దిశ దశ, కరీంనగర్:
చూడడానికి చిరు వ్యాపారం చేసే వారిలా కనిపిస్తున్నా వారి వెనక భారీ స్కెచ్ ఉన్నట్టుగా స్పష్టం అవుతోంది. సాదా సీదాగా తిరుగుతున్న వారిని చూసి చిరు వర్తకులే కదా అని అనుకుంటే మొదటికే మోసం వచ్చేలా కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు అంతర్జాతీయ ఉగ్రవాదులు మాత్రమే ఈ బాట పడితే… ఇప్పుడు సైబర్ క్రిమినల్స్ కూడా తమ అతి తెలివిని ప్రదర్శిస్తున్నట్టుగా ఉంది.
ఉగ్రవాదులతో ఆరంభం…
ఉత్తర తెలంగాణా జిల్లాలో వెలుగులోకి వచ్చిన సంఘటనలు గమనిస్తేనే చిరు వ్యాపారుల వేషంలో అసలేం జరుగుతోందన్న విషయం స్పష్టం అవుతోంది. ఉగ్ర సంస్థలతో సంబంధాలు పెట్టుకున్న వారి నుండి మొదలు… సైబర్ క్రిమినల్స్ గా అవతారం ఎత్తిన వారంతా కూడా ఇదే కోవలో పయనిస్తుండడం ఆందోళన కల్గిస్తున్న విషయం. 1998లో జగిత్యాల ప్రాంతంలో షెల్టర్ తీసుకుని ఓ వ్యక్తి రిఫిల్స్ రీ పిల్లింగ్ చేస్తూ ఉపాధి పొందుతున్నట్టుగా నటించాడు. అయితే ఈ ప్రాంతంతో సంబంధం లేని వ్యక్తి ఇక్కడకు ఎందుకు వచ్చాడు అన్న కోణంలో కేంద్ర నిఘా వర్గాలు అప్రమత్తం అయ్యాయి. ఆయన ఎవరూ..? రిఫిల్స్ రీ ఫిల్లింగ్ చేసే పని వల్ల అతనికి వచ్చే ఆదాయం ఎంత..? అన్న వివరాలను సేకరించినప్పుడు సంచలన విషయాలు బయటపడ్డాయి. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐ ప్రతినిధి అయిన అజాం ఘోరీ జగిత్యాల ప్రాంతంలో షెల్టర్ తీసుకుని చిరు వ్యాపారి వేషంలో రెక్కి చేసేందుకు వచ్చాడని తెలుసుకుని ఒక్కసారిగా అప్రమత్తం అయ్యారు. ఇదే క్రమంలో జగిత్యాల పట్టణంలో అర్థరాత్రి పోలీసులకు తారసపడినప్పుడు జరిగిన ఎన్ కౌంటర్ లో హతం అయ్యాడు. 2013 ప్రాంతంలో చొప్పదండి ఎస్బీఐ బ్యాంకు రాబరీ జరిగింది. ఇందులో పాల్గొన్నదెవరన్న విషయం మాత్రం ఎవరికీ అంతు చిక్కలేదు. అగంతకులు తుపాకులు చూపించి దోపిడీకి పాల్పడ్డారని కేసు నమోదు చేశారు పోలీసులు. ఆ తరువాత నల్గొండ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో చొప్పదండి మండలం ఎస్బీఐ బ్యాంకు రాబరీలో ఉన్న నిందుతుడు చనిపోవడంతో రాష్ట్ర పోలీసు యంత్రాంగం అప్రమత్తం అయింది. అంతేకాకుండా పశ్చిమ బెంగాల్ లోని బుర్ద్వాన్ తో పాటు మరో చోట టెర్రరిస్టుల షెల్టర్ జోన్ లో పేలుడు సంభవించడం… ఎన్ఐఏ ఎంట్రీ ఇచ్చినప్పుడు అక్కడ దొరికిన కరెన్సీ బెండిల్స్ లేబుళ్లపై చొప్పదండి బ్యాంకుకు సంబంధించినవి దొరకడం గమనార్హం. అయితే ఈ ఉగ్రవాదుల ముఠా మొదట జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో చిరు వ్యాపారుల వేషంలో తచ్చాడారు. రబ్బర్ బ్యాండ్లు, పిన్స్ వంటివి విక్రయించే వారి వేషంలో బ్యాంకు ముందు సంచరించారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు విచారించి వదిలేశారు. తమను అనుమానిస్తున్న విషయం అర్థం అయిన ఉగ్రవాదులు చొప్పదండి సమీపంలోని ఓ గ్రామంలో షెల్టర్ తీసుకుని ఎస్బీఐ బ్యాంకు రాబరీకి పాల్పడ్డారని నిఘా వర్గాల విచారణలో తేలింది.
కోచింగ్ సెంటర్ల రూపంలో…
కరీంనగర్, నిజామాద్ జిల్లాల్లో కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి యువతను ఆకట్టుకునేందుకు పీఎఫ్ఐ నిర్మాణం కోసం పని చేస్తున్న విషయం తెలిసిందే. కేరళ కేంద్రంగా సాగుతున్న పీఎఫ్ఐని దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించేందుకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చిన వారిని రంగంలోకి దింపారు. ఈ విషయం లీక్ కావడంతో స్థానిక పోలీసులు, జాతీయ దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగడంతో వారికి ఆదిలోనే బ్రేకు పడింది. విద్యా సంస్థలు ఏర్పాటు చేసినట్టయితే అందరి దృష్టి తమపై పడుతుందన్న కారణంగా కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. దీనివల్ల నిఘా వర్గాల కళ్లుకప్పడంతో పాటు యువతను ఆకర్షించే అవకాశం ఉంటుందని భావించింది పీఎఫ్ఐ. ఇవి వెలుగులోకి వచ్చిన సంఘటనలు మాత్రమేనని చెప్పవచ్చు. రెండున్నర, మూడు దశాబ్దాల క్రితం జాతీయ నాయకుల ఫోటోలను అమ్ముకుంటూ జీవనం సాగించే వారిగా, తోపుడ బండ్లపై బ్యాగుల విక్రేతలుగా ఇలా ఎన్నో రకాల చిరు వ్యాపారుల వేషంలో సంచరించినట్టుగా ప్రచారంలో ఉంది.
స్క్రాప్ కొనుగోలు దారులుగా…
ఇప్పటి వరకు ఉగ్ర సంస్థలతో సంబంధం ఉన్నవారే చిరు వ్యాపారుల వేషంలో ఉనికి బయటపడింది. కానీ తాజాగా రామగుండం సైబర్ సెక్యూరిటీ బ్యూరో చేసిన దర్యాప్తుతో మరో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. స్క్రాప్ కొనుగోలు చేస్తున్న వారి వేషంలో వచ్చిన బీహార్ ముఠా పాత మొబైల్ ఫోన్లను కూడా కొనుగోలు చేయడం ఆరంభించింది. అయితే వీరు ఇతర స్క్రాప్ వ్యాపారుల్లా వాటిని హోల్ సేల్ వ్యాపారులకు విక్రయించకుండా మొబైల్ ఫోన్లను ప్రత్యేకంగా స్టోర్ చేసి పెట్టుకుంటున్నారు. ఎన్టీపీసీ మేడిపల్ల ప్రాంతంలో స్క్రాప్ కొనుగోలు దారుల వేషంలో తిరుగుతున్న వీరిపై అనుమానం వచ్చిన రామగుండం సైబర్ సెక్యూరిటీ బ్యూరో స్టేషన్ యంత్రాంగం ప్రత్యేకంగా నిఘా వేయడంతో ఏకంగా నాలుగు వేల ఫోన్లు లభ్యం అయ్యాయి. వీటిని ఏం చేస్తారోనని ఆరా తీస్తే… రిపేర్లు చేసి వాటి ద్వారా సైబర్ నేరాలకు పాల్పడేందుకు ఓ నెట్ వర్క్ ఏర్పాటు చేసుకున్నట్టుగా తేలింది. దీంతో ఒక్కసారిగా అలెర్ట్ అయిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో టీమ్ ఈ ముఠాను అరెస్ట్ చేసింది. బీహర్, ఝార్ఖండ్ నుండి రామగుండం వరకు ఏర్పడిన సైబర్ క్రైం నెట్ వర్క్ ను ఛేధించడంలో సక్సెస్ అయ్యారు. లేనట్టయితే ఆ మొబైల్ ఫోన్ల డిజిటల్ డాటా ఆధారంగా అంతకుముందు వినియోగించిన వారిని పోలీసులు అనుమానించే అవకాశం ఉండేది. ఓ రకంగా చెప్పాలంటే రామగుండం కమిషనరేట్ పోలీసులు చేసిన ఈ ఆపరేషన్ వల్ల వందలాది కోట్లలో జరగనున్న సైబర్ స్కాంను ఆదిలోనే చెక్ పెట్టగా, మొబైల్ ఫోన్లు ఇప్పటి వరకు వాడిన వారిని కూడా సేఫ్ చేశారన్నట్టే. ఇలా చిరు వ్యాపారుల వేషంలో అసాంఘీక శక్తులు రంగంలోకి దిగిన నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.