పెద్దగుమ్మాడపురం వాసుల పెద్ద మనసు
పిల్లి కూనలను మరిపించే విధంగా పులి పిల్లలు అక్కడ ప్రత్యక్ష్యం అయ్యాయి. చిన్న పులులు అరణ్యం దాటి జనారణ్యంలోకి అడుగు పెట్టాయి. వీధికుక్కలు విరుచుకపడితే పెద్దపులి సంతతికి చెందిన ఈ చిన్న పులులు ప్రాణాలు గాలిలో కల్సిపోతాయని గమనించిన స్థానికులు వాటిని కోడిపిల్లల మాదిరిగా గంప కింద పొదిగేశారు. ఆంధ్ర ప్రదేష్ లోని రాయలసీమ ప్రాంత నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మడాపురంలో ఉన్నట్టుండి నాలుగు పెద్దపులి పిల్లలు ప్రత్యక్ష్యం అయ్యాయి. సమీప అటవీ ప్రాంతం నుండి దారి తప్పిన ఈ పులులు తల్లి పులి కోసం తల్లడిల్లుతూ ఆరా తీసేందుకు అరణ్యం బయటకు వచ్చి ఉంటాయని భావిస్తున్నారు. వనాల మధ్య ఉండాల్సిన పులి పిల్లలు జనాల మధ్యకు చేరడంతో గ్రామస్థులు వాటిని సంరక్షించే బాధ్యతలు తీసుకున్నారు. తల్లి పొదుగుల వద్ద ఒదిగిపోవల్సిన వయసులో అవి అడవి దాటి బయటకు వచ్చాయి. వాటిని గమనించిన గ్రామస్థులు గంపలో పెట్టి ప్రత్యేకంగా ఈ గదిలో ఉంచారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చిన గ్రామస్థులు పులి కూనలను కీకారణ్యాలకు తలరించాలని కోరారు. లేనట్టయితే గ్రామంలోని వీధి కుక్కలు దాడులు చేస్తే వాటి ప్రాణాలకు ప్రమాదంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. బలహీన పరిస్థితుల్లో ఉన్నప్పుడు పులైన పిల్లిలా బ్రతకాల్సిందేనంటే ఇదే మరి… పెరిగి పెద్దదైన తరువాత వేటాడి చంపేసే గుణం కల్గి ఉన్నదని తెలిసీ వాటిని సంరక్షించి మానవత్వం వెల్లివిరిసేలా వ్యవహరించిన పెద్ద మనసు పెద్ద గుమ్మడాపురం వాసులకు ఉండడం కూడా ఆదర్శ ప్రాయమనే చెప్పాలి.