ప్రజల నాడి పట్టుకోవడంలో విఫలం అయ్యాయా..?

విచిత్రంగా రాజకీయ పార్టీల తీరు…

దిశ దశ, హైదరాబాద్:

ప్రపంచలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న రాజకీయ పార్టీలు. ప్రతి ఐదేళ్లకోసారి తీర్పు కోసం ప్రజల్లోకి వెల్తుంటారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని, ప్రజల అవసరాలు ఏంటో కూడా మాకు తెలుసని పదే పదే నొక్కి వక్కానిస్తుంటారు… రాజకీయ పార్టీల ఆవిర్భావమే ప్రజాస్వామ్య పాలన కోసమేనన్నది కూడా
జగమెరిగిన సత్యం. ఆయా పార్టీలు కూడా అదే విషయాన్ని నిరంతరం వల్లెవేస్తూనే ఉంటాయి. స్వాతంత్ర్య భారతావనిగా ఆవిర్భవించి 77 ఏళ్లవుతున్నా దేశంలోని రాజకీయ పార్టీలన్ని కూడా నేటికి ప్రజల నాడిని పట్టుకోలేకపోయాయని స్పష్టం అవుతోంది. దేశ పౌరుల సమగ్రతను కాపాడడమే లక్ష్యంగా పనిచేస్తామని, నిరుపేదల అభ్యున్నతి కోసం శ్రమిస్తున్నామని పదేపదే వల్లెవేసే పొలిటికల్ పార్టీలు చేస్తున్న ప్రకటనలకు వ్యవహరిస్తున్న తీరుకు ఏ మాత్రం పొంతన లేకుండా పోతోంది.

గతంలో అలా…

అయితే రాజకీయ పార్టీలు అటు ప్రజా క్షేత్రంలో అందరిని మెప్పించి ఒప్పించేందుకు పనిచేస్తూనే ప్రత్యర్థి పార్టీల ఎత్తులు చిత్తు చేస్తూ ముందుకు సాగుతుంటాయి. ఎన్నికలు సమీపించిన
సమయంలో అయితే అంతుచిక్కని వ్యూహాలతో ప్రత్యర్థి పార్టీలను ముప్పుతిప్పలు పెడుతూ ప్రజల్లో తామే బెటర్ అన్న భావన కల్పించేందుకు భారీ వ్యూహాలనే రచిస్తాయి. ఇందుకు
తగ్గట్టుగగానే ఆయా పార్టీల నాయకులు కూడా క్షేత్ర స్థాయిలో ప్రచారాన్ని కొనసాగిస్తుంటారు. ప్రజలు తమ పార్టీకి వ్యతిరేకంగా ఇచ్చే తీర్పుపై రివ్యూ చేసుకుని తిరిగి వారి మన్ననలు పొందేందుకు అవసరమైన విధంగా పావులు కదుపుతూ ఉంటాయి. ఇంతకాలం కూడా ఇదే విధానంతో ముందుకు సాగిన రాజకీయపార్టీలు తమ ఎత్తులను వ్యూహాత్మకంగా వేస్తూ… ప్రత్యర్థి పార్టీల ఎత్తులను చిత్తు చేసే దిశగా అడుగులు వేశాయి. దేశ వ్యాప్తంగా కూడా ఇదే పద్దతిని పాటించి ఆయా రాజకీయ పార్టీలు ప్రజలను తమకు అనుకూలంగా మల్చుకోవడంలో సక్సెస్ అయ్యాయి. జాతీయ, అంతర్జాతీయ అంశాలను కూడా ప్రజలకు వివరించేందుకు ఆనాటి పొలిటికల్ పార్టీలు తీవ్రంగా కృషి చేసి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి.

వ్యూహానికే… వ్యూహమా..?

అయితే ప్రత్యిర్థి పార్టీలను బలహీనపర్చే అంశాలపై కూడా కసరత్తులు చేసి వాటి బలహీనతలపై దెబ్బకొట్టే విధంగా వ్యూహం రచించుకున్న పొలిటికల్ పార్టీలు దశాబ్ద కాలానికిపైగా ఎత్తుగడలను మార్చుకున్నాయి. ప్రజా క్షేత్రంలోకి వెల్లాలంటే తామిక ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవల్సిందేనని భావించి వ్యూహకర్తల కోసం అన్వేషించడం మొదలుపెట్టాయి. సోషల్ మీడియా వేదికల్లో అప్పటికే తమ వంతు ప్రచారాలను ప్రారంభించిన పొలిటికల్ పార్టీలు స్ట్రాటలాజిస్టులను ఆశ్రయిస్తున్నారు. ఏడు దశాబ్దాలకు పైగా తమపై తమకు ఉన్న విశ్వాసాన్ని సడలించుకున్న రాజకీయపార్టీలు ఇప్పుడు వ్యూహకర్తలను ఆశ్రయించడం విచిత్రమే. ఏడు దశాబ్దాలుగా ప్రజాక్షేత్రంలో ఉన్న పొలిటికల్ పార్టీలు నేటికి కూడా ప్రజల నాడిని పట్టుకోవడంలో విఫలం అయ్యామని భావించి వ్యూహకర్తలను ఆశ్రయిస్తున్నారా లేక ప్రజలను తమకు అనుకూలంగా మల్చుకోవాలంటే కొత్తదనాన్ని అందించలేకపోతున్నామని ఒప్పుకుంటున్నారో తెలియదు కానీ… నిత్యం ప్రజలతో మమేకం అయ్యే రాజకీయ పార్టీలు మాత్రం స్ట్రాటలాజిస్టులను ఆశ్రయిస్తుండడం మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. ఈ విధానంతో తమ పార్టీని… సిద్దాంతాలను కూడా వ్యూహకర్తల చేతుల్లో పెట్టి… వందల కోట్లల్లో డబ్బులు వారికి అప్పగించి మరీ వారి చెప్పుచేతల్లో ఒదిగిపోతున్నాయి. అన్ని రాజకీయపార్టీలు కూడా ఇదే విధానంతో ముందుకు సాగుతుండడంతో వ్యూహకర్తలకు డిమాండ్ తీవ్రంగా పెరిగింది. వారికి బ్రాండ్ కూడా ఇచ్చేస్తున్న పొలిటికల్ పార్టీలు స్ట్రాటలాజిస్టు ఏజెన్సీ అయితే తమ దశ తిరుగుతుందన్న భ్రమల్లోకి చేరుకోవడం కూడా విస్మయానికి గురి చేస్తోంది. స్వాతంత్ర్య పోరాటంలో దేశ ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చి బ్రిటిషర్లను వెనక్కి పంపిన ఘనకీర్తిని మూటగట్టుకున్న పార్టీలు
కూడా వ్యూహకర్తల కనుసన్నల్లోనే పార్టీని నడుస్తున్నాయి. నిత్యం ప్రజల్లో ఉండే రాజకీయ పార్టీలే పబ్లిక్ పల్స్ పట్టుకోలేకపోవడం వల్లే వ్యూహకర్తల సేవలను కోరుకుంటున్నాయి. అంటే ప్రజా సంక్షేమమే పరమావధి… తమ విధి అంటూ ప్రగల్భాలు పలికే పొలిటికల్ పార్టీలన్ని కూడా ఆచరణలో ఫెయిల్ అయ్యామని చెప్పకనా చెప్తున్నాయా లేక… ఓటర్లను
ఏమార్చలేకపోతున్నాయా అన్న అంశంపై ఆత్మపరిశీలన చేసుకోవల్సిన అవసరమయితే ఉంది.

You cannot copy content of this page