విగతజీవిగా మారిన మరో జర్నలిస్టు
జగిత్యాల జిల్లాలో విషాదం
దిశ దశ, జగిత్యాల:
జీవన పోరాటంలో కలంతో ఆరాటపడ్డ మరో జర్నలిస్ట్ గుండె ఆగిపోయింది. అప్పుడే జరిగిన ప్రెస్ మీట్ కవరేజ్ చేస్తుండగానే అస్వస్థతకు గురైన ఆయన ఇంటికి చేరుకుని ట్యాబ్లేట్ వేసుకుందామనుకునే సరికే ఆరోగ్యం విషమించింది. చివరకు ప్రాణాలే కోల్పోయాడా జర్నలిస్ట్.
జగిత్యాలలో విషాదం…
జగిత్యాల జిల్లా కోరుట్ల సెంటర్ నుండి పని చేస్తున్న కిరణ్ (34) సోమవారం మధ్యాహ్నం కానరాని లోకాలకు చేరుకున్నాడు. స్థానికంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ కవరేజ్ కు వెళ్ళగా గుండెలో నొప్పిగా అనిపిస్తోందని మెడిసిన్ కోసం హుటాహుటిన ఇంటికి చేరుకున్నాడు. అంతలోనే మరింత అస్వస్థతకు గురి కావడంతో పొరుగునే ఉన్న తన స్నేహితునికి కాల్ చేసి చెప్పాడు. వెంటనే అతను కిరణ్ ను కారులో ఆసుపత్రికి తరలించినా లాభం లేకుండా పోయింది. ఆసుపత్రికి చేరుకునే సరికే ఆయన ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
ఐదు నెలల గర్భవతి
మూడేళ్ళ ప్రాయానికి చేరుకున్న కొడుకు సంకీర్త్… అచేతనావస్థలో పడి ఉన్న తన తండ్రికి ఏమయిందో తెలియక దిక్కులు చూస్తున్నాడు. ఆయన భార్య పల్లవి ఐదు నెలల గర్భవతి. ఉన్నారు. అందరితో కలివిడిగా ఉండే కిరణ్ ను మృత్యువు కబళించిన విషయం తెలుసుకున్న కోరుట్ల పట్టణ వాసులు హతాశులయ్యారు.
అదే చివరి పలుకు…
అన్న నాకంతా ఎట్లనో అవుతోందే… ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు రావా అన్న అని తన స్నేహితుడు దిలీప్ కు కాల్ చేసి మాట్లాడిన మాటలే చివరివి అయ్యాయి. వెంటనే తన కారు తీసుకుని వచ్చిన దిలీప్ ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చెక్ చేసి చూసి న డాక్టర్ కిరణ్ అప్పటికే ప్రాణాలు వదిలారని చెప్పడంతో షాక్ కు గురయ్యారు.