దిశ దశ, హైదరాబాద్:
ఎవని పాలైందిరో తెలంగాణ… ఎవడేలుడుతున్నాడురో తెలంగాణ…?
బీఆర్ఎస్ ఏందిరో… టీఆర్ఎస్ ఎటు పాయారో..?
అంటూ పాటలు పాడిన ఆ గొంతుక తన స్వరాన్ని మార్చబోతోందా..? అధికార పక్షాన్ని ఏకీ పారేసి… తెలంగాణ ఉద్యమ లక్ష్యం ఏంటో గుర్తు చేస్తూ నినదించిన ఆ గళం నుండి ఇకముందు వినిపించే పాటలు ఏంటీ..? ఇప్పుడు తెలంగాణ సాంస్కృతిక సమాజం అంతా చర్చించుకుంటున్న విషయం ఇదే. కొద్ది సేపటి క్రితం హైదరాబాద్ లో జరిగిన పరిణామాలతో ఉద్యమాల గడ్డ నల్లగొండజిల్లాలో పుట్టి ఉస్మానియా యూనివర్శిటీలో ఉన్నత చదువులు చదివిన ఉద్యమకారుడు గులాభి కండువా కప్పుకునేందుకు సిద్దమైనట్టుగా కనిపిస్తోంది. వివిధ సోషల్ మీడియా వేదికల్లో షేర్ అవుతున్న ఫోటోలు ఇందుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో తనవంతు పాత్ర పోషించిన ఏపురి సోమన్న అధికార పార్టీలో చేరేందుకు సమాయత్తం అయ్యారు. కొద్ది సేపటి క్రితం మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావును కలిశారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీలు దేశ్ పతి శ్రీనివాస్, దాసోజు శ్రవణ్ లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నామినేటెడ్ పోస్ట్..?
చట్ట సభలకు ప్రాతినిథ్యం వహించాలన్న ఆశయంతో తాను ఉన్నానని గతంలో ప్రకటించిన సోమన్న అనూహ్య పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. అధికార పక్షాన్ని తన పాటలతో చీల్చిచెండాడిన ఆయన వైస్ఆర్టీపీలో చేరారు. అయితే ఆ పార్టీ అధినేత్రి షర్మిల కాంగ్రెస్ పార్టీవైపు తన అడుగులు వేస్తుండడంతో తన రాజకీయ భవిష్యత్తు గురించి సోమన్న ఆందోళన చెందినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకున్నా తన ప్రత్యర్థి ఆ పార్టీలో చేరేందుకు సమాయాత్తం అయినట్టుగా తెలియడంతో తటస్థంగా ఉండాలని భావించికున్నట్టు సమాచారం. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో చివరకు వ్యతిరేకించిన పార్టీ పంచన చేరక తప్పని పరిస్థితి ఏర్పడినట్టుగా భావిస్తున్నారు. దీంతో పాటు చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, దేశ్ పతి శ్రీనివాస్, దాసోజు శ్రవణ్ లు కూడా సోమన్నను మెప్పించి ఒప్పించారని విశ్వసనీయంగా తెలుస్తోంది. దీంతో బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్న ఏపూరి సోమన్నకు కీలకమైన నామినేటెడ్ పదవిని కట్టబెట్టేందుకు కూడా అధిష్టానం ముందుకు వచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే సోమన్న సేవలను బీఆర్ఎస్ ఎలా వినియోగించుకోబోతోంది, ఆయన పార్టీ అభ్యున్నతి కోసం ఎలాంటి క్రీయాశీలక పాత్ర పోషించనున్నారు అన్న వివరాలపై స్పష్టత రావల్సి ఉంది.