ఈ సారి సత్రపు గదుల్లో చోరీ
దిశ దశ, మల్యాల:
భక్తులకు కొంగు బంగారంగా నిలిచిన కొండగట్టు అంజన్న సన్నిధిలో మరోసారి దొంగతనం జరగడం కలకలం సృష్టించింది. పట్టు మని పక్షం రోజులు కాకముందే మరో చోరీ ఘటన వెలుగులోకి రావడం సంచలనం సృష్టిస్తోంది. తాజాగా అంజన్న సన్నిధిలోని సత్రం గదుల్లో దొంగతనం జరగిందని ఆలయ అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 23వ తేది అర్థరాత్రి ఆలయంలోకి చొరబడ్డ అగంతకులకు వెండి అభరణాలు ఎత్తుకెళ్లారు. ఈ దోపిడీని సీరియస్ గా తీసుకున్న జగిత్యాల ఎస్సీ భాస్కర్ 10 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి బీదర్ కు చెందిన ఈ ముఠాలోని ముగ్గురు దొంగలను చోరీకి గురైన సొత్తులో కొంత రికవరి చేశారు. అయితే మంగళవారం ఆలయ సత్రాల్లోని 16,17 నంబరు గదుల్లో బస చేసిన భక్తులు స్వామి వారి దర్శనం కోసం ఆలయానికి వెల్లారు. తిరిగి వచ్చే సరికి తాము అద్దెకు ఉన్న టెంపుల్ రూమ్స్ తాళాలు పగలగొట్టి ఉ:డడంతో ఖంగుతిన్నారు. దీంతో భక్తులు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనలో రూ. 6 లక్షల విలువ చేసే బంగారు నగలు, మూడు సెల్ ఫోన్లు కొంత నగదుతో పాటు విలువైన వస్తువులు చోరికి గురయ్యాయని తెలిపారు.
సెక్యూరిటీ వైఫల్యమా…?
సాధారణ భక్తుడు కొండపైకి తమ వాహనంలో వెళ్లాలంటే సవాలక్ష అడ్డంకులు చెప్పే ఆలయ సెక్యూరిటీ చోరీల నియంత్రణ విషయంలో మాత్రం పట్టించుకోని వైఖరి అవలంబించడం విస్మయానికి గురి చేస్తోంది. కొండపైకి వాహనాల రాకపోకలను నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వెనక భాగంలో ఉన్న సత్రపు గదుల్లోనే చోరీ జరిగితే ఇతర ప్రాంతాల్లోని టెంపుల్ సత్రాల పరిస్థితి ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. 15 రోజుల క్రితమే ఏకంగా గర్భాలయంలో చోరీ జరిగినా అప్రమత్తంగా ఉండకపోవడంపై అనుమానాలకు తావిస్తోంది. గర్భాలయంలో చోరీ జరిగిన తరువాత సెక్యూరిటీ ఏజెన్సీకి లేఖ రాశమని ఆలయ ఈఓ తెలిపారు. అయినప్పటికీ మరో సారి రక్షణ చర్యలు విఫలం కావడం వెనక ఎవరి నిర్లక్ష్యం ఉందో అర్థం కావడం లేదు. అలాగే పోలీసులు కూడా కేవలం గర్భాలయ పరిసరాలకే పరిమితం అవుతున్నారని దీనివల్ల కొండకు దిగువన ఉన్న ప్రాంతాల్లో మాత్రం అంతగా గస్తీ చేపట్టడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక్కడి ఔట్ పోస్టులో పోలీసు సిబ్బంది కూడా తక్కువ సంఖ్యలో ఉండడం కూడా మరో కారణమన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా 23వ తేది అర్థరాత్రి దోపిడీ దొంగలు ఏకంగా అంజన్నను నిలువు దోపిడీ చేసుకుని వెల్తే.. ఇప్పుడు భక్తుల గదులను దర్జాగా ఊడ్చేచుకుని వెల్లడం భద్రతా వైఫల్యాన్ని ఎత్తి చూపుతోంది.