దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ ఎమ్మెల్యేగా నాలుగు సార్లు గెలిచి రికార్డు క్రియేట్ చేసిన గంగుల కమలాకర్ సొంత పార్టీ నాయకులతో విబేధాలు పెట్టుకున్నారా..? పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులతో కమ్యూనికేషన్ గ్యాప్ పెంచుకున్నారా..? నాయకుల మధ్య నెలకొన్న అభిప్రాయ బేధాల వల్ల గులాభి పార్టీకి తీరని నష్టం వాటిల్లే అవకాశం ఉందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. తాజాగా సిట్టింగ్ మేయర్ యాదగిరి సునీల్ రావు బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సరికొత్త చర్చకు దారి తీశాయి.
నాడు సర్దార్… నేడు సునీల్…
కరీంనగర్ మేయర్ గా బాధ్యతలు నిర్వర్తించిన సర్దార్ రవిందర్ సింగ్ తో కూడా గంగులకు కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నట్టుగా గతంలోనే పలు సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. కరీంనగర్ ఎమ్మెల్యే టికెట్ పై సర్దార్ దృష్టి సారించారన్న కారణంతో ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు పొడసూపాయని పార్టీ వర్గాలు చెప్తుండేవి. దీంతో వీరిద్దరు కూడా చాలా కాలంగా ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరించే వారు. అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు లాంటి ముఖ్య నేతలు వచ్చినప్పుడు మాత్రమే ఇద్దరు కనిపించే వారు. గంగుల కమలాకర్, రవిందర్ సింగ్ లు కలిసి మీడియా సమావేశాల్లో పాల్గొన్న సందర్బాలు కూడా చాలా తక్కువే. వీరిద్దరి మధ్య సయోధ్య లేదన్న విషయం పార్టీ క్యాడర్ కూడా చర్చించుకున్న సందర్భాలు ఉన్నాయి. తాజాగా బీజేపీలో చేరిన యాదగిరి సునీల్ రావు కూడా గంగుల కమలాకర్ లక్ష్యంగానే విమర్శలు చేశారు. తాను ఐదేళ్ల పాటు ఎన్నో రకాల అవమానాలకు గురయ్యానని కూడా సునీల్ రావు వ్యాఖ్యానించారు. అంతేకాకుండా గంగుల అవినీతితో పాటు వ్యసనాల గురించి కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే సునీల్ రావు చేసిన ఈ వ్యాఖ్యలను బట్టి బీఆర్ఎస్ పార్టీ నుండి కరీంనగర్ మేయర్లుగా వ్యవహరించిన ఇద్దరితోనూ సఖ్యత లేదని స్ఫష్టం అవుతోంది.
కార్పోరేటర్లలోనూ…
బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పోరేటర్లలోనూ చాలా కాలంగా అంతర్మథనం సాగుతోంది. స్మార్ట్ సిటీతో పాటు వివిధ పథకాల ద్వారా కరీంనగర్ కు వచ్చిన నిదుల విషయంలో తమకు తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్న వారే ఎక్కువ. ఎన్నికల సమయంలో మొక్కుబడిగా ఖర్చులు ఇచ్చి చేతులు దులుపుకున్నారని, తమను విదేశాలకు తీసుకెల్తానని మాట ఇచ్చి ఎమ్మెల్యే గంగుల ఆచరణలో పెట్టలేదన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టు పనుల్లో జోక్యం చేసుకునే అవకాశం లేకుండా తమను ఉత్సవ విగ్రహాల్లో మార్చి వేశారని కూడా కొంతమంది కార్పేరేటర్లు వాపోతున్నారు. తమకు తీరని అన్యాయం చేశారని, మళ్లీ ఎన్నికల బరిలో నిల్చోవాలంటే అప్పులు చేయాల్సిన దీన స్థితిలో కొట్టుమిట్టాడుతున్నామని అంటున్న వారూ లేకపోలేదు. ఈ లెక్కన సిట్టింగ్ ఎమ్మెల్యేకు, బల్దియా ప్రతినిధులకు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నట్టుగానే స్ఫష్టం అవుతోంది.
కారణమదేనా..?
అయితే కరీంనగర్ నగరంలో జరిగిన అభివృద్ది పనుల్లో పర్సెంటీజల పర్వం కొనసాగిందని, గంగుల కమిషన్లు తీసుకున్నాడని చిట్టా అంతా కూడా తనవద్ద ఉందని మేయర్ సునీల్ రావు చేసిన వ్యాఖ్యలు కరీంనగర్ వాసుల్లో సరికొత్త చర్చకు దారి తీస్తున్నాయి. కరీంనగరానికి నిధుల వరదతో పాటు కమిషన్ల వరద కూడా పారిందన్న విషయం బహిరంగం అయింది. కమిషన్ల విషయంలోనే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధుల మధ్య అభిప్రాయ బేధాలు తీవ్ర రూపం దాల్చినట్టుగా పార్టీ వర్గాల్లో అయితే చర్చ సాగుతోంది. ఇటీవల కాలంలో వేల కోట్ల రూపాయలు నగరాభివృద్దికి మంజూరైనా కమిషన్లు మాత్రం కిందిస్థాయి ప్రజా ప్రతినిధుల చేతికి రాలేదని బహింరంగంగానే చెప్పుకుంటున్నారు. మరో వైపున సునీల్ వ్యవహార శైలితో పాటు ఆయన కూడా అవినీతికి పాల్పడ్డాడంటూ బీఆర్ఎస్ నాయకులు కూడా విమర్శలు చేస్తుండడం గమనార్హం. బీఆర్ఎస్ అధికారంలో కోల్పోయిన తరువాత అవినీతి ఆరోపణలు బహిరంగం అవుతుండడం వల్ల ప్రజల్లో కూడా వ్యతిరేక భావన బలంగా నాటుకపోయే ప్రమాదం లేకపోలేదన్నది వాస్తవం. దీనివల్ల పార్టీ మరింత ప్రతికూలతను ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే అధికారంలో ఉన్నప్పుడు అవినీతి వ్యవహారాలను పరోక్షంగా పెంచి పోషించారన్న అపవాదును కూడా బీఆర్ఎస్ నాయకత్వం మూటగట్టుకుంటుందన్న విషయాన్ని ఆ పార్టీ నాయకులు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.