కమర్షియల్ కాంప్లెక్సుల వద్ద నిబంధనలు పాటిస్తున్నారా..?

ట్రాఫిక్ క్రమబద్దీకరణ చర్యలపై బల్దియా దృష్టి సారిస్తోందా..?

దిశ దశ, కరీంనగర్:

విస్తరిస్తున్న కరీంనగరంలో ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు బల్దియా తీసుకుంటున్న చర్యలు ఏమిటీ..? అనుమతుల కోసం దరఖాస్తులతో పాటు ఇస్తున్న పత్రాలను చూసి మునిసిపల్ యంత్రాంగం అన్ని సక్రమంగా ఉన్నాయని భావిస్తోంది. కానీ అందుకు అనుగుణంగా కమర్షియల్ కాంప్లెక్సుల వద్ద పార్కింగ్ స్థలాలను వినియోగిస్తున్నారా లేదా అన్న విషయాన్ని పట్టించుకోవడం లేదని స్పష్టం అవుతోంది. భవనాల నిర్మాణ సమయంలో అడపాదడపా తనిఖీలు చేస్తున్న అధికారయంత్రాంగం వాటి ప్రారంభోత్సవం తరువాత ఎందుకు పట్టించుకోవడం లేదన్నదే ప్రశ్నార్థకంగా మారుతోంది. సెట్ బ్యాక్ విషయంలో అయినా, పార్కింగ్ ప్లేసుల విషయంలో అయినా బల్దియా  నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.

గర్ల్స్ హైస్కూల్ రోడ్…

నగరంలో అత్యంత రద్దీగా ఉండే వీధులలో గర్ల్స్ హైస్కూల్ రోడ్ ఒకటి. ఇప్పటికే ఈ ప్రాంతంలో హస్పిటల్స్ తో పాటు ఇతరాత్ర కమర్షియల్ కాంప్లెక్సులు ఉన్నాయి. ఇటీవల ఇదే రోడ్డులో రెండు మాల్స్ కు అనుమతులు ఇచ్చారు బల్దియా అధికారులు. అసలు ఇరుకైన రహదారి కావడంతో పాటు ఎదురెదురుగానే మాల్స్ ఏర్పాటు చేసుకోవడంతో వీటి వద్దకు వచ్చే వినియోగదారుల వాహనాల రాకపోకలతో కిక్కిరిసిపోతోంది. దీంతో ట్రాఫిక్ సమస్య తరుచూ ఎదురవుతుండడంతో పోలీసులు ప్రత్యేకంగా రోడ్ స్టాపర్ల ను డివైడర్లుగా ఏర్పాటు చేశారు. దీని వల్ల ట్రాఫిక్ క్రమ బద్దీకరణ అవుతుందన్న భావనతో ట్రాఫిక్ పోలీసులు ఈ ఏర్పాట్లు చేసినట్టుగా స్పష్టం అవుతోంది.

అసలేం జరుగుతోంది..?

గర్ల్స్ హైస్కూల్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఈ రెండు మాల్స్ ఎంత విస్తీర్ణంలో నిర్మించారు… అందుకు అనుగుణంగా పార్కింగ్ స్థలం ఏర్పాటు చేశారా లేదా అన్నది మాత్రం అనుమానంగానే మారింది. ఇక్కడ తరుచూ ఎదురవుతున్న ట్రాఫిక్ జామ్ మాత్రం ఈ ప్రాంతం మీదుగా వెల్లే వారి సహనాన్ని పరీక్షిస్తోంది. అనుమతుల సమయంలో సెల్లార్ పార్కింగ్ తో పాటు సెట్ బ్యాక్ తీసుకుంటున్నట్టుగా బల్దియా అధికారులకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ అందుకు అనుగుణంగా నిర్మాణాలు చేయలేదన్న విమర్శలు వస్తున్నాయి. రికార్డుల్లో చూపించిన విధానానికి వాస్తవానికి పొంతనలేకుండా పోయిందన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ మాల్స్ లో షాపింగ్ చేసేందుకు వచ్చే వినియోగదారుల వాహనాలతో పాటు ఈ రోడ్డు మీదుగా వచ్చిపోయే ఇతర వాహనాలతో రద్దీ సమయాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. విపరీతంగా పెరిగిపోయిన ఈ ట్రాఫిక్ సమస్య వల్ల ఈ ప్రాంతం మీదుగా వెల్లాల్సిన వారు ఇతర రహదారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి తయారైంది. భవనం నిర్మించిన ఏరియాకు తగ్గట్టుగా పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి తయారైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏకంగా డ్రైనజీ స్లాబుల పైనే వాహనాలను పార్కింగ్ చేస్తున్నారంటే ఇక్కడ నిబంధనలు ఎలా తుంగలో తొక్కుతున్నారో అర్థం చేసుకోవచ్చు.

వ్యాలెట్ పార్కింగ్…

ఇకపోతే ఇటీవల కాలంలో కరీంనగర్ లోని కొన్ని మాల్స్, హోటల్స్ వద్ద వ్యాలెట్ పార్కింగ్ పేరిట ప్రత్యేకంగా సెక్యూరిటీ సిబ్బందిని నియమించి వాహనాలను పార్కింగ్ స్థలాలకు తీసుకెల్తున్నామన్న భ్రమలు కల్పిస్తున్నారు మాల్స్ యజమానులు. ఫోర్ వీలర్స్ కోసం ప్రత్యేకంగా ఈ సౌకర్యాన్ని కల్పించామని వినియోగదారులను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మాల్స్ కు సంబంధించిన పార్కింగ్ ప్లేస్ ఎక్కడ ఏర్పాటు చేశారు, ఎంత దూరంలో ఉంది..? ఇందుకు బల్దియా నుండి అనుమతి తీసుకున్నారా అన్నది మాత్రం అంతుచిక్కడం లేదు. అంతేకాకుండా చాలా వరకు కమర్షియల్ కాంప్లెక్స్ కు సంబంధించిన వ్యాలెట్ పార్కింగ్ ప్రభుత్వ స్థలాల్లోనో రోడ్ల పక్కనో ఏర్పాటు చేసుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి.

అలా ఎలా..?

అంతేకాకుండా వ్యాలెట్ పార్కింగ్ విషయంలో కమర్షియల్ కాంప్లెక్సుల వద్ద సెక్యూరిటీ సిబ్బంది రోడ్లపైనే వాహనాలను తీసుకుంటున్నారు. ఇందుకోసం కమర్షియల్ బిల్డింగులకు సంబంధించిన సెట్ బ్యాక్ స్థలంలో కౌంటర్ ఏర్పాటు చేసి వాహనాలను పార్కింగ్ ప్లేసుకు తరలించాల్సి ఉంటుంది. అయితే రోడ్డుపై వ్యాలెట్ పార్కింగ్ కౌంటర్ ఏర్పాటు చేయడంతో ఆ వాహనంలో వచ్చిన వారు దిగి, టోకెన్ తీసుకుని షాపింగ్ కోసం లోపలకు వెల్లే వరకు కూడా రోడ్లపైనే వాహనాలు నిలిచిపోతున్నాయి. ఈ క్రమంలో సదరు కమర్షియల్ కాంప్లెక్స్ వద్దకు చేరుకున్న ఇతర వాహనాలు కూడా రోడ్డుపైనే నిలిచిపోతుండడంతో ఆ ప్రాంతం మీదుగా వెల్తున్న వాహనాలు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి. ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు కమర్షియల్ కాంప్లెక్స్ నిర్వహకులకు నోటీసులు ఇచ్చి నిబంధనల మేరకు నడుచుకోకపోతే చర్యలు తీసుకుంటామని బల్దియా యంత్రాంగం చొరవ తీసుకోవడం లేదు. దీంతో మాల్స్ వద్ద తరుచూ ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు ప్రత్యేకంగా ట్రాఫిక్ పోలీసులను నియమించాల్సిన పరిస్థితి ఏర్పుడుతోంది. నగరంలో వీఐపీలు టూర్ చేసినప్పుడు అయితే కమర్షియల్ కాంప్లెక్స్ ఏరియాల్లో సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల విషయంలో కూడా ఇదే పరిస్థితి తయారైందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పార్కింగ్ కోసం సెల్లార్ నిర్మాణం చేస్తున్నప్పటికీ అక్కడ జనరేటర్ రూమ్స్, ల్యాబ్స్, స్టోర్స్ రూమ్స్ వంటి ఇతరాత్ర నిర్మాణాలు చేస్తున్నారు. దీంతో ప్రైవేటు ఆసుపత్రులకు వచ్చే పేషెంట్లు, అటెండెంట్స్, విజిటర్స్ వాహనాలన్ని ఆసుపత్రుల ముందు పార్క్ చేస్తున్నారు. మరో పక్కన ప్రైవేటు అంబూలెన్స్ లు అడ్డా ఏర్పాటు చేసుకోవడంతో హస్పిటల్స్ ఏరియాలో విశాలమైన రోడ్లు ఉన్నప్పటికి ఇరుకు ఇరుకుగా మారిపోయాయి. మునిసిపల్ యంత్రాంగం సూపర్ వైజింగ్ చేసిన పార్కింగ్ ఏరియాగా చూపించిన ప్రాంతంలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను తొలగించినట్టయితే కొంతలో కొంతమేర అయినా ట్రాఫిక్ సమస్య తగ్గిపోయే అవకాశం ఉంటుంది.

కఠినంగా వ్యవహరించాలి: బండారి శేఖర్, ఏఐఎఫ్బీ జిల్లా ప్రధాన కార్యదర్శి

కమర్షియల్ కాంప్లెక్సుల విషయంలో మునిసిపల్ యంత్రాంగం కఠినంగా వ్యవహరించాల్సిందే. నిర్మాణ సమయంలో భవనాలు ఎంత ఏరియాలో నిర్మిస్తున్నారో అందుకు అనుగుణంగా పార్కింగ్ స్థలాలు ఉండాలన్న నిబంధనలు ఉన్నాయి. అంతేకాకుండా వ్యాలెట్ పార్కింగ్ విషయంలో కూడా ప్రత్యేక దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉంది. అనుమతులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్న మునిసిపల్ అధికారులు భవనాల నిర్మాణం తరువాత పార్కింగ్ స్థలాలను సద్వినియోగం చేస్తున్నారా లేదా అన్న విషయంపై తనిఖీలు చేయాలి. నిబంధనలు అతిక్రమించిన వారికి నోటీసులు ఇవ్వాల్సిందే. మూడు నోటీసులు ఇచ్చినా స్పందించని కమర్షియల్ కాంప్లెక్సులను సీజ్ చేసినట్టయితే నిర్వహాకులు కూడా నిబంధనల మేరకు నడుచుకుంటారు. లేనట్టయితే రోజు రోజుకు విస్తరిస్తున్న కరీంనగర్ లో ఎక్కడపడితే అక్కడ ట్రాఫిక్ సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది.

You cannot copy content of this page