తెలంగాణాలో పట్టుబడ్డ ఆంధ్రా పోలీసులు: ఎస్ఓటి స్పెషల్ ఆపరేషన్

దిశ దశ, హైదరాబాద్:

ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ (ఏపీఎస్పీ) విభాగంలో పని చేస్తున్న ఇద్దరు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పట్టుబడ్డారు. గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న వీరిని స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటి) పట్టుకుంది. సంఘటనా వివరాల్లోకి వెల్తే… శుక్రవారం ఉదయం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని బాచుపల్లి ఏరియాలో గంజాయి అమ్మేందుకు ఇద్దరు వ్యక్తులు వచ్చారన్న సమాచారం అందుకున్న ఎస్ఓటీ టీమ్ హుటాహుటిన స్మగ్లర్లు ఉన్న ప్రాంతానికి చేరుకుంది. ఏపి 39 క్యూహెచ్ 1763 అనే నెంబరుగల మారుతి కారులో ఉన్న వీరిని పట్టుకుని తనిఖీలు చేపట్టగా అందులో  11 ప్యాకెట్లలో ప్యాక్ చేసిన 22 కిలోలో గంజాయి లభ్యం అయింది. రూ. 8 లక్షల విలువైన ఈ గంజాయిని ఏపీఎస్పీ మూడో బెటాలియన్ కాకినాడకు చెందిన హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుళ్లు శ్రీనివాస్,  సాగర్ పట్నాయక్ గా అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. అనారోగ్య సమస్యలు ఉన్నాయన్న కారణం చూపించి సెలవుపై వీరిద్దరు గంజాయి స్మగ్లింగ్ చేస్తూ ఎస్ఓటీ పోలీసులకు దొరికిపోయారు. పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించాలన్న లక్ష్యంతో వీరు గంజాయి స్మగ్లింగ్ చేయడం ఆరంభించినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. అయితే ఈ దందాకు పాల్పడడం ఇదే మొదటి సారని తెలుస్తోంది. ఎస్ఓటీ పోలీసులు నిందితులను, గంజాయి, కారును బాచుపల్లి పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. బాచుపల్లి పోలీసులు నిందితుల నుండి పూర్తి వివరాలు రాబట్టే పనిలో నిమగ్నం అయ్యారు.

You cannot copy content of this page