Phone Tapping Case: ఆ ఇద్దరి కోసం మరో ప్రయత్నం…

ఫోన్ ట్యాపింగ్ కేసులో టీజీ పోలీసుల వ్యూహం…

దిశ దశ, హైదరాబాద్:

అమెరికా వెల్లిన ఆ ఇద్దరు నిందితుల కోసం తెలంగాణ పోలీసులు మరో ప్రయత్నం మొదలు పెట్టారు. వారిద్దరిని హైదరాబాద్ కు రప్పించి విచారించాల్సిన అవసరం ఉన్న దృష్ట్యా తమకు అప్పగించాలన్న ప్రతిపాదనతో ముందుకు సాగుతున్నారు. అయితే ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసులకు ప్రయత్నాలు చేసిన పోలీసులు వారిని స్వదేశానికి తీసుకరావడంలో సక్సెస్ కాలేక పోయారు. రెండు దేశాల మధ్య ఉన్న ఒప్పందాన్ని ఆసరాగా చేసుకుని వారిద్దరిని తమకు అప్పగించాలని లేఖ రాశారు.

అమెరికాలో వారు…

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని దుర్వినియోగం చేశారన్న అభియోగాలపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. గత మార్చి నెలలో నమోదయిన ఈ కేసులో విచారణలో, సోదాలు చేసిన హైదరాబాద్ నగర పోలీసులు పలువురు పోలీసు అధికారులను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వారంతా కూడా జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న పోలీసు అధికారులు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. చట్టాలను అనుసరించి తమకు బెయిల్ ఇవ్వాలని అభ్యర్థిస్తూ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ప్రభాకర్ రావు, ఓ టీవీ చానెల్ నిర్వాహకుడు శ్రవణ్ రావులు ఇద్దరు కూడా అమెరికాకు వెల్లడంతో వారిని అరెస్ట్ చేయలేకపోయారు. వారిని ఇక్కడకు రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా అమెరికాలో ఉన్నానని, జూన్ నెలలో తిరిగి వస్తానని కోర్టులో మెమో దాఖలు చేశారు. ఆ తరువాత ఆయన స్వస్థలానికి మాత్రం రాలేదు. శ్రవణ్ రావు కూడా కోర్టులో మెమో దాఖలు చేసి తన సోదరి అనారోగ్యంగా ఉన్నారని ఆమె ఆరోగ్యం కుదుట పడ్డ తరువాత ఇండియాకు చేరుకుంటానని వెల్లడించారు. కానీ ఇంత వరకు ఇద్దరు మాత్రం ఇక్కడకు వచ్చేందుకు ఆసక్తి చూపుతుండకపోవడం గమనార్హం. వీరిద్దరికి రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.ఈ మేరకు ఇంటర్ పోల్ కు సమాచారం కూడా పంపించిగా విదేశీ వ్యవహారల శాఖలో అప్పీల్ చేసుకున్నారు. అయితే తెలంగాణ పోలీసులు కూడా వీరిద్దరి పాసుపోర్టులను రద్దు చేయాలని నిర్ణయించుకుంది. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలన్నింటిని తిప్పి కొడుతున్న రీతిలో ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులు వ్యవహరిస్తున్నట్టుగా స్పష్టం అవుతోంది. మరో వైపున ప్రభాకర్ రావు అమెరికాలో గ్రీన్ కార్డు తీసుకున్నారని దీంతో ఆయన అక్కడి సిటిజన్ గా గుర్తించబడ్డారన్న ప్రచారం అయితే జరిగింది కానీ, అమెరికా నుండి మాత్రం తెలంగాణ ప్రభుత్వానికి అధికారికంగా ఎలాంటి సమాచారం రాకపోవడం గమనార్హం.

తాజాగా…

తాజాగా తెలంగాణ పోలీసులు సరికొత్త వ్యూహాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అమెరికా, ఇండియా దేశాల మధ్య ఉన్న ఒప్పందాన్ని ఊటంకిస్తూ అక్కడ తల దాచుకున్న ఇద్దరు నిందితులను తమకు అప్పగించాలని కోరుతూ లేఖ రాశారు. సీఐడీ విభాగం అధికారులు ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ పంపించగా అక్కడి నుండి అమెరికాకు ఒప్పందాన్ని వివరిస్తూ మరో లేఖ రాయాల్సి ఉంది. ఎక్స్ ట్రడిషన్ ఒప్పందం ప్రకారం వారిద్దరిని తమకు అప్పగించాలని కోరుతూ లేఖ రాయడంతో వారిద్దరు ఇండియాకు పంపించేందుకు అగ్రరాజ్యం నుండి ఎలాంటి స్పందన వస్తుందోనన్న చర్చ మొదలైంది.

అదెలా సాధ్యం…

అగ్రరాజ్యం అమెరికా చట్టాలకు చిక్కకుండా తప్పించుకోవచ్చా..? పెద్దన పాత్ర పోషిస్తున్న దేశంలోనే ఇలా అయితే ఎలా అనేదే పజిల్ గా మారింది. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితునిగా ఉన్న శ్రవణ్ రావు వీసా గడువు ముగిసినా ఆయన అక్కడెలా ఉంటున్నాడన్నదే పజిల్ గా మారింది. ఆయనకు షెల్టర్ ఇచ్చిన వారితో పాటు శ్రవణ్ రావును అదుపులోకి తీసుకుని వారిపై అక్కడి చట్టాల ప్రకారం చర్యలు తీసుకోకుండా ఎలా ఉంటున్నారన్నదే మిస్టరీగా మారింది. ఈ లెక్కన అమెరికా లాంటి దేశంలో కూడా వీసా గడువు ముగిసినా అక్రమ వలస దారునిగా శ్రవణ్ రావు అమెరికాలో ఎలా ఉండగల్గుతున్నారన్న విషయంపై మల్లగుల్లాలు పడుతున్నారు.

You cannot copy content of this page