ఆదేశాలు అలా… చేతలేమో ఇలా… గ్రానైట్ రవాణా తీరుపై విమర్శలు

దిశ దశ, కరీంనగర్:

క్రమాలు చోటు చేసుకుంటున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నా పట్టించుకునే వారు లేకుండా పోయారా..? గ్రానైట్ బ్లాకుల అక్రమ తరలింపు విషయంలో కఠినంగా ఉండలేకపోతున్నారా..? ఓ వైపున రాష్ట్ర ప్రభుత్వం పకడ్భంధీగా వ్యవహరించాలని ఆదేశించినా క్షేత్ర స్థాయిలో అసలు జరుగుతున్నదేంటీ..? మైన్స్ అండ్ జియోలాజీ ఉన్నతాధికారులు కూడా గ్రానైట్ తవ్వకాల విషయంలో ప్రత్యేక దృష్టి సారించినా లాభం లేకుండా పోతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

విజిలెన్స్ రిపోర్ట్…

కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుండి విదేశాలకు ఎగుమతి అయిన గ్రానైట్ బ్లాకుల విషయంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని గతంలోనే విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక సారాంశం ప్రకారం బాధ్యులైన వారి నుండి 1 ప్లస్ 5 పెనాల్టీ వసూలు చేయాలని కూడా తేల్చారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ పెనాల్టీని వన్ ప్లస్ వన్ గా తగ్గిస్తూ ఓ మెమో విడుదల చేసింది. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కూడా ఫిర్యాదులు వెల్లడంతో ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ కూడా ఎంట్రీ ఇచ్చింది. గ్రానైట్ క్వారీల్లో సోదాలు చేసి రూ. కోటి వరకు రికవరీ చేయగా చైనాకు చెందిన పనామా కంపెనీ ద్వారా ఆర్థిక లావాదేవీలు జరిగాయని తేల్చారు. ఆ తరువాత ఈ కేసు మరుగున పడిపోగా ఈడీ దర్యాప్తు అర్థాంతరంగా ఆగిపోయిందన్న విషయంపై కోర్టులను కూడా ఆశ్రయించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం విధించిన వన్ ప్లస్ వన్ పెనాల్టీలో కూడా మొత్తం డబ్బులు చెల్లించలేదని వాటిని ఎందుకు రికవరీ చేయడం లేదని ప్రశ్నిస్తున్న వారు ఒకవైపు అయితే… మరో వైపున మైనింగ్ యాక్ట్ ప్రకారం వన్ ప్లస్ 5 జరిమానాను ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించే అధికారం లేదని అంటున్నారు మరికొందరు.

డైరక్టర్ ఆదేశాలు…

తాజాగా రాష్ట్రంలో గ్రానైట్ క్వారీల్లో ఇష్టారాజ్యంగా అక్రమాలు చోటు చేసుకున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన గ్రానైట్ క్వారీలను బ్లాక్ లిస్టులో చేర్చినప్పటికీ వాటిల్లో అక్రమ మైనింగ్ జరుగుతోందని గుర్తించారు. రాష్ట్రంలో 261 క్వారీలు బ్లాక్ లిస్టులో ఉన్నాయని వాటిల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మైనింగ్ జరగవద్దని కట్టడి చర్యలు తీసుకోవాలని మైన్స్ అండ్ జియోలాజీ డైరక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఆయా క్వారీల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు వివిధ విభాగాల నేతృత్వంలో టాక్స్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని కూడా స్పష్టం చేశారు. ఇదే సమయంలో గ్రానైట్ క్వారీలను మైన్స్ అదికారులు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ కూడా చేస్తున్నారన్న ప్రచారం జరిగింది బ్లాకులో చేర్చిన క్వారీల్లో కరీనగర్ జిల్లాలోనే 67 ఉండగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 90 వరకు ఉన్నాయి. ఈ లెక్కన మూడు వంతులకు పైగా బ్లాక్ చేసిన క్వారీలు ఉమ్మడి జిల్లాలోనే ఉన్నట్టుగా స్పష్టం అవుతోంది.

సస్పెన్షన్…

మైన్స్ అండ్ జియోలాజీ విభాగంలో ప్రక్షాళన చేసే పనిలో ఉన్నతాధికారులు నిమగ్నం అయ్యారు. ఈ నెల 7న మైన్స్ అండ్ జియోలాజీ జాయింట్ డైరక్టర్ ఇంచార్జి వరంగల్ డిప్యూటీ డైరక్టర్ ఎ వెంకటేశ్వర్లు, కరీంనగర్ మైన్స్ అండ్ జియోలాజీ అసిస్టెంట్ డైరక్టర్ రమణా చారిలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. వీరిద్దరూ అక్రమ మైనింగ్ కార్యకలాపాలను నిరోధించడంలో విఫలం అయ్యారని, ప్రత్యేకంగా కరీంనగర్ జిల్లా గ్రానైట్ క్వారీల విషయంలో వీరి వైఫల్యం ఉందని అధికారులు వెల్లడించారు.

పట్టివేత…

అయితే క్వారీల్లో అక్రమ తవ్వకాలు, అనుమతులకు మించి రవాణా చేస్తున్నారన్న విషయంలో కఠినంగా వ్యవహరించాలని అటు ఉన్నతాధికారులు ఆదేశాలు ఇస్తున్నారు. ఇదే క్రమంలో క్రమ శిక్షణా చర్యలకు కూడా శ్రీకారం చుట్టారు. అయినప్పటికీ ఇద్దరు అధికారులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడిన రోజునే గ్రానైట్ బ్లాకులు తరలిస్తున్న లారీల్లో ఓవర్ లోడ్ ఉందని అదికారులు పట్టుకున్నారు. తిమ్మాపూర్ ఆర్టీఏ కార్యాలయానికి తరలించిన ఈ లారీలకు రవాణా, మైన్స్ అండ్ జియోలాజీ అధికారులు పెనాల్టీ వేస్తున్నట్టుగా తెలిపారు. గత కొద్ది రోజులుగా కరీంనగర్ గ్రానైట్ వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి సారించారన్న విషయం మైనింగ్ విభాగం అధికారులకు తెలిసినప్పటికీ కూడా కఠినంగా వ్యవహరించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కట్టడి చర్యలు…

అయితే గ్రానైట్ బ్లాకుల కటింగ్ విషయంలో కొంత మార్జిన్ ఉంచే విధానం చాలా కాలంగా అమలు అవుతున్నట్టుగా గ్రానైట్ క్వారీల నిర్వాహకులు చెప్తున్నారు. కటింగ్ చేసేప్పుడు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటున్నందున్న ఈ విధానం అమలు చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఈ ఒక్క అవకాశాన్ని అడ్వంటేజ్ గా తీసుకుని ఇష్టం వచ్చినంత మేర బ్లాకులన్ కట్ చేసి రవాణా చేయడం సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక్కో బ్లాకుకు 5 నుండి 10 సెంటి మీటర్ల మేర అదనంగా కట్ చేసుకునే అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది కానీ ఇష్టారీతిని బ్లాకుల సైజులు పెంచి డ్యామేజీ కోసం అన్న సాకు చూపిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారణ చేసేందుకు మైన్స్ అండ్ జియోలాజీ అధికారులు పకడ్భందీ చర్యలు తీసుకోవల్సిన అవసరం ఉంది.

You cannot copy content of this page