దిశ దశ, భూపాలపల్లి:
కౌంటర్ అటాక్ లో సెల్ఫ్ గోల్ అవుతున్నారా..? ఓ తప్పిదాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో మరో తప్పిదాన్ని వెలుగులోకి తీసుకొస్తున్నారా..? కాళేశ్వరం వైఫల్యంపై చేస్తున్న కౌంటర్ అటాక్ చేసే ప్రయత్నంలో అసలు జరుగుతున్నదేంటి..?
మేడిగడ్డ కుంగుబాటుతో…
మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ కుంగుబాటుతో కాళేశ్వరం అంశాన్ని ప్రతిపక్ష పార్టీలు అవకాశంగా మల్చుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా ఈ అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాయి. అయితే దీనికి కౌంటర్ ఇస్తున్న తీరే అధికారులను ఇరకాటంలో పెడుతున్నాయన్న చర్చ సాగుతోంది. ఊరు, పేరు లేకుండా సోషల్ మీడియాలో షేర్ అవుతున్న స్టోరీలను కొంతమంది ఇరిగేషన్ ఇంజనీర్లు కూడా గ్రూపుల్లో తోసేస్తున్నారు. అయితే ఇందులో తమను వెనుకేసుకొచ్చే విధంగా ఉన్నాయన్న ఆలోచనతో షేర్ చేస్తున్నారు కానీ సాంకేతిక నిపుణులైన ఇంజనీర్ల తప్పిదాలను వెలుగులోకి తీసుకొస్తున్నామన్న విషయాన్ని విస్మరిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తమ హయాంలో చేపట్టిన ప్రాజెక్టు విషయంలో వస్తున్న ఆరోపణలను తిప్పి కొట్టే ప్రయత్నంలో గతంలో జరిగిన మిస్టేక్స్ ను వెలుగులోకి తీసుకొస్తున్నారు. అయితే ఇతర ప్రాంతాల్లో డిజైన్ చేసింది కూడా తమలాంటి ఇంజనీర్లేనని, తాము పనిచేసిన శాఖలో పనిచేస్తున్న వారేనన్న విషయాన్ని పట్టించుకోకపోవడం ఏంటన్నదే అంతుచిక్కకుండా పోయింది.
ప్రభుత్వాలు మారడం కామన్…
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ తప్పిదాలను ప్రతిపక్షా పార్టీలు ఎత్తి చూపి ఎన్నికల ప్రచారం బిజీలో పడిపోయాయి. కానీ ఇందుకు సంబంధించిన కౌంటర్ అటాక్ మాత్రం సోషల్ మీడియా వేదికగా కొనసాగుతూనే ఉంది. వీటిని ఇరిగేషన్ ఇంజనీర్లు మెయింటెన్ చేసే గ్రూపుల్లో ఇరిగేషన్ అధికారులే షేర్ చేస్తుండడం మరో విచిత్రం. ప్రజా స్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ ద్వారా పరిపాలన కొనసాగించేది రాజకీయ పార్టీలు. తిరిగి ప్రజల మద్దతు ఉంటే అధికారంలో వస్తాయి లేనట్టయితే ప్రతిపక్ష పాత్ర పోషిస్తాయి. కానీ ప్రభుత్వ అధికార యంత్రాంగం మాత్రం రిటైర్ అయ్యే వరకూ బాధ్యతల్లోనే కొనసాగుతారు. అంతేకాకుండా తప్పులు జరిగితే శాఖా పరంగా క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు, తీవ్రమైన తప్పిదాలు జరిగినట్టయితే క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యే అవకాశం లేకపోలేదు. అంతేకాకుండా ప్రజాస్వామ్య పద్దతిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజకీయ నేతలపై క్రిమినల్ కేసులు నమోదయినప్పుడు కూడా సంబంధిత శాఖల అధికారులపై కూడా క్రిమినల్ కేసులు నమోదయిన సందర్భాలూ లేకపోలేదు. ఇలాంటి సంఘటనలు గుర్తు పెట్టుకోకుండా కాళేశ్వరం విషయంలో వస్తున్న ప్రత్యారోపణలను పెంచి పోషించడానికి అధికారులు కూడా సాహసిస్తుండడం సరికొత్త చర్చకు దారి తీస్తోంది. అంతేకాకుండా తమ శాఖకు చెందిన సహచర ఇంజనీర్ల గుట్టును కూడా సమాజం ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు పరోక్షంగా చేస్తున్నారన్న విషయాన్ని కూడా పసిగట్ట లేకపోతున్నారా అన్న డిస్కషన్ కూడా సాగుతోంది.
ఇప్పటి వరకు…
గతంలో ఉన్న విధానానికి ప్రస్తుత నెలకొన్న పరిస్థితులు భిన్నంగా మారిపోయాయనట్టుగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజకీయ పార్టీలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం సాధారణంగా సాగుతున్న తంతే. కానీ నేడు ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికార యంత్రాంగం కూడా ఆరోపణలపై ఎదురు దాడులకు దిగుతుండడం గమనార్హం. పొలిటికల్ పార్టీల మధ్య సాగే మాటల యుద్దంలో ఇప్పుడు ప్రభుత్వ అదికార యంత్రాంగం కూడా ఇన్ వాల్వ్ కావడం వల్ల సమిధలవుతున్నారన్న విషయాన్నిగుర్తెరగాల్సిన ఆవశ్యకత ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంతకాలం వివరణలు ఇవ్వడానికే పరిమితం అయిన అధికార యంత్రాంగం ఇప్పుడు విమర్శలు చేసే స్థాయికి చేరడమే అందరిని విస్మయపరుస్తోంది.