చెల్లని ఓట్ల ఎఫెక్ట్ నరేందర్ రెడ్డికి నష్టం…
దిశ దశ, కరీంనగర్:
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లని ఓట్లు శాసించినట్టుగా కనిపిస్తోంది. గత ఎన్నికలతో పోలిస్తే తక్కువ శాతం ఓట్లు చెల్లని ఓట్లు పడినట్టే అనిపిస్తున్నా ఎక్కువ శాతం ఓట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వి నరేందర్ రెడ్డికి తీరని నష్టాన్ని చవి చూసినట్టుగా కనిపిస్తోంది. రెండో ప్రాధాన్యత, ఎలిమినేషన్ రౌండ్ ద్వారా మూడో స్థానంలో ఉన్న ప్రసన్న హరికృష్ణకు వేసిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించిన తరువాత కూడా 98నరేందర్ రెడ్డి రెండో స్థానానికే పరిమితం అయ్యారు. చివరి క్షణం వరకూ టఫ్ ఫైట్ ఇచ్చినప్పటికీ 5106 ఓట్ల తేడాతో చివరి రౌండు వరకు నరేందర్ రెడ్డి రెండో స్థానానికి పరిమితం అయ్యారు. తొలి రౌండు నుండి చివరి రౌండ్ వరకు కూడా ఆయన రెండో స్థానంలోనే కొనసాగినప్పటికీ నాలుగైదు రౌండ్లలో భారీ మెజార్టీ వచ్చినట్టయితే చిన్నమైల్ అంజిరెడ్డిని అధిగమించే అవకాశం ఉన్న ఆయనకు ఆ స్థాయిలో ఓట్లు పడలేదు. 252029 ఓట్లు పోల్ కాగా ఇందులో 28,686 ఓట్లు చెల్లని ఓట్లుగా గుర్తించిన కౌంటింగ్ అధికారులు 223343 ఓట్లను పరిగణనలోకి తీసుకున్నారు. అయితే చెల్లని ఓట్లలో దాదాపు 10 వేలకు పైగా నరేందర్ రెడ్డికి తొలి ప్రాధాన్యత ఓట్లు పడి ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇందులో చాలా మంది కూడా ఫస్ట్ ప్రయారిటీకి నంబర్ 1 అని వేయకుండా 01 అని బ్యాలెట్ పేపర్ పై రాయడం, ఎన్నికల అధికారులు ఇచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకోకుండా బాల్ పెన్నులు వాడడం, కొంతమంది బ్యాలెట్ వెనక భాగంలో ఓటు వేయడం కారణంగా నరేందర్ రెడ్డికి తీరని నష్టం వాటిల్లిందని చెప్పవచ్చు. చెల్లని ఓట్లలో కనీసం 6 వేల ఓట్లు పరిగణనలోకి తీసుకున్నా నరేందర్ రెడ్డిని విజయం వరించేది. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అయిన సందర్భంగా వి నరేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ఓట్లు వేయాలని అభ్యర్థించాం కానీ ఓటు ఎలా వేయాలోనన్న విషయంపై అవగాహన కల్పించడంలో వైఫల్యం చెందామని కూడా వ్యాఖ్యానించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరుకు పరిపూర్ణమైన అవగాహన కల్పించేందుకు చొరవ తీసుకున్నా ఆయనకు లాభించేది.