానీ మూడు సూర్యాలయాలు మాత్రమే అనుసంధానంతో ఏర్పాటయ్యాయని కాళేశ్వరం చరిత్ర చెబుతోంది. ఒరిస్సాలోని కోణార్క్, ఏపీలోని శ్రీకాకుళం జిల్లా అరిసెవెల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో వెలిసిన సూర్యాలయాలకు ప్రత్యేకత ఉంది. మూడు ఆలయాలు అనుసంధానంతో వెలిశాయని, ఈ ఆలయాల్లో సూర్య భగవానునికి ప్రత్యేక పూజలు చేసే ఆనవాయితీ కూడా కొనసాగుతోందని ఆలయ అర్చకులు తెలిపారు. మకర సంక్రాతి తరువాత వచ్చే రథ సప్తమి రోజున సూర్యాలయాల్లో ప్రత్యేక ఆరాధనలు నిర్వహించే సాంప్రాదాయం కూడా కొనసాగుతోందని వెల్లడించారు. రాజగోపురం ద్వారా శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకునేందుకు వెల్లేప్పుడు కుడి వైపున ఉన్న సూర్యాలయాన్ని సందర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.
ఆది ముక్తీశ్వరాలయం….
ప్రధాన ఆలయంలో ఒకే పానవట్టంపై యుముడు, శివుడు లింగాకారంలో వెలిసిన చోటే పూజలు చేసేందుకు భక్తులు ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ ఈ క్షేత్రం వెలియకముందే ప్రధాన ఆలయానికి కిలోమీటరు దూరంలో అటవీ ప్రాంతంలో ఆదిముక్తీశ్వర ఆలయం వెలిసింది. శిథిలావస్థలో ఉన్న ఆది ముక్తీశ్వరాలయం అభివృద్దికి ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గా బాధ్యతలు నిర్వర్తించిన దుద్దిళ్ల శ్రీపాద రావు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయించడంతో ఆలయ రూపు రేఖలు మారిపోయాయి. అయితే ఆది ముక్తీశ్వర ఆలయం వద్ద మరో ప్రత్యేకత కూడా ఉంది. ఆలయ పరిసర ప్రాంతంలో భూమిని తవ్వితే రాళ్ళు బయటపడుతాయి. వాటిని పగలగొడితే భస్మం వస్తుందని దీనిని సేకరించేందుకు గతంలో సూదూర ప్రాంతాల నుండి భక్తులు వచ్చేవారు. ఇక్కడ లభ్యం అయ్యే విభూతితోనే ఆది ముక్తీశ్వర స్వామికి పూజలు చేసే ఆనావాయితీ కూడా ఉండేది.